ఒక ఊర్లో ఓ పండితుడు ఉండేవాడు. సులభశైలిలో గణితాన్ని బోధించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అతడి శిష్యులు అనేకమంది గణితం బాగా నేర్చుకుని పెద్ద కొలువులు సంపాదించడం అతడిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఎక్కడికి వెళ్ళినా... తన శిష్యులు కనిపిస్తే గణితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేసేవాడు. వారిచేత సరైన సమాధానాలు రప్పించేవాడు. పక్కనున్నవారితో నా శిష్యులందరూ ‘లెక్కల్లోప్పోళ్ళు’ అని చెప్పి గొప్పలు పోయేవాడు.
అతడికి తెలివైన భార్య ఉండేది. వారిద్దరూ ఓ ΄పార్ణమి రోజున సత్సంగం కోసమని మారుమూల పల్లెటూరుకు వెళ్ళారు. అక్కడ పని ముగించుకుని ఇంటికి వస్తూ ఉంటే రాత్రయ్యింది. వారికి దారిలో ఓ యువతి కనిపించింది. ఆ యువతి తన చంకన చంటిబిడ్డను ఎత్తుకుని ఉంది. చందమామను చూపిస్తూ ‘చందమామ రావే, జాబిల్లి రావే...’ అని ΄ాడుతూ చంటిబిడ్డకు గోరుముద్దలు తినిపిస్తోంది.
పండితుడిని చూసిన ఆ యువతి తన గ్రామంలోకి వచ్చిన వ్యక్తి తన గురువని గుర్తించింది. ‘నేను మీ శిష్యురాలను’ అని చెప్పి గౌరవపూర్వకంగా నమస్కరించింది. మీవల్ల కష్టమైన లెక్కలను ఇష్టంగా చేయగలిగామని ప్రశంసించింది. గర్వంగా భార్యవైపు చూశాడు పండితుడు.అలవాటు ప్రకారం పండితుడు తన భార్యతో ‘నా శిష్యురాలిచేత గణితశాస్త్రంలోని ప్రశ్న ఒకటి వేసి సమాధానం తెప్పించమంటావా?’’ అని అడిగాడు.చిన్న నవ్వు నవ్విన భార్య ‘‘గణిత శాస్త్ర ్రపావీణ్యత తెలియజేసే ప్రశ్నలు వద్దు. ఇప్పటివరకు మీ శిష్యురాలు తన బిడ్డకు ఎన్ని ముద్దలు పెట్టిందో లెక్క చెప్పమనండి చాలు!’’ అని అడిగింది.
‘అదెంత పని?’ అని భావించిన ఆ పండితుడు తన శిష్యురాలిని సమాధానం చెప్పమన్నాడు. తెలియదన్నట్లుగా ఆమె అడ్డంగా తల ఊపింది. తల్లి తల ఊపడం చూసి ఏదో అర్థమైనవాడిలా బోసినవ్వులు నవ్వాడు చంటిబిడ్డ.వెంటనే పండితుడి భార్య ‘‘బిడ్డలకి గోరు ముద్దలు తినిపించే ఏ అమ్మకీ లెక్కలు రావండీ. ఏ తల్లీ లెక్కవేసుకుని తినిపించదు. బిడ్డ ఒక ముద్ద తింటాడంటే పది ముద్దలు పెట్టాలని చూస్తుంది తల్లి.
లెక్కవేస్తే తన దిష్టే తగిలి బిడ్డ తినడం తగ్గించేస్తాడేమోనని ఆలోచిస్తుంది. ఆ తల్లి ప్రేమ ముందు ఏ లెక్కలూ పనిచేయవు, ఏ లెక్కలూ పనికిరావు’’ అని వివరించింది.ఆశ్చర్యపోయాడు పండితుడు. కొద్దిసేపటికి తేరుకుని ‘ఏ తల్లీ లెక్కలు, కొలతలు వేసి బిడ్డను ప్రేమించదు. తెలిసిన లెక్కలు సైతం తల్లి ప్రేమ ముందర మాయమైపోతాయి’ అని గుర్తించి అక్కడినుంచి కదిలాడు ఆ పండితుడు.
No comments:
Post a Comment