*సత్సంగం*🚩
ఒక చీకటి గదిలో ఒక దీపం ఉంది. కానీ దానిమీద మూడు మూకుళ్ళు ఉన్నాయి. అందువలన ఆ దీపం వెలుగు ప్రసరించక గదంతా చీకటిగా ఉంది.
ముందుగా పైనున్న ఇనుప మూకుడును పగులగొడితే లోపలనున్న చిల్లుల మూకుడు నుంచి కొద్ది కొద్దిగా వెలుగు ప్రసరించి గదిలో ఉన్న వస్తువులు తెలుస్తాయి.
ఆ చిల్లుల మూకుడును కూడా పగులగొడితే లోపలనున్న గాజు మూకుడు నుండి దీపం కాంతి స్పష్టంగా కనిపిస్తుంది.
కానీ ఈ గాజు మూకుడు కూడా కొంత కాలానికి మసిబారే అవకాశం ఉంది. కనుక ఆ మూకుడును కూడా తొలగించుకుంటే శాశ్వతంగా దీప కాంతిని అనుభవించవచ్చు.
*ఇందులో ఇనుప మూకుడు తమోగుణం.* *చిల్లుల మూకుడు రజోగుణం.*
*గాజు మూకుడు సత్వగుణం.*
*ఈ మూడు గుణాలు మనలోనే ఉన్న జ్ఞానజ్యోతిని దర్శించటానికి పైన చెప్పిన ఉదాహరణలోవలె మనకు అడ్డు పడుతున్నాయి.*
తెల్లని కాంతిని మూడు పలకలు గల గాజు పట్టకం(prism)లోనుండి ప్రసరింప చేస్తే ఆ తెల్లని కాంతి విక్షేపం చెంది ఏడు రంగులలో మనకు కనిపిస్తుంది.
అలాగే
*ఒక్కడే అయిన పరమాత్మ మూడు గుణాలతో కూడిన మన మనస్సులకు ఇన్ని విభిన్న రూపాలలో, లక్షణాలతో ప్రకృతిగా కనిపిస్తున్నాడు. ఈ మూడు గుణాలను తొలగించుకుంటే సర్వత్రా ఒక్క పరమాత్మనే దర్శించ గలుగుతాం.*🙏🙏🙏
మూడు రెక్కలు గల ఫ్యాన్ ఆగి ఉన్నప్పుడు రెక్కలు మూడు విడి విడిగా కనిపిస్తాయి. అదే ఫ్యాన్ వేగంగా తిరిగినప్పుడు మూడు రెక్కలు మాయమై ఒక్కటే ఆకారం కనిపిస్తుంది.
అలాగే
*ధ్యానాన్ని వేగంగా (అంటే మధ్యలో విషయాలేవీ అడ్డు రాకుండా) చేసినప్పుడు ఈ మూడు గుణాలు మాయమై ఏకవస్తు దర్శనం అవుతుంది.*🙏🙏🙏
*ఆధ్యాత్మిక సాధనలో మనం ముందుగా రజోగుణాన్ని (అంటే దానిలో భాగమైన పట్టుదల, ఏదైనా సాధించగలననే ఆత్మ విశ్వాసం మొదలైనవి) ఉపయోగించుకొని తమోగుణాన్ని(అంటే బద్ధకాన్ని, సోమరితనాన్ని) జయించాలి. ఆ తరువాత సత్వగుణాన్ని ఉపయోగించుకొని రజోగుణాన్ని కూడా జయించాలి. ఇక చివరిగా సత్వగుణాన్ని కూడా జయిస్తేనే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.*🙏🙏🙏
*రజో, తమో గుణాలు ఇనుప, ఉక్కు సంకెళ్ళ లాంటివైతే సత్వగుణం బంగారు సంకెల లాంటిది. ఏ సంకెల అయినా మనను బంధించేదే.*
*ఓం నమఃశివాయ* 🙏
No comments:
Post a Comment