Monday, June 17, 2024

****అధ్యాసే దైవానికి అడ్డు

 [6/15, 15:32] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 13🌹
👌అధ్యాసే దైవానికి అడ్డు👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 13. అధ్యాసే దైవానికి అడ్డు🌹

✳️ దైవాన్ని తెలుసుకోవాలన్న ఇష్టం నిజంగా కలిగిన రోజున ఈశ్వర సాక్షాత్కారం మనకు అతి సమీపంలో ఉంటుంది, ఎందుకంటే దైవం అనుక్షణం మనతో సహజీవనం చేస్తున్నాడు కనుక. శిరస్సు లేని దేహం ఎలా సాధ్యంకాదో, దైవం లేని మన ఉనికి కూడా సాధ్యం కాదు. మన ప్రాణానికే ప్రాణంగా ఉన్న ఆ దైవాన్ని అనునిత్యం అనుభవిస్తున్నా గుర్తించలేకపోవటానికి దానిపై ధ్యాస లేకపోవటమే కారణం. దీన్నే అధ్యాస అంటారు. అంటే, ఉన్న విషయాన్ని పట్టించుకోకపోవడం. కుడిచేతితో వ్రాస్తున్నప్పుడు ఎడమ చేయి గుర్తుకే రాదు. అందుకు కారణం కుడిచేతిపై ఎక్కువ ధ్యాస ఉండటం, ఎడమ చేతిపై అధ్యాస ఉండటమే. అదే సమయంలో ఎడమచేతిపై చీమ పాకినా వెంటనే స్పందిస్తున్నామంటే ఆ చేయికూడా అప్పటివరకు అనుభవంలో ఉండటం వల్లనే కదా! దీన్ని బట్టి, కుడిచేతి ధ్యాస వల్ల ఎడమ చేయి గుర్తుకు రావటం లేదే తప్ప దాని అనుభవం మనకి లేకపోలేదని స్పష్టమౌతుంది. 

✳️ శ్రీ రమణ భగవాన్ బోధనలు, విచారణా మార్గం అంతా మనలో ఉన్న దైవాన్ని తెలుసుకోవడానికే.  మన నిత్య జీవితానుభవాలను విశ్లేషించి విచారిస్తే దైవం చేస్తున్న లీలలు అర్థం అవుతాయి. కేవలం మన ఆలోచనే దైవానుభూతిని తెలియకుండా చేస్తుంది. ఈ ఆలోచనే మన ప్రారబ్దానికి మనమే కర్తలం అనిపించేలా చేస్తుంది. నిజానికి ఆలోచనతో పనిలేకుండా మనలోనే జరిగే ఎన్నో పనులు దైవలీలలే అని అర్థం అవుతుంది. గుండెలయ, రక్త ప్రసారం మొదలు అణువు అణువులో మనలో ఉండే జీవత్వం ఆ ఈశ్వరుడి అనుగ్రహమే కదా! ఆత్మశక్తి వల్ల మనకీ లభించిన గమనింపు గుణమే ఆలోచనగా మారి అంతా నా వల్లనే జరుగుతుందనిపించేలా చేస్తుంది. ఆలోచనా శక్తిని 'గమనించే’ గుణంగానే ఉంచితే దైవానికి మనం దగ్గరవుతాం. 

✳️ అంతా మన చేతిలోనే ఉంటే ప్రమాదాలను, ప్రారబ్ద కష్టాలను ఎందుకు ఆపుకోలేక పోతున్నాం? అంటే మనకు మించిన కర్త ఎవరో ఒకరు ఉంటేనే ఈ పనులన్నీ సాధ్యం. అదే దైవం. ఈ సృష్టిలో జరిగే ప్రతి పని ఒక మహా శక్తి చేస్తుందన్న సత్యం అర్థం అయితే దైవంపై భక్తి పెరిగి అది దర్శనానికి మార్గం అవుతుంది. నీటిలో పుట్టిన బుడగ పై మరో చిన్న బుడగ ఏర్పడిందే అనుకోండి. ఆ రెండు బుడగలకు నీరే కదా ఆధారం. అవి నీటి వాలుకి ( కాల సంకల్పానికి) అనుగుణంగా వెళ్లాల్సిందే కదా! ఆ పెద్ద బుడగ అహంకారం చేత చిన్న బుడగకు తానే ఆధారం అనుకోవటం ఎంత హాస్యాస్పదం. అలాగే మన ప్రాణానికే ఆధారంగా ఉండి, ఈ సృష్టిని నడిపే దైవాన్నే మరచి మనకి మనమే కర్తలంగా భావిస్తున్నాం. అంటే చిన్న బుడగల్లాంటి 'కర్మలను మోస్తున్నాం'. 

✳️ అందుకే భగవాన్ - 'నువ్వు జన్మించి ఉంటే కదా! పునర్జన్మ అంటూ ఒకటి ఉండటానికి?’. అని ప్రశ్నిస్తున్నారు. కరెంటు వచ్చి పోతుందే తప్ప పుట్టిచావదు. చైతన్య స్వరూపులం అయినా మనమూ అంతే. ఈ దేహంగా వ్యక్తం అవుతున్నామే తప్ప ఇదే మనం కాదని గ్రహించాలి. ప్రస్తుతం మన రూపనామాలకు పరిమితమైన మనస్సు విశాలమై అనంతమైతే అదే ‘పరమాత్మగా’ ఉంటుందని జిల్లేళ్లమూడి అమ్మవారి బోధ. 

✳️ ధ్యానం అంటే ఒకనామాన్ని మనసులో జపించటం, ఒక రూపాన్ని మనస్సులో నింపుకోవటమే అనే అభిప్రాయంలో ఉన్నాం. అది ధ్యానం కోసం చేసే ప్రయత్నం మాత్రమే. ఆ ప్రక్రియ ధ్యానం యొక్క విస్తృతత్వానికి ఒక పార్శ్వం మాత్రమే. నిరంతరం దైవం మనలో ఉంటాడనీ, మన ఉనికికి, ఈ సృష్టికి ఈశ్వరుడే కారణం అన్న విశ్వాసం నిరంతరాయంగా ఉండటమే సహజ ధ్యానం అవుతుంది. ఉన్న దైవాన్ని చూసేందుకే మనకి ఇష్టమైన రూపంలో ఆయనను ధ్యానిస్తాం. అది సత్యాన్ని తెలిపే మార్గం కావాలేకానీ, మనం ధ్యానించేదే పరమ గమ్యమనే అసత్యాన్ని మనలో ప్రతిష్ఠించకూడదు. 

