డాక్టర్ కొచ్చర్లకోట జగదీష్ గారి రచన
‘మీ పెళ్లి ఫొటోల ఆల్బమ్ తయారయ్యిందా? చాలారోజులయింది కదరా?’ అన్నాడు మూర్తి. అతనలా అడగడంలో తప్పులేదు.
సుధీర్ పెళ్లి జరిగి రెండేళ్లు కావస్తోందప్పుడే. నిశ్చితార్ధం దగ్గర్నుంచి పెళ్లి పూర్తయ్యేవరకు ఫొటోలు, వీడియోలు తియ్యడానికి, ఓ రెండు నాణ్యమైన ఆల్బమ్‌లు ఇవ్వడానికి, ఫోర్ కె ఫార్మాట్ లో వీడియోలన్నీ తీసి, గ్రాఫిక్ వర్క్ చేసివ్వడానికి మొత్తంగా మాటాడేసుకున్నారు.
ఇవే కాకుండా పిల్లాణ్ణీ, పిల్లనీ బయటికి పట్టుకుపోయి కొండల్లోనూ, సముద్రాల దగ్గరా, లోయప్రాంతాల్లోనూ రకరకాలుగా ఫొటోలు తియ్యడానికి కూడా ఒప్పందం చేసుకున్నారు.
చలువ కళ్ళద్దాలు ఉంచి పది, తీసేసి పది;
చొక్కా పైబొత్తం పెట్టుకుని ఇరవై, తీసేసి ఇరవై;
పిల్ల భుజమ్మీద చెయ్యేసి కొన్ని, వెయ్యకుండా ఇంకొన్ని...
ఇలా ఓ ఐదొందలకి పైగా తీయించారు.
ఇక నిశ్చితార్థం కాస్తా పెళ్లిలా తయారైంది. అసలదే పెళ్లనుకున్నారు చాలామంది. వధూవరులకి కొత్తాపాతా లేదు. తన సాంగత్యం ఎలా వుండబోతోందోననే కుతూహలం లేదు. తనని తాకితే తనలో ఎటువంటి ఉద్రేకాలు కలుగుతాయనే తపన లేదు.
కాలేజీ కుర్రాళ్లకి మల్లే ఒకర్నొకరు తోసుకుంటూ, చెవులు మెలేసుకుంటూ, షటప్పనీ, ఓ..షిట్టనీ, డోంటాక్ రబ్బిష్షనీ, యూ నాటీ అనీ, యువార్ చో చ్వీటనీ అనేసుకుంటూ విరగబడిపోతున్నారు.
వాళ్ల స్నేహితులయితే ఇంక చెప్పక్కర్లేదు. నవ్వులతో హాలంతా హోరెత్తిపోయింది. ఆ సిక్కుల కుర్రాడయితే మరీనూ! ఓ తమిళపిల్ల కాస్త బొద్దుగా వుంది. మాంఛి కామెడీ కారెక్టరని తెలుస్తోంది.
పదిమంది నవ్వుకోవాలంటే ఎవరో ఒకర్ని బలిచెయ్యక తప్పదుకదా? ఆ పిల్లని సెంటర్ చేస్తూ నవ్వేసుకుంటున్నారందరూ.
అడ్రినలిన్ సముద్రంలా ప్రవహిస్తోంది యువకుల్లో. ఉరకలెత్తిపోతోంది వాతావరణమంతా! ‘మర్నాడే యుగాంతం, ఏంచేసినా ఈరోజే!’ అన్నట్టుగా వున్నారు ఎవర్ని చూసినా!
ఇహ పెళ్లిఫొటోల సంగతి చెప్పుకోడం మొదలెడితే చిన్నారి పెళ్లికూతురు సీరియల్లా తయారవుతుంది.
సుధీర్ గాడి అమ్మానాన్నలు అక్షింతలేసే ఫొటోలే వందున్నాయి. అందులో పది ఫొటోల్లో వాళ్లమ్మ కళ్లు మూసేసింది. ఇంకో ఇరవైలో వాళ్ల నాన్న ఎటో చూస్తున్నాడు.
స్నేహితులు, దూరబ్బంధువులు, పెళ్లికొచ్చిన ఇతరత్రా మేళఁవంతా కలిసి వధూవరులతో ఫొటోలు దిగాలికదా! లేకపోతే వాళ్లొచ్చారో లేదో తెలీదాయె!
ఆ రకంగా అటువైపూ, ఇటువైపూ కలగలిపి ఓ అయిదొందలకు పైచిలుకు తేలారు. వాళ్లందరి ఫొటోలూ ఓ వెయ్యిదాకా తేలాయి.
ముహూర్తానికి ముందు తెరసెల్లా ఫొటోలు ఓ వందదాకా తీశాడు. దానిమీద ముత్యాల్లాంటి అక్షరాలతో ‘తొందరపడకు సుందరవదనా’ అనీ, ‘సుధీర్ వెడ్స్ సుష్మిత’ అనీ రాసేడిశారు. అది ‘సుష్మిత కాదు సుస్మితర్రా’ అని ఎవడో నాలాంటి చాదస్తంగాడు చెప్పినా పట్టించుకోలేదు.
ఆ తెరకి ఇటూ అటూ చేరి యవ్వనస్తుల కూడిక చేసిన అల్లరి మొత్తం వీడియోల్లోకీ, ఫొటోల్లోకీ ఎక్కించాడు.
జీలకర్రా బెల్లానికి పది, మంగళసూత్రానికో ఇరవై. మధుపర్కాలకి ముప్ఫై. కొబ్బరిబొండాలకి నలభై, పెళ్లికూతురు బుట్టకి ఏభై!
కొన్నిసార్లయితే ఆ ఫొటోల కుర్రాడు ఎక్కడున్నాడో వెతుక్కోవాల్సి వచ్చేది. ఎవరిమధ్య దూరిపోయేవాడో తెలీదు. ఏ బల్ల ఎక్కేస్తాడో తెలీదు. తనక్కావలసిన అవుట్‌పుట్ రావడానికి చాలా నిరంకుశంగా ఆజ్ఞాపించేవాడు.
వధూవరులిద్దరినీ జీలకర్రాబెల్లం పెట్టుకున్న చేతులు తియ్యనివ్వడు. ‘వన్ మినిట్సార్, వన్ మినిటంతే!’ అంటూ కెమెరాతో చుట్టూ తిరుగుతాడు. దగ్గర బంధువులందరి చేతా అక్షింతలు అలా వేయిస్తూనే వున్నాడు.
ఫొటోల కోసం కట్టిన తాళి కట్టినట్టే వున్నాడు సుధీర్ గాడు. పాపం, నడుం పట్టేసుంటుంది సన్నాసికి.
అరుంధతిని చూపిస్తూ ఓ పది తీశాడు. ఆనకెలాగూ డిజిటల్ నక్షత్రమొకటి పైన మెరిసేలా కలుపుతారు. అది వేరే విషయం. సప్తపది ఫొటోలు, అగ్నిహోత్రం చుట్టూ చేసే ప్రదక్షిణలు చాలా కళాత్మకంగా తీశాడు. కాళ్లొక్కటే కనబడేలా కొన్ని, మొత్తం పడేలా ఇంకొన్ని, బొటనవేళ్లు మాత్రం వుండేలా మరికొన్ని.. ఇలా తీస్తూనేవున్నాడు.
గ్రూప్ ఫొటోలప్పుడు సుధీర్ గాడి పెద్దన్నయ్య రాలేదు. ఆ సమయానికింకా అతనికి ‘దిగలేదు’ట! అంచేత కిందకి దిగలేదు😜! ఫొటోగ్రాఫర్‌ని కాసేపు ఆపమని అడగాలంటే ఆలస్యమైపోతుందంటూ పురోహితుడు ఎక్కడరుస్తాడోనని భయపడిపోతున్నారందరూ! ఈ పురోహితుడెందుకో వచ్చినప్పటినుంచీ ధుమధుమలాడిపోతున్నాడు!
ఎంతో ఉత్సాహంగా పక్కపక్కన నిలబడి నవ్వేసుకుంటున్న మరుదుల్నీ, తోడికోడళ్లనీ చూసి వాడి పెద్దొదినకి ఉడుకుమోత్తనం వచ్చింది. ఏఁవయితే అదయ్యిందని ఫొటోగ్రాఫర్‌ని కాసేపు ఆగమని చెప్పి ‘నాన్నని తీసుకురండం’టూ కుంభకర్ణుడి లేపడం కోసం రాక్షసుల్ని పంపినట్టు పిల్లలిద్దర్నీ పంపింది.
పావుగంట తరవాత పిల్లలతో కలిసి ‘కటకటాల రుద్రయ్య’లా చింతనిప్పుల్లాటి కళ్లేసుకుని, కనీసం మొహఁవేనా కడుక్కోకుండా వచ్చాడు వాళ్ల పెద్దన్నయ్య! ఆ ముఖారవిందం చూసి వాళ్లావిడ కూడా మొహం సీరియస్‌గా పెట్టింది ఫొటోలన్నిట్లోనూ!
మధ్యలో ఓ సోఫావేసి తొంభయ్యేళ్ల పెద్దావిణ్ణి కూర్చోబెట్టారు. ఆవిడకి అక్కడ జరుగుతున్నదేఁవిటో అర్ధంకావట్లా! కింద దవడ టకటకలాడించుకుంటూ అటూయిటూ తలతిప్పుతూ, పై వరసల వాళ్లని తలపైకెత్తి చూస్తూ, కింద కూర్చున్న మునిమనవలని తనపక్కన కూర్చోమని సైగలు చేస్తూ ఫొటోగ్రాఫర్లని చాలాసేపు వేదనకు గురిచేసింది.
వాళ్లు పాపం ఎంతో సంయమనంతో, ఆవిడ నిటారుగా ఎప్పుడు చూస్తుందా, కదలకుండా ఎప్పుడుంటుందా, కింద దవడ పైదవడతో కలిసే అనురాగసంగమం ఎప్పుడా అంటూ కాచుకున్నారు. ఎన్నో ఏళ్ల పరిశ్రమ తరవాత ఎదురవ్వబోయే క్షణాలకోసం ఇస్రో శాస్త్రవేత్తలు చూసినట్టు చూస్తున్నారు వాళ్లందరూ!
సుధీర్ గాడి బంధువుల్లో ఒక ఓవరేక్షన్ పిల్లగాడు సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో మహేష్ బాబు లా ఆ ముసలావిడ తొడమీద తమకంగా తలానించి బోల్డు ఫొటోలు తీయించుకున్నాడు.
ఎలాగయితేనేం, తీశారు ఏభైదాకా ఫొటోలు. అన్నింట్లోనూ అందరూ ఒకలానే వున్నా ‘ఇందులో నువ్వు బాలేవు, అందులో నే బావున్నాను’ అనుకోవడం ఆనక ఎలాగూ తప్పదు.
ఇంతలో పురోహితులవారు ఓ అరుపరిచారు రావాల్రావాలంటూ! నిజానికి అంత ముంచుకొచ్చే వ్యవహారాలేవీ లేవు. అయినా ఆయనంతే! తరతరాలుగా అలవాటయిన కుటుంబమనీ, శాస్త్రమంతా క్షుణ్ణంగా అధ్యయనం చేశాడనీ, శుభమనీ ఆయన్నే పిలుస్తారు వాళ్లింట అన్ని కార్యక్రమాలకీ!
తలంబ్రాల దగ్గర నవ్వకూడదంటాడు...
అప్పగింతలప్పుడు ఏడవకూడదంటాడు...
అంత రాగద్వేషాలకి అతీతంగా వుంటూ పెళ్లెందుకూ చేసుకోడం?
ఇక భోజనాల దగ్గర!
అందంగా, అలంకారానికి కత్తిరించిన కాయగూరలకీ, పళ్లకీ బోల్డన్ని ఫొటోలు తీశాడు. ఇంకా...
....తింటున్నవాళ్లకి, తినకుండా కబుర్లు చెప్పుకుంటున్నవాళ్లకి,
....కిళ్లీలతో నోరంతా ఎర్రగా అయిపోయినవాళ్లకి,
....పదేళ్ల వయసొచ్చిన పిల్లలకి కూడా ఇంకా అన్నం కలిపి పెడుతున్న అభాగ్యులైన తల్లులకి,
....అమ్మ పెట్టింది తినకుండా అప్పటికే అయిదు తిన్నా మళ్లీ ఐస్ క్రీమే కావాలంటూ గారాలు గుడుస్తున్న కొత్తెంగాళ్లకి,
....అరవైరకాల వంటపదార్ధాలకి, ఆఖరికి బయట షిర్డీ సాయిబాబా బొమ్మచుట్టూ వెలగకుండా ఏడిపిస్తున్న సీరియల్ సెట్లకి కూడా తీశాడు.
ఇన్ని వేల ఫొటోల్లోంచి ‘బెస్ట్’ ఏవో ఓ వెయ్యిదాకా ఎంచమన్నాట్ట వీళ్లని! ఏడిసినట్టుంది. పెళ్లి, శోభనం, హనీమూన్, తిరపతి...అయ్యేటప్పటికే సెలవంతా అయిపోయింది. ఇక ఫొటోలేం ఏరతారు?
అందుకే అలా పడున్నాయి. వీళ్లు సెలెక్ట్ చెయ్యరు. అతను ఆల్బమ్ చెయ్యడు.
......జగదీశ్ కొచ్చెర్లకోట
No comments:
Post a Comment