*బుద్ధివికాసం:*
*ఒక తల్లి ఓ విద్యావేత్త వద్దకు వెళ్ళింది. తన ‘బిడ్డకు అక్షరాభ్యాసం ఎప్పుడు చెయ్యాలి?’అని అడిగింది.*
*అతడు ‘బిడ్డ వయస్సెంత?’ అని ప్రశ్నించాడు.*
*ఆ తల్లి సమాధానమిస్తూ ‘ఇంకా మూడేళ్లే!’ అంది.*
*‘అయ్యో మూడేళ్లా? ఇంకా చదవడం ప్రారంభించలేదా! వెళ్ళు. ఇంటికి వెళ్ళి ప్రారంభించు. ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయాయి!’ అన్నారా విద్యావేత్త.*
*పిల్లల బడి ఇంటితో ప్రారంభమవు తుందని, పెద్దల నడవడిక పిల్లలకు అనుకరణగా మారుతుందని పెద్దలు చెబుతారు.*
*మూడేళ్ల బుద్ధి నూరేళ్లదాకా అని అనుభవజ్ఞుల మాట. మనిషి సన్మార్గంలో నడవాలంటే విద్య, జ్ఞానం రెండూ కావాలి. మనిషి నడవడికకు, వినయ విధేయతలకు, ఆచార వ్యవహారాలకు... ఇవే కారణాలు. ఈ మంచి లక్షణాలున్న వారే బుద్ధిమంతులు.*
*రామాయణ మహాకావ్యం అయోధ్యకాండలో శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వాన్ని వాల్మీకి మహర్షి ఆవిష్కరిస్తూ ‘శ్రీరాముడు చక్కని బుద్ధికలవాడు, మధురమైన వాక్కులు కలవాడు, తాను ఎంత బలవంతుడైనా...ఏమాత్రం బలగర్వంలేని వినయశీలి’ అని ప్రస్తుతిస్తాడు.*
*ఆంజనేయుడి బుద్ధికుశలత అతడి నడతలో ప్రతిచోటా కనిపిస్తూనే ఉంటుంది. సముద్ర లంఘనం, సీతాన్వేషణ, సీతా సందర్శన, రాక్షస సంహార సమయాల్లో తన బుద్ధిచాతుర్యాన్ని ప్రదర్శించిన నిష్కామ కర్మయోగి ఆంజనేయుడు.*
*మహాభారతంలో ధర్మరాజంటే సాక్షాత్తు ధర్మస్వరూపుడు. నమ్ముకున్న విలువల విషయంలోనే కాదు, తనను నమ్ముకున్న వ్యక్తుల విషయంలోనూ ధర్మరాజు ధర్మనిరతిని తప్పనివాడు.*
*అందుకే యక్షుడి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, ‘చనిపోయిన తమ్ముళ్లలో ఎవరి ప్రాణాలు కావాలో కోరుకొమ్మంటే‘ ఏమన్నాడు? ‘కుంతీ కుమారుల్లో తాను మిగిలి ఉన్నందువల్ల, పినతల్లి మాద్రి కుమారుల్లో పెద్దవాడైన నకులుణ్ని బతికించమ’ని ధర్మరాజు యక్షుణ్ని ప్రార్థించాడు.*
*ధర్మరాజు ధర్మబుద్ధికి సంతోషించిన యక్షుడు ఆ నలుగురినీ బతికించాడు.*
*ఇటువంటి మరో అద్భుతమైన సంస్కారవంతమైన పాత్ర చిత్రణ మహాభాగవతంలో ప్రహ్లాదచరిత్రలో కనిపిస్తుంది.*
*నారదుడు ధర్మరాజుకు ప్రహ్లాదచరిత్ర చెబుతూ ‘హిరణ్యకశ్యపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు సర్వగుణ సమన్వితుడు. దీనులను తల్లిదండ్రుల్లా భావించి ఆదరించేవాడు. గురువులను దైవసమానులుగా భావించేవాడు. పెద్దలు ఎదురైతే సేవకుడి మాదిరిగా వినయంతో నమస్కరించేవాడు. పరిహాసానికైనా ఎప్పుడూ అసత్యమాడనివాడు’ అని సంస్కార లక్షణాలను వివరిస్తాడు.*
*మనిషిని మంచిమార్గంలో నడిపించే ‘బుద్’ధి మహత్తరమైనది. ఈ ‘బుద్ధి’ సహాయంతోనే మనిషి జీవనరంగంలో ఉన్నతస్థానాన్ని చేరుకుంటాడు. ‘బుద్ధి’ నశిస్తే మనిషికి సమస్తం నశిస్తుంది. సమస్త రోగాలకు మూలకారణం ‘బుద్ధి’ నాశనమే.*
*మంచి ‘బుద్ధి’ మనిషిని ఆశయ శిఖరాలకు చేర్చుతుంది. సూర్యకిరణ స్పర్శతో కమలం వికసించినట్లుగా ‘బుద్ధివికాసం’ పొందిన మనిషి ఆదర్శ పురుషుడై సమాజ అభ్యుదయానికి తోడ్పడతాడు. ఆ పరమాత్ముడి కృపను పొందుతాడు.
No comments:
Post a Comment