Monday, June 17, 2024

 "జ్ఞానగీత"(నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *ఈశావాస్యోపనిషత్ - 1వ భాగము*
- శాస్త్రి ఆత్రేయ.
"ఈశావాస్యమిదగ్సర్వం" అనే మంత్రముతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అయ్యింది కాబట్టీ, దీనికి "ఈశావాస్య ఉపనిషత్తు" అని పేరు పెట్టేరు. ఇది శుక్లయజుర్వేదానికి చెందినది. తత్యన్ అధర్వణుడు అనే మహర్షి దీనిని తన కుమారునికి ఉపదేశించేరు. ఇందులో విద్యను "ఈశ విద్య" అని అంటారు. ఈ ఉపనిషత్తులో మొత్తం 18 మంత్రాలు వున్నాయి.
శాంతిమంత్రము -
పరమాత్మ పరిపూర్ణుడు. ఈ విశ్వం పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే ఈ పరిపూర్ణమైన విశ్వం ఉద్భవించిది. అందువలన ఈ ప్రపంచం కూడా భగవంతునిచే నిండివుంది, అన్న భావనను వ్యకపరుస్తుంది ఈ శాంతిమంత్రము. ప్రతి ఉపనిషత్తు కూడా ఒక శాంతిమంత్రంతో ప్రారంభమై శాంతి తోనే ముగుస్తుంది. ఎందుకంటే శాంతి లేక సౌఖ్యము లేదు కాబట్టీ.
మంత్రముల వివరణ -
ఈ జగమంతా పరమాత్మ విభూతితో నిండివుంది కాబట్టీ, అందరూ కూడా ఈ సృష్టిని మఱియు సృష్టియందున్న అన్ని జీవనిర్జీవ పదార్థాలను భగవంతుని సంపదగానే చూడాలి.
ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కర్మలు చేయవలసిందే. ప్రతి కర్మకు ఫలితం వుండి తీరుతుంది. మంచికి మంచి, చెడుకి చెడు ఫలితాలను అనుభవించక తప్పదు. అయితే ఇక్కడ పేర్కొన్న సత్యాన్ని
పరిశీలిస్తే, అంతా భగవంతుని సంపదే అనుకున్నప్పుడు, అన్ని కర్మలు భగవంతునికి అర్పిస్తూ
చెయ్యాలి. ఇలా నిష్కామబుద్ధితో కర్మలు ఆచరిస్తే దైవానుగ్రహం తప్పక లభిస్తుంది.
ఇతరులను పీడించే స్వభావం కలవారు రాక్షసులు. వీరు చీకటి(అజ్ఞానం)లో సంచరిస్తుంటారు. అలాగే ఆత్మహంతకులు, వీరు ఎప్పుడూ శరీరసుఖాలనే జీవితలక్ష్యాలుగా భావిస్తూ, ఆత్మ గురించి గాని లేక పరమాత్మ గురించి గానీ ఆలోచన చేయరు. వీరు రాక్షసులతో సమానం. వీరు మరణించిన తరువాత అధమ లోకాలు పొందుతారు, అంటే తమ స్వభావం ప్రకారమే మళ్ళీ జన్మిస్తారు. ఇలా అనేకసార్లు పుడుతూ, చస్తూ ఎన్నో బాధలకు గురవుతుంటారు.
ఆత్మ స్థిరమైనదని, మనస్సు కంటే వేగవంతమైనదని, ఇంద్రియాలు దాన్ని పొందలేవని ఇందులో చెప్పబడింది. అంటే విశ్వమంతా వ్యాపించియున్న ఆత్మ ఎక్కడకు కదలగలదు? కాబట్టీ ఈ మనసు, శరీరం అన్నీ అందులో భాగమే కదా! అంటే మనసు ఒక వస్తువును చేరకముందే, ఆత్మ అక్కడ ప్రత్యక్షమౌతుంది, అంటే ఆత్మ స్థిరముగా ఉంటూనే మనసు కన్నా వేగవంతమైనదని చెప్పబడింది.
ఇంద్రియాలు ఆత్మను గ్రహించలేవని ఈ ఉపనిషత్తులో చెప్పబడింది. కారణం చెవి, చర్మము, నాలుక, కన్ను, ముక్కు ఇత్యాది జ్ఞానేంద్రియాలు బయటి ప్రపంచాన్ని తెలుసుకోవడానికే సృష్టింపబడ్డాయి. ఇవి పనిచేయాలంటే కదలని వస్తువు ఒకటి ఆధారముగా వుండాలి. ఒక వాహనం కదలాలంటే కదలని రోడ్డు, ఒక చలనచిత్రం చూడాలంటే ఒక కదలని తెర వుండాలికదా! అంటే ప్రాణం అనేది ఆత్మను ఆధారముగా చేసుకొని ఇంద్రియాలు పనిచేసేటట్టు చేస్తుందని ఇచ్చటి వివరణ.
ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది కాబట్టీ, అది అందరికీ చాలా దగ్గరగా ఉందన్నమాట, కాని ఈ విషయాన్ని అనుభవపూర్వకముగా తెలుసుకోలేనప్పుడు అది మనకు దూరంగా వుంటుందని అర్థం.
ఆత్మరూపంలో అది మనలో వుండి, పరమాత్మరూపంలో మన బయట కూడా ఉందన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది.
తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము... 🙏🏻

No comments:

Post a Comment