✳️ మనకి దైవం - దేహంతో పాటు, సందేహం కూడా ఇచ్చాడు. కనుకనే మనకి ముక్తి అవకాశం లభించింది. ఏర్పడిన సందేహాలన్ని తీరితే ముక్తిత్వమే కలుగుతుంది. భగవాన్ వద్దకు వచ్చిన ఒక భక్తుడు తనకి జ్యోతి దర్శనం చేయించమని అడిగారు. అసలు జ్యోతిని చూడాలని కోరుకునే ' ఆద్రష్టు' ఎవరో అవగాహనలోకి రావాలి' అని భగవాన్ సమాధానం ఇచ్చారు. ఎవరి తల వారు ఆడించగలరు కానీ ప్రక్కవారికి ఎలా సాధ్యం. మనం దైవానికి భావన చేత దూరం అయ్యాం కానీ వాస్తవానికి దైవంతో మనకు దూరమే లేదు. దేహభావన చేత ఆలోచనలు ఆత్మ విషయంలో అధ్యాసకు కారణం అవుతున్నాయి. మన కాలి గోటి నుండి శిరస్సు అంచు వరకు ఉన్న దూరం అయిదడుగులని బాహ్యంగా కనిపిస్తుంది. కానీ ఈ దేహమంతా వ్యాపించి ఉన్నది ఒకే చైతన్యం కనుక ఈ దూరం మన భావనలో కలగదు. ఇదే చైతన్యము విస్తృతమైతే ఈ సృష్టి అంతా మనలో భాగమేనన్న సత్యం స్ఫురణగా ఉంటుంది. అలానే చైతన్య భావన కలిగిన రోజు మనకీ దైవానికి అసలు దూరం లేదని తెలుస్తుంది. మనలో ఈ చైతన్య శక్తి ఇంద్రియాలుగా, మనసుగా విడిపోవటం వల్ల దైవం పై 'అధ్యాస' ఏర్పడుతుంది. ఈ మనోశక్తిలన్నింటిని కేంద్రీకరిస్తే దైవం అనుభవంలోకి వస్తారు. ఆధ్యాత్మిక సాధనంతా ఈ మనోశక్తుల కేంద్రీకరణే. మనలో ఉన్న చైతన్యాన్ని నిరంతరం అనుభవించటం ద్వారా కూడా ఈ కేంద్రీకరణ జరిగి ఆత్మానుభవం అవుతుంది.
[6/15, 15:32] +91 73963 92086: సద్గురువులు నిరంతరం అదే ధ్యాసలో ఉంటారు. అందుకే వారికి చేసే పాద పూజలు దేహానికే అయినా స్వీకరించేది మాత్రము ఆ ఈశ్వరుడే అవుతాడు. మనకి ఆ స్థితి నుంచి దూరం చేసే 'అధ్యాస' తొలిగిపోవాలంటే నిరంతరం అనగలిగిన నామాన్ని, స్మరించగలిగిన రూపాన్ని ఆశ్రయించి సాధన చేయాలి. మన దుఃఖం అంతరించి శాశ్వత ఆనందం, శాంతి రావాలంటే దైవం మనకి అనుక్షణం ఎన్ని వరాలు ఇస్తున్నారో తెలుసుకోవాలి. ఎప్పుడూ ఎదో ఒక వెలితిని కలిగి ఉంటే అది 'లేమి' కాక ఏమి అవుతుంది. నిజానికి అన్నం, నిద్ర తప్ప మానవునికి అంతటి అవసరం మరొకటి లేదు. అయినా స్వార్థం, సుఖ వాంఛ వంటి భోగాలకు అలవాటై విలాసమే నిత్యావసరం అనుకుంటున్నాం. అదే తీరనినాడు వెలితిగా మారి లేమిని ఇస్తుంది. దైవం అందరికీ పరమ శాంతిని అందిస్తూనే ఉన్నా మన అధ్యాస మనని దైవానుగ్రహాన్ని గుర్తించకుండా చేస్తుంది. 

✳️ చంటిపిల్లాడికి తల్లి కన్ను, ముక్కు, చెవుల వంటి అవయవాలను చూపిస్తూ వాటి పేర్లు నేర్పుతుంది. అంటే వాటిని ఫలానా అని గుర్తించేలా చేస్తుంది. గురువు కూడా సాధకుని విషయంలో అదే చేస్తాడు. అప్పటికే మనలో ఆత్మగా, ప్రాణంగా, చైతన్యంగా అనుభవంలోనే ఉన్న దైవాన్ని గుర్తించేలా చేస్తారు. పేరు తెలియకుండానే త్రాగిన మధుర పదార్థానికి ఆ తర్వాత ఇది తేనె అని తెలుసుకున్నట్లుగానే మనకి నిత్యం అనుభవంలోనే ఉన్న దివ్యత్వాన్ని ఫలానా అని గుర్తించే జ్ఞానం గురువు అందిస్తారు. అలా మనలో ఉన్న దివ్యత్వం తెలిసిన రోజు సర్వాంత ర్యామిగా ఉన్న ఈశ్వరుడు మన అవగాహన లోకి, అనుభవంలోకి వచ్చి ఆనందం మన సొంతం అవుతుంది. అదే నిజమైన విశ్వరూప సందర్శనం.

  🙏 ఓం నమోభగవతే శ్రీరమణాయ 🙏

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment