Sunday, July 27, 2025

*****సుఖానుభవాలన్నీ...., ఆనందాలు.....ప్రపంచం లోని సుఖాలు, ఆనందాలు అన్నీ.....

 *అవతార్ మెహర్ బాబా - 33*

రచన: శ్రీ శార్వారి


నిజమైన శిష్యుని గురువు వెతుక్కుంటూ వస్తాడంటారు. కాని అది నిజం కాదు. నిబద్ధత గల శిష్యుని ఆరాటం గురువు గ్రహిస్తాడు. అంతవరకే నిజం. అతనిని వదిలిపెట్టడు. ఏ శిష్యుడైనా సద్గురువును అన్వేషించవలసిందే. తప్పదు. శిష్యుల కోసం ఏ గురువు ఆరాటపడడు. అది అబద్ధం. అర్హుడైన ఏ శిష్యుని గురువు వదలిపెట్టడు. గురువును అర్థం చేసుకోని వారు, అపార్థం చేసుకున్నవారు పారిపోతారు. నష్టపోయేది గురువు కాదు. ఒక జన్మలో గురువు ఆగ్రహానికి గురైన వానికి మరి ఏడుజన్మల వరకు మరొక సద్గురువు లభించడు.

కత్తికి రెండు వైపుల పదునున్నట్లే గురువు మాటకు రెండు వైపుల పదును ఉంటుంది. గురువు మాట మెత్తగా కోస్తుంది. నొప్పి కలగదు, మంట పుట్టదు. మనిషి లోపలి అహాన్ని తుంచివేస్తుంది. అది గురువాక్య మహిమ. ఆధ్యాత్మిక మార్గంలో నడవడం అసిధారా వ్రతం లాంటిది. కత్తి అంచున నడవడం వంటిది. ఇక్కడ బుద్ధి, వివేకం బొత్తిగా పనికిరావు.

మెహర్ బాబా అంటారు :

ఆధ్యాత్మిక గురువుకు (యోగికి) రెండు స్థితులుంటాయి. ఒకటి : అంతరస్థితి, రెండవది : బాహ్యస్థితి. అంతర్బహిశ్చ అంటారు. అంటే రెండూ సమం కావాలి, ఒకటి కావాలి. రెండింటి మధ్య తెర చాలా పలచగా ఉంటుంది. ట్రాన్స్పరెంట్. అటు నుండి ఇటు చూడవచ్చు. ఇటు నుండి అటు చూడవచ్చు. అంతరిస్థితిని శుద్ధి చేసే శక్తి మనిషికి సామాన్యంగా ఉండదు. గురువు మాత్రమే ఆ పని చేయగల సమర్థుడు. ఒక సద్గురువు లభించే వరకు దేవుని పేర పూజారులు చేసే పని అలాంటిది. వారు మంత్రాలతో, మాటలతో చేస్తారు. అది బాహ్యశుద్ధికి ఉపకరిస్తుంది. గురుస్పర్శతో గాని అంతశ్శుద్ది కార్యక్రమం మొదలవదు. ఆత్మ జాగృతం అయితే తప్ప ఆ పని జరగదు.

భగవంతుని కోసం తపించేవారు ఏదో ఒకటే మార్గమే ఎన్నుకోవాలి. రెండూ కుదరవు. మధ్యే మార్గం పనికిరాదు. ఆత్మ జ్ఞానం గురువు ద్వారానే కలుగుతుంది. గురువు సులభంగా లభించడు గనుక రెండో మార్గం ఎన్నుకుంటారు చాలామంది. అది మతం, దేవుళ్లు, గుళ్లు గోపురాలు, పూజలు. ఆత్మారాధన గురుమార్గం. ప్రతి మతం అనేక నిబంధనలు విధిస్తుంది. పరమత ద్వేషానికి బీజాలు నాటుతుంది. ఇటు స్వమతాభిమానం, అటు పరమత ద్వేషం ఒకే స్థాయిలో పెరుగుతుంటాయి. అవి అన్నీ బాహ్య జీవితానికి సంబంధించి నవే. కళ్లు మూసుకుని ధ్యానించడం అన్నది అన్ని మతాలలో ఉంది. మతాల విధానాలు వేరైనా ఆత్మానందం ఒక్కటే.

కొంతమంది బాలారిష్ట యోగులున్నారు. ప్రాణాయామం చేసి అదే యోగం అని మభ్యపెడుతున్నారు. అవన్నీ బాహ్య క్రియలు. అంతశ్శుద్ధికి బొత్తిగా పనికిరావు. ఒక సద్గురువు లభించే వరకు ఎన్ని వేషాలు వేసినా, తర్వాత అన్నీ వదలవల సిందే. యోగులు, రుషులు శరీరపోషణ అలక్ష్యం చేయడం వల్ల సన్నగా, అర్భకంగా ఉంటారు. కాని వారి ఆత్మశక్తి అమోఘం.”
📖

ఆ రోజు చాక్లెట్లు తెప్పించి మెహర్ బాబా అందరికీ పంచారు.

“ఎట్లా ఉన్నాయి?”

అద్భుతం! పరమ రుచిగా ఉన్నాయి - అని సమాధానాలు.

పది నిమిషాల తర్వాత బాబా అడిగారు. “ఇప్పుడు చాక్లెట్ రుచి ఎలా వుంది."

ఏమో! అందరూ రుచి మరచిపోయి బిక్క మొహాలుపెట్టారు.

“తింటున్నంత సేపే దేనికైనా రుచి. తర్వాత దాని రుచి క్రమంగా దూరమవుతుంది. సుఖాలూ అంతే. అనుభవిస్తున్నంత సేపే సుఖం రుచిగా ఉంటుంది. తర్వాత దాని అనుభూతి కాదుగదా కనీసం జ్ఞాపకం కూడా మిగలదు. మనస్సు చేదు మందు లాంటిది. సుఖానుభవాలన్నీ చేదు గుళికలు. ఆనందాలు పైపూతలు. చేదు మందు మింగడం కష్టం కనుక సుఖం అనే తియ్యటిపూత అద్దడం. ఆ తీయందనం క్షణంలో కరిగిపోయి లోపల చేదు విషం మిగులుతుంది. అంటే ఏమిటి? ప్రపంచం లోని సుఖాలు, ఆనందాలు అన్నీ క్షణికాలు, స్వల్ప కాలికాలు. చివరికి మిగిలేవి చేదు నిజాలు, పరమ చేదు అనుభూతులు.”
📖


*అవతార ప్రశస్తి*

పూనాలో ఉన్నంతకాలం మెహర్ (మెర్వన్) ఆధ్యాత్మిక పిపాసి, విద్యార్థి. సద్గురువుల దర్శనం స్పర్శనలు ఆశించేవారు. వారి ఆశీస్సులు అభిలషించేవారు. బాబాజాన్ తొలిగురువు, సాయిబాబా రెండవగురువు. ఉపాసినీ మహరాజ్ ఇష్టగురువు. ఆధ్యాత్మికత గూడు కట్టుకున్న తర్వాత నెమ్మదిగా స్వతంత్రించసాగారు. తనను అభిమానించే మిత్రులను తొలి శిష్యులుగా స్వీకరించారు. దగ్గరివారితోనే 'మండలి' ఏర్పాటు చేశారు. సాకోరిలో ఉపాసినీ మహరాజ్ 'మండలి' దీనికి ఆదర్శం. సాకోరిలో ఉండగానే చిన్న గురువుగా ప్రశస్తిపొందారు.

బొంబాయి చేరాక మెహర్ బాబా తన కార్యక్రమాలకు నిర్దుష్ట రూపకల్పన చేశారు. గురువుగా నిలబడడానికి గట్టి శిష్యులు, విశ్వాస పాత్రులైనవారు కావాలి. కఠిన నియమాలతో అలాంటి వారిని తయారు చేసుకున్నారు. తనకోసం ప్రాణాలివ్వడానికైనా వారు సిద్ధం. క్రమశిక్షణ అంటే తిట్టడం, కొట్టడం, ఉపవాసాలు అనే భ్రమలో కొంతకాలం సాగింది. తర్వాత సాత్విక ప్రవర్తన అలవాటు చేసుకున్నారు. 'ప్రేమ' సూత్రం పట్టుకున్నారు. ఏది ఎందుకు చేస్తారో ఎవరికీ తెలియదు. 'నియంతలా వ్యవహరించడం జరిగింది. తన గురువు లుగా చెప్పుకునే వారికంటే తనే ఎక్కువ శక్తివంతుడిననే ఒక భావం తలలో దూరింది.

శిష్యుల లోపాలు గురువులు భరించినట్లే, గురువుల లోపాలు కోపతాపాలు శిష్యులూ సహిస్తారు. ఉన్న పద్ధతుల్ని కాదనడం కొత్తదనం. హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయనవసరం లేదు. ఇంట్లోనే మోక్షం లభిస్తుందంటే జనాలకు అంతకన్న ఏం కావాలి! పైగా జనాన్ని ఆకర్షించడం కోసం హిందూ గ్రంథాలు, వేదాంతం, ఇస్లాం సూక్తులు, జొరాస్ట్రియన్ ధర్మాలు బోధించడంతో ఎవరి మతధర్మాన్ని వారు పాటించవచ్చు అనడంతో ఆకర్షణ ఇంకా పెరిగింది. ఎంత వైరాగ్యం, వేదాంతం బోధించినా ఆయన శిష్యులకు సంసారాల మీద అయిష్టం కలగలేదు. ఎప్పుడెప్పుడు ఇళ్లకు పారిపోదామా అని చూడసాగారు.

అప్పుడే 'గరీబోంకా ఆసరా' పేరుతో ఉపాసినీ మహరాజ్ జీవిత చరిత్ర తయారైంది. దానికి ఒక సూఫీ పండితుడు హసన్ నిజామీ చేత 'ప్రస్తుతి' రాయించాల నుకున్నాడు. అందుకు హసన్ నిజామీ అంగీకరించాడు. అప్పుడే మెహర్ బాబా మనసులో ఓ మెరుపు మెరిసింది. 'నవ ప్రవక్త. నవయుగ వైతాళికుడు.' జీసస్ మళ్లీ అవతరిస్తాడని, అప్పటికే థియోసఫి స్టులు ఒక యువప్రవక్తను రంగం మీదికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. బుద్దుడు 'మైత్రేయగా' అవతరించనున్నాడని బౌద్ధ ప్రపంచం ప్రచారం చేస్తోంది. ఆ ప్రవక్త మరో జొరాస్ట్రియన్ ఎందుకు కాకూడదు? మెస్సయ్య ఇండియాలోనే జన్మిస్తాడని, ఇక్కడ నుండే తొలి సందేశం ప్రపంచానికి అందిస్తాడని ఓ చిన్న ప్రచారం జరిగింది.

ఆ సంకల్పం కలిగిన రోజు రాత్రి భోజనాల అనంతరం మెహర్ బాబా మండలి సభ్యులతో సాకోరి ప్రయాణం గురించి ప్రస్తావించాడు :

"ప్రస్తుతం నా ఆరోగ్యం సరిగా లేదు. బాధ దుర్భరం అనిపిస్తోంది. సాకోరి వెళితే నా బాధను గురువుగారు కొంతవరకు తీసేస్తారు. అయితే నా బాధను తను బదిలీ చేసుకోవడం వల్ల తను బాధపడ వలసి వస్తుందని నాకు బాధగా ఉంది. తను బాధ భరించలేక, నిగ్రహించలేక, అందరి ముందు నన్ను తిట్టవచ్చు, కొట్ట వచ్చు. చెప్పలేం ఏం జరిగేది? మరొక రకంగా నన్ను అవమానపరచనూ వచ్చు. కాని అది తప్ప నా బాధ తగ్గించుకోడానికి మరో మార్గం కనిపించడంలేదు."

"నేను చాలా కాలంగా గమనిస్తున్నాను. చాలా శక్తులు నాకు ప్రతికూలంగా పనిచేస్తున్నాయి. కొందరు ఓర్వలేనివారు అసూయతో నాపై ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఎవరో 'మహా' పురుషులు నాపై కక్షగట్టి శపిస్తున్నారనిపిస్తోంది. ఉపాసినీ మహరాజ్ కూడా నాపైన కోపంగా ఉన్నారని తెలుసు. అయినా వెళ్లక తప్పదు. వెళ్లకపోతే ఈ బాధ భరించలేను.”

ఒకరిద్దరు తప్ప అందరూ సాకోరి వెళ్లడానికి సిద్ధపడ్డారు. ఆ రాత్రే ప్రయాణం. మెహర్ ఘనీని పిలిచి వివేకానందుని పుస్తకం తెప్పించి అందులోంచి కొన్ని వాక్యాలు చదివి వినిపించాడు :

"The only Teacher is he who can convert himself into a thousand forms at a moment's notice and who can immediately come down to the level of the student, transform his soul to the students soul, see through the student's eyes, hear through his ears and understood through his mind. Only such a Teacher can teach".

బాబా ఇచ్చిన వివరణ :

ఎం.ఎ. చదివిన టీచర్ ఎల్.కె.జీ. విద్యార్థికి పాఠం నేర్పవలసివస్తే ఆ విద్యార్థి స్థాయికి దిగివచ్చి చిన్నవాడుగా మారాలి. పిల్లలతో కలిసిమెలిసి అక్షరాలు దిద్దించాలి. అప్పుడే పిల్లలకు నచ్చుతుంది. నెమ్మదిగా పిల్లల్ని తన స్థాయికి తీసుకుపోవాలి. తను 'ఎం. ఏ.' అనుకుంటూ పాఠం చెప్పినా, ప్రవర్తించినా పిల్లలకు నచ్చదు. అలాగే గురువులు తమ అంతస్తులు దిగి శిష్యుల స్థాయికి వచ్చి జ్ఞానం బోధించాలి. మాస్టర్లు మాత్రమే ఆ పని చేయగలరు. వారు సద్గురువులు. మామూలు గురువులకు అహంకారం ఉంటుంది. 'అహం'కారం లేని వారు సద్గురువులు. తన ఆత్మను విశ్వాత్మ స్థాయికి చేర్చనివారు ఎవరినీ ఉద్ధరించలేరు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment