Sunday, July 27, 2025

 (338)  (24.07.2025)

నాడు స్నేహితుడు నెత్తి – నోరు బాదుకున్నాడు
అనుభవంతో చెపుతున్నాను విన మని పోరినాడు
వయసు ప్రభావంతో మాటలు చెవిలోకి వెళ్ల లేదు
ఈ రోజు బాధ అనుభవించక తప్పడం లేదు //

ప్రతి రోజూ ఓ కొత్త వంట  
తింటే కడుపులో మంట  
తినకపోతే ఆమెతో తంట
ఇది నా బ్రతుకంట //

ఆమె మెడలో మూడు ముళ్ళు వేసినాను
నరకానికి తలుపులు బార్లా తెరిచినాను
చిరునవ్వును మరిచినాను
కన్నీటిని దిగమింగి బ్రతుకుతున్నాను //

సగం జీతం ఆమె ప్రయోగాలకి
మిగిలిన సగం దవాఖానాకి
నెలాఖరులో జేబులో పైసలుండకున్నవి
అడిగినా ఎక్కడా అప్పులు పుట్టకున్నవి  //

ఊపిరి ఉన్నంత వరకు ఈ బాధలు అనుభవించాలి
బ్రతికి ఉన్నంత వరకు దవాఖానాల చుట్టూ తిరగాలి
నాడు నేను పెద్ద పొరబాటు చేసినాను
నేడు జీవితాంతం అనుభవిస్తాను //

ఎప్పుడు ఆమె ఏమి వండుతుందో తెలియదు
శరీరంలో ఏ నిమిషంలో ఏమి మార్పు వస్తుందో తెలియదు
ఇంటి ముందు ఎల్లవేళలా అంబులెన్స్ రెడీగా ఉంటుంది
అరుపు వినగానే దవాఖానాకి చేరుస్తుంది //

మూడు ముళ్ళు తెచ్చింది చేటు
ఆమె పక్కన లేకుండా చేసింది చోటు
తినని మందు అంటూ లేదు
తిరగని దవాఖానా అంటూ లేనే లేదు //

నాడు పెళ్ళి అంటే ఏమిటో అనుకున్నాను
అనుభవ పూర్వకంగా ఇపుడు చూస్తున్నాను
తింటే గాని రుచి తెలియదు
మూడు ముళ్ళు వేస్తే కాని బాధ తెలియదు //

అందుకే పెద్దల మాట చద్ది మూట అని అన్నారు
అనుభవంతో చెప్పింది వినమన్నారు
వినకపోతే అనుభవించమన్నారు
బాధను ఎవరికి చెప్పవద్దన్నారు //

అయ్యలారా అడుగు వేసే ముందు ఆలోచించండి
హితుల-స్నేహితుల సలహా తీసుకోండి
మూడు ముళ్ళు ఈజీగా వేయవచ్చు
కాపురం మొదలయినాకే బాధలు వచ్చు //

ఊపిరి ఉన్నంత వరకు నీది ఒంటరి పోరాటం
రాత బాగుండకుంటె అదే ఆఖరి పోరాటం
బ్రతుకు కోసం చేయాలి జీవన పోరాటం
ఆఖరి వరకు బ్రతకాలనే ఆరాటం //

100 ఏళ్ళు బ్రతకాలని నీవు అనుకుంటావు
దవాఖానా పేరుతో త్వరగా జీవితాన్ని ముగిస్తావు
జీవితంలో నీకు ఏ అచ్చట-ముచ్చట తీరదు
బ్రతుకుబండి ఆనందంగా ముందుకు సాగదు //

ఇది కదా ఆ దేవుడు రాసిన రాత
మూడు ముళ్ళు వేసినందుకు శ్రీమతి పెట్టిన వాత
నీ అనుభవాలను పుస్తకంలో రాసుకో
ముందు తరానికి క్లాసులు తీసుకో //

వాళ్ళనైనా పెళ్ళి నుంచి దూరంగా ఉంచు
అందుకు నీ కృషీ నీవు గావించు
సఫలమైతే అదృష్ట వంతుడివి నీవు అవుతావు
తేడా వస్తే నీకు తోడు దొరికాడని ఆనందిస్తావు //

మధిర వెంకట రమణ, హైదరాబాద్

(సరదాగా రాసిన కవిత. ఎవరిని ఉద్దేశించి కాదు)

No comments:

Post a Comment