విచారణ
దైవం అంటే ఏమిటో తెలియదు, తెలియని దాన్ని ఎక్కడని వెదకాలి ? ఎలా కనుగొనాలి ?
తెలియని విషయాల్లో దైవాన్ని వెదకటం సాధ్యం కాదు. తెలిసిన విషయాల నుండే కనుక్కోవాలి. అదెలా అంటే.. నిద్రలేచిన తర్వాత కలను అబద్ధం అంటున్నాం. ఇలలో వాస్తవమని అనుకుంటున్నది కూడా అలాంటిదే అని అనుభవంలో తెలియడమే జ్ఞానం. మన 'కలకు', వాస్తవం అనుకుంటున్న 'ఇలకు' {జాగృతికి } సంబంధమే ఉండటంలేదు. కలలో వచ్చే విషయాలు వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఇలలో సాగే మన జీవనం కలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ ఈ రెండింటినీ చూసే 'మనం' మాత్రం ఒక్కటిగానే ఉంటున్నాం. రోజులోని గం.24ల సమయంలోనే రెండు రకాల పరస్పర విరుద్ధ భావాలతో మనం ఉంటున్నాం. కలైనా, ఇలైనా అందులో ఉండేవి సంఘటనలే. సంఘటన ఏదైనా ఏర్పడినదే. ఆ సంఘటనలు ఏర్పడక ముందు ఉన్నదేదో అదే ఆత్మ (దైవం). కలకు-ఇలకు ఆధారం ఆత్మ !
రమణుల ఉపదేశం మార్గదర్శనం
రమణుల ఉపదేశం, మార్గదర్శనం ఓ విధంగా చెప్పాలంటే రహస్యమైనవి. అందరికీ అందుబాటులో ఉన్నట్లే కనబడతారు. అందరి మాటలు, ప్రశ్నలు, అభ్యర్థనలు, ప్రార్థనలు విన్నట్లే కనబడతారు. కాని వారు ఎవరిని అనుగ్రహించదలిచారో వారికి మాత్రమే వారిచ్చే దీక్ష, ఉపదేశం, మార్గదర్శనం అందేవి. దీక్ష కూడా సాధకుని మనఃస్థితిని బట్టి మారుతుంటుంది. పరమహంస యోగానంద (ఒకయోగి ఆత్మకథ రచయిత) ప్రజలకు పెద్ద ఎత్తున మేలుచేయుట ఎలా అని అడిగితే, భగవాన్ – “అదెలా సాధ్యం? మూకుమ్మడి దీక్షలుండవు. ఉపదేశం సాధకుని పక్వత, అర్హతలపై ఆధారపడి వుంటుంది” అన్నారు.
రమణుల ఉపదేశదీక్షా కార్యక్రమం ఎంత క్రియాశీలకమైందో అంత గోప్యమైంది కూడా. చూసేవారికి దాని ఆనుపానులు తెలియక వారెవరికీ దీక్ష యివ్వరనీ, అసలు ఎవరినీ పట్టించుకోరన్న అపోహ కలిగేది. ఈ విషయంలో నటేశ ముదలియార్ను ఇదే మిషపై నిరుత్సాహపరిచాడో బ్రాహ్మణుడు. నిజానికి ఆత్మసాక్షాత్కారానికి సద్గురువు ప్రసాదించే దీక్ష, ఉపదేశం అత్యంత ఆవశ్యకం. ఈ విషయంలో భగవాన్ అభిప్రాయం ఇతర సంప్రదాయ గురువుల అభిప్రాయంకంటే ఏ విధంగాను భిన్నంకాదు. అందుచేత సత్య సాధకులకు రమణుల బోధనా విశిష్టత, ప్రశాంతయుతమైన వారి సన్నిధి లభిస్తే సరిపోదు. వారు తమకు దీక్షాగురువులన్న సంగతి ఏదోవిధంగా ప్రతిష్ఠమవ్వాలి.
గురువుకు సమర్పణ అంటే తన ఆత్మకంటే బాహ్యంగా వున్న వేరెవరికో కాదు. తన నిజతత్త్వాన్ని గుర్తించే దిశలో సహకరించేందుకు తనకు బాహ్యంగా ప్రకటమైన తనకే అని గుర్తించాలి. “గురువున్నది లోపలే. ధ్యానం చేసేది గురువు బాహ్యంగా ఉన్నాడన్న అజ్ఞానపు అపోహను తొలగించేందుకు. అతడు బాహ్యంలో తారసిల్లిన ఎవరో నూతనవ్యక్తి కాడు సుమా! అదే అయితే, ఇతరులవలె అతడూ కాలక్రమంలో అదృశ్యమై తీరుతాడు. అలాటి అశాశ్వత వ్యక్తితో ఒరిగేదేమిటి? మరి, నీవో పరిమితమైన దేహం అనుకున్నంతసేపు గురువు కూడా వేరే దేహంతోటి నీకు వెలుపల కనిపించే ఆవశ్యకత ఉంది. ‘నేను’ దేహమనే దోషభావం తొలగిపోగానే ఇంకేముంది, గురుమూర్తి నీ స్వరూపమే అయిన ఆత్మ అని గ్రహిస్తావు.
పూర్ణత్వంతోటి తాదాత్మ్యంలో ఉన్న గురువుకు పరిమిత అహం-గుర్తింపు లేని కారణంగా ఆ సంగతిని ప్రకటించే పనిలేదు. అలాగే ఇతరాన్ని చూడని కారణంగా తనకేదో శిష్యులున్నారనీ చెప్పుకోడు. రూపాలుంటేనే నంబంధాలు, బంధాలు కదమ్మా!
అయితే ఈ విషయంలో తికమక పడిపోయి, ఎటూ పాలుపోక అగమ్యగోచర స్థితిలో ఉన్న భక్తుని ఓదార్చి, సందేహాన్ని తీర్చి, నిలదొక్కుకునేలా చేయడంలో ఆయనకాయనే సాటి. 1940లో తనకట్టి అభయం ఈయబడినట్లుగా చాడ్విక్ అనే ఇంగ్లీష్ భక్తుడు వ్రాసుకున్నాడు.
అనుభవం కావాలనే కోరిక పుట్టా లంటారు, ఆ కోరిక కూడా పోతేనే అనుభవం కలుగుతుందంటారు ఇదేమి పరిస్థితి !?
శివదర్శనం కోసం అన్నింటినీ వదిలి, చివరికి శివదర్శనం కావాలన్న కోరిక కూడా వదిలితేనే అప్పుడు మనకు శివదర్శనం అవుతుంది.
అర్ధనారీశ్వరిగా సదా శివుడితో ఉన్న ఉమామహేశ్వరికి శివుడ్ని చూడాలన్న కోరిక కలిగి తపస్సు చేసింది.
ఒక తేజస్సు కనిపించింది. అది నా దృష్టి మేరలోనిదే కదా ! అనుకొని తపస్సు కొనసాగించి చివరికి తన స్థితియే శివుడని తెలుసుకుంది.
నువ్వు చూడటమే కాదు, నువ్వు ఉండటం కూడా శివసాన్నిధ్యమే.
మనం గుణ రహితులం కావాలంటే అసలు మనను ఆక్రమించుకున్న గుణాలేమిటో తెలియాలి.
గుణాలు ఎలా తెలుస్తాయంటే మన ప్రవర్తన ద్వారానే. ..
ఒక చంటి పిల్లవాడిని దుకాణానికి తీసుకెళితే వాడికి ఇష్టమైన వస్తువు వైపు చేయి లేస్తుంది.
ఆ కదలికే అతడి గుణాన్ని తెలియజేస్తుంది.
మరో కొలమానం అవసరం లేదు.
మనం కూడా దుకాణానికి వెళ్ళి వంద డిజైన్లు చూసి నచ్చటం లేదంటే మనకి ఇష్టమైనదేదో మరో డిజైన్ ఉందనే అర్ధం.
మనకు నచ్చటం మొదలైందంటేనే కోరిక మొదలైందని అర్ధం.
ఒక వస్తువు గుణం ఏమిటంటే అది మనకు కావాలనిపించటమే.
ఆ గుణమే మనని మననిగా ఉండనివ్వటం లేదు.
ఇదంతా మనను గమనించుకుంటే అర్ధమవుతుంది.
దీన్నే శ్రీరమణమహర్షి విచారణమార్గం అని చెప్పారు !
No comments:
Post a Comment