Sunday, July 27, 2025

 స్త్రీ కుటుంబం అనే బందీఖానాలో మిగిలిపోకూడదని, ఆమెకంటూ వ్యక్తిగత జీవితం ఉండాలని, పిల్లలను కనాలా వద్దా అనే నిర్ణయం ఆమెదని, వివాహం చేసుకున్నా కూడా భర్తతో ఆమె ఒకే ఇంట్లో ఉండవలసిన అవసరం లేదని, ఎవరి ఉద్యోగ ధర్మాన్ని వాళ్లు నిర్వర్తిస్తూ విడిగా ఉండడం తప్పు కాదనే ఆలోచనలను నేటికీ ఒప్పుకోలేని సమాజం మనది. కాని మల్లాది సుబ్బమ్మ గారు ఆ రోజుల్లో ఈ చర్చతో ఓ నవలే రాసారు. స్త్రీవాద సాహిత్యం అంటూ ఏవో కొన్ని పుస్తకాలు, కొందరి నవలలు తప్ప, తెలుగులో ప్రగతీశీల భావజాలంతో వచ్చిన చాలా పుస్తకాలను అసలు ఎవరూ ప్రస్తావించకపోవడం మన భాషా సాహిత్యంలోని రాజకీయం అనిపిస్తుంది నాకు. ఎవరో ఒకరిద్దరు రచయిత్రులు తప్ప ఇంకెవరూ మరో తరానికి చేరకుండా మన సాహిత్య వాతావరణం అడ్డుపడుతుంది. 

మల్లాది సుబ్బమ్మ గారు సంఘ సంస్కర్తగా అందరికీ తెలుసు. కాని ఎంతటి పదునైన ఆలోచనలతో వారు నవలలు రాసారో మాత్రం ఎవరూ ఎక్కడా చర్చించగా నేను వినలేదు. మల్లాది సుబ్బమ్మ గారి పుస్తకాల ప్రస్తావన నేను ఏ స్త్రీ వాద సభలలోనూ వినలేదు. వీరి నవలల్లో వాడిన భాష, శైలి కొంత మోనోటోనస్ గా ఉండవచ్చు కాని ఈమె నవలలో చర్చించిన విషయాలు ఎంత సూటిగా ఉంటాయంటే ఆమె ఆలోచనలకు వాటిని వ్యక్తీకరించిన విధానానికి ఆశ్చర్యపోతాం. ఈ పుస్తకాలను ప్రస్తుత స్త్రీవాద సాహిత్యం ఎందుకు చర్చించదు అన్న విషయం తెలుగు సాహిత్యంలోని మేధావులే చెప్పాలి. ఎవరూ చెప్పకపోతే, ