🍃🪷 ధర్మం అనే పరమార్థం అంటే..
మోహంలో పడి, ఏదో ఒక విధంగా దేహయాత్ర సాగిస్తూన్నా ఒకనాటికి , ఇంతేనా? తినడం , నిద్రబోవడం / పుట్టడం , కొంచెం సుఖం అనంతంగా దిగులూ ,ఆందోళన అనుభవిస్తూ ఉండడమేనా జీవితం? అని అనిపిస్తుంది..
ఏ ధర్మం నమ్ముకొంటే ఈ చక్ర భ్రమణం నుంచి బయటబడ్తాము అనే ఆలోచన కలుగుతుంది. కొందరికి ఈ జన్మలో. మరికొందరికి రాబోయే జన్మల్లో..
ప్రతి వ్యక్తికీ వయసు పెరిగేకొద్దీ ఆలోచనల్లో మార్పు, పరిణతి ఏర్పడుతుంది..జీవితంలో అనేక అనుభవాలు పొంది వాళ్లకుగా వివేచన కలిగేవాళ్ళు కొందరు..చాలా కొద్ది మంది పెద్దల అనుభవ పూర్వకమైన మాటలు విని కొంత వైరాగ్యం పొంది , దీనిలోని యథార్థం ఏమిటి ? అని ఆత్మ పరిశీలన చేసుకొనే వాళ్లు.
పట్టుదలతో ఈ జన్మలోనే ఈ సంగతి ఏమిటో తెలుసుకోవాలి అనుకొనే వాళ్లు కొందరు..ఆ ఆలోచన పుట్టాలే గానీ అది అన్ని భావాలను తోసివేసుకొని ముందుకు పోతుంది..
ఆ ఎరుక ఎపుడైనా కలగవచ్చు. రమణ మహర్షి కి పదహారేళ్ళకే కలిగితే చలం కు అరవై ఏళ్ళ కు కలిగింది..
భౌతిక బాధల నుంచి బయటపడాలి అని ఒక చింత..అసలీ జననమరణ చక్రమే అన్నిటికీ కారణం అని తెలుసుకొన్న దశలో దేహాభిమానం మందగిస్తుంది..ఈ పరితాపానికి ఒక మతం వాళ్లు అని లేదు..ఒక దేశం అని లేదు..మానవులలోనే కాదు..ప్రతి జీవికీ ఈ తాత్విక దృష్టి కలగవచ్చు అని గూడా చెప్పవలసి ఉంటుంది..
*ఏ వేదంబు పఠించె లూత ? భుజగంబే శాస్త్రముల్ సూచె ? * వాటికీ భగవంతుడే సత్యం అనే జ్ఞానం కలిగింది గదా! అంటాడు ధూర్జటి..
ఆ జ్ఞానం కలగడానికి మన లౌకిక విద్యలలో ప్రావీణ్యం అక్కర లేదు.. ఇది ఒక విధంగా బంధం అని గూడా అంటారు. తనకొక ప్రత్యేకత ఉన్నదనే అపోహ తన చుట్టూ అల్లుకోని, సాలీడు మాదిరిగా అందులో నుంచి బయటబడలేక పోవడం..కళ్ళు తెరుచుకోడానికి అడ్డమే ఔతుంది . నాదేముంది ? అకించనుణ్ణి అని అనుకోగలిగిన దశలోనే శుద్ధ దర్పణంలో వలె ఆత్మలో భగవంతుడు నెలకొంటాడు..అహం ను జయించి నిరహంకృతిని సాధించగలిగినపుడు — అన్నిటికీ నేనే కర్తను అనే భ్రాంతి అదే తొలగి పోతుంది..
వార్ధక్యంలో అందరూ ఇహ చింత తగ్గించుకొని , తపోవనాలకూ, తీర్థ యాత్రలకూ వెళ్ళేవారు..ఇపుడా సౌకర్యం లేకపోగా ఇంట్లోనే యథార్థ దర్శనం చేసుకొనేవాళ్ళు ఎందరో..
నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల తత్వం
నిశ్చల తత్వే జీవన్ముక్తిః — అని సూక్ష్మోపాయం చెప్పారు.
సుఖ దుఃఖ సముడు కాగలిగితే ధర్మ చింతనకు దగ్గరౌతాడు..
🥀 ఓం నమో నారాయణాయ 🙏
🍃🪷సే:వల్లూరి సూర్యప్రకాష్ కరీంనగర్
No comments:
Post a Comment