Friday, June 28, 2024

భగవంతునితో భక్తుని ఆవేదన!!*

              *_నేటి మాట_*

 *భగవంతునితో భక్తుని ఆవేదన!!*

*ఏది మాకు గతి యిఁకను  ఈశ్వరేశ్వరా..*

    ఓ ఈశ్వరేశ్వరా! ఈ సంసారపుమాయలో తగిలి కొట్టుకుపోతున్నాము. 
మేము జీవులము, అజ్ఞానులము. 
భోగాసక్తితో భోగమే పరమావధిగా దైహిక సుఖాల వెంపర్లాటలో బ్రతుకుతున్నాము.
ఆలుబిడ్డలు, సిరిపందలు వున్నా పీకులాటే, లేకున్నా పీకులాటే. 
తిన్న తిండినే తింటున్నాము, చూచినవాటినే చూస్తున్నాము, చూచినదెల్లా కావాలనే ఆశ, విన్నమాటలే వినాలనే వాంఛ.

పొందిన సుఖాలే మళ్ళీ మళ్ళీ కావాలనే కోరిక. 
కానీ నిన్ను తలచుకోవాలంటే ఆసక్తియే లేదాయె. 
గృహము వుంటే గృహలక్ష్మి లేదని ఆరాటం. 
ఆ రెండూ వుంటే పొలముపుట్రా లేదని దిగులు, ఇదే సంసారపు యావ. 
కానీ శ్రీవేంకటేశుడు అలమేల్మంగలపై నాకు ఒక్కొక్కసారి భక్తి కుదురుతుంది ఒక్కొక్కసారి భక్తి కుదరనే కుదరదు. 
        ... ప్రభూ! మమ్ము కరుణించవయ్యా!

     ఓ ఈశ్వరేశ్వరా! మాకు వేరేగతి యేదయ్యా! ఈ దెస (ఈ విధముగా) మమ్ము కరుణించి ఈడేర్చవయ్యా! (గమ్యము జేర్చవయ్యా!)

1. ఈ జీవులు భగవంతుని పొందితే కాని మరుజన్మలేక ముక్తిని పొందజాలరు, ఇంతకు మునుపు అనుభవించిన సుఖాలనే నెమరు వేసికొంటుంటారు, కంచములో పెట్టుకొని రోజూ ఆహారం తింటున్నా మళ్ళీ మళ్ళీ తినాలనే వుంటుంది, చూచినవన్నీ మళ్ళీ చూడాలనుకొంటారు, ఓ ఆదిదేవా! నిన్నే గతిగానెంచి ధ్యానించక ఇట్లా వున్నామయ్యా!

2. దేవా! మా కన్నులతో చూచిన ప్రతిదానివెంటా ఆశతో పడతాము. వీనులకు శ్రావ్యమైనవన్నీ మరల వినాలని కోరుకొంటాము.  మనస్సును మురిపించే సుఖాలే ఇంకా ఇంకా కావాలని కోరుకుంటాము. కాని ఉన్నతోన్నతుడవైన నీవెంట పడమన్నా పడము.

3. ప్రభూ! ఈ సంసారమనే మాయాజాలంలో పడి ఇల్లాలు, ఆరామం (ఇల్లు) క్షేత్రములు (పొలములు) అంటూ వెంపర్లాడతాము. వాటిపై తీరని మమకారం పెంచుకొంటుంటాము. అందమైన శ్రీవేంకటేశ్వరా! నీవు అలమేలుమంగకు పతివి. అయినా నీపై మాత్రం మక్కువ పెంచుకోను. ఇట్లా అనవసరమైన వాటిపై మక్కువ పెంచుకొనే నాపై నీవే దయచూపాలి.

           *_🪷శుభంభూయాత్.🪷_*
  *🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*

No comments:

Post a Comment