చరాచర జగత్తులో మానవుడు మాత్రమే మహా శక్తివంతుడు మరియు యుక్తిమంతుడు. సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు, అసాధ్యాలను సుసాధ్యాలూ
చేయగలడు..అంతరిక్షాన్ని మరియు సాగర గర్భాన్ని సహితం శోధించి ఫలితాలను రాబట్టగలడు. ఈవిధంగా మానవుడు తన శక్తితో పైపైకి దూసుకుపోతున్నా, మనిషిగా వెనక్కి అడుగులు వేస్తూ అగాథం లోకి దొర్లుకుపోవడం శోచనీయం... అంతులేని స్వార్థం, గర్వం, అసూయ, అభిజాత్యం నింపుకుని, మానవతా విలువలకు తిలోదకాలిచ్చి దానవుడిగా మారిపోవడం గమనార్హం. రోజురోజుకూ పరహితానికి, ధర్మాధర్మాలకు, ఆచారవ్యవహారాలకు, నైతిక విలువలను, కట్టుబాట్లకు దూరమవుతున్నాడు. శాంతి యుత సహజీవనానికి మన పూర్వీకులు నిర్దేశించిన విధివిధానాలను నెట్టేయడం వల్ల, ఆవేశ కావేషాల మధ్య జీవన సమరం సాగిస్తూ చీకటి బ్రతుకు సాగిస్తున్నాడు. ఇలా చీకటి జీవనం సాగిస్తున్న వారిలో వెలుగులు నింపి ముందుకు నడిపించే మనిషే మహానీయుడు. చతికిల పడిన బానిస జాతికి స్వేచ్ఛా స్వాతంత్రాలు నందించి వారు లేచి నిలిచేలా ఊతం అందించిన వారు కొందరైతే, ప్రపంచం పై దాడి చేసిన విషక్రిములను నిలువరించే వాక్సిన్ తో మానవాళిని రక్షించిన మహానుభావులు మరికొందరు.ఇలా ప్రజల గుండెల్లో ఆనందజ్యోతులు వెలిగించే వారిని సదా స్మరించుకోవాలి...తరాల మధ్య అంతరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రుల పట్ల, దేశం పట్ల ప్రేమాభిమానాలు సన్నగిల్లుతున్న వేళ, తిరిగి వాటికి ప్రాణప్రతిష్ట చేసే విధంగా హృదయాలను ఒకటి చేసి , తరాల మధ్య అంతరాలను తొలగించి , నేను నా వాళ్లనే భావనకు ఊపిరి నిచ్చి, నా ఒక్కడినే అనే దురాలోచన, దుష్ట భావనలు తగ్గించి,మదిలో రాగజ్యోతులను వెలిగించే వారిని ఆదర్శప్రాయులు అంటారు...........అందువల్ల ప్రతి ఒక్కరూ ఆకాశగమనమైన మన దృష్టిని, నేలకు దింపి పరికిస్తే అభాగ్యుల, మూగజీవాల ఆక్రందనలు వినిపిస్తాయి.మనకు ఉన్నంతలో, దొడ్డ బుద్ది చేసుకుని సాయం చేసి వారి/ వాటి బతుకుల్లో జ్యోతులు నింపితే , ఆ జ్యోతులు మన అంతరంగం లో మానసిక సంతృప్తిగా జీవితాంతం వెలుగుతునే ఉంటాయి........పోలిన రామకృష్ణ భగవాన్ ... రాజమండ్రి .
No comments:
Post a Comment