Wednesday, June 26, 2024

****విచార సంగ్రహం - 01 ( భగవాన్ రమణ మహర్షులు )

 విచార సంగ్రహం - 01
( భగవాన్ రమణ మహర్షులు )
ఈ చిన్నగ్రంధము ఎంతో విలువైనది. ఎందువలన అంటే, 1901 -02 లో భగవాన్ రమణమహర్షి మౌనవ్రతంలో వుంటున్నప్పుడు, వారి పాదాలను ఆశ్రయించుకుని వున్న బ్రాహ్మణ పరమ భక్తాగ్రేసరుడు అయిన గంభీరం శేషయ్య గారికి ఆకాలంలో, వారు అడిగిన సందేహాలకు రమణులు వ్రాతపూర్వకంగా అనుగ్రహించిన వేదాంతసారం, యిందులో పొందుపరచ పడినది.
ఇందులో ముముక్షువులైన సర్వాధికారులకు అధికఫలం ఇచ్చే ఉపదేశములు వుండడడం వలన ఇది ' విచార సంగ్రహము ' అనే పేరుతో పిలువబడినది.

01 . ఆత్మ విచారము.
ప్రతి మానవుడు, తన సహజ స్వభావంగా, ' నేను వెళ్లాను, నేను వచ్చాను, నేను చేశాను. ' అనిచెప్పడం జరుగుతూ వుంటుంది కదా ! గట్టిగా విచారించిచూస్తే, ఈపనులన్నీ దేహానికి సంబంధించినవే అని అర్ధం అవుతుంది. అంటే ఏమిటీ, దేహానినే నేనుగా భావిస్తూ చెప్పడం జరుగుతున్నది అన్నమాట.

అయితే విచారణ చేసేవారికి, ఇక్కడ ఒక సందేహం రావాలి. అది ఏమిటంటే, దేహభావన శరీరం పుట్టకముందు ప్రాణిి లేదు, సుషుప్తిలో దేహభావన గోచరించదు, అలాంటప్పుడు, దేహాన్ని నేను అని చెప్పవచ్చునా ? చెప్పగూడదు. దేహాన్ని నేనుగా చెప్పుకోవడం అనేది, తద్బోధ అనీ, అహంకారం అనీ, అవిద్య అనీ, మాయ అనీ, మలం అనీ, జీవుడనీ, అనేక విధాలా చెప్పబడు తున్నది. అందువలననే ఈ భావం గురించి విచారణ చెయ్యాలి.
ఆ విచారణ చెయ్యడం కోసమే, అనేక శాస్త్రాలు వున్నాయి. తత్బోధ ( దేహమే ఆత్మ అనే బుద్ధి ) నశించడానికే, శాస్త్రము, గురూపదేశము అవసరం. ' తద్బోధ భావం నశించడమే ముక్తి ' అనికదా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కానీ ఈ విషయం విచారణ ఎలా చేయాలి ? శవమువంటి దేహాన్ని, శవంలాగానే వుంచి, నోటితో నేను అని చెప్పకుండా, ఇప్పుడు నేను అనేది ఎక్కడ సూక్ష్మంగా ప్రకాశిస్తున్నది తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న ' శరీరము కాని నేను ' ను విడిచిపెట్టకుండా, ' అహంకార రూప దేహమే నేను. ' అనే ఆలోచనను అగ్నిలో వెలుగుతున్న కర్పూరం లాగా, నశింప జేసుకుని, శాంతిని పొందాలి.

ఇదే మోక్షమని, పెద్దలవలన, శ్రుతుల లోనూ చెప్పబడుతున్నది.

అజ్ఞానులు నేను దేహమును అనిగాక, నేను ఆత్మను అని చెప్పే స్థితి కలగాలంటే, ఆవరణ తొలగిపోవాలి. తాను ఆత్మగానే వున్నాడు. కానీ ఆవరణము వలన దేహం అనుకుంటున్నాడు, అనే భావన స్థిరబడాలి.
--గండవరపు ప్రభాకర్

No comments:

Post a Comment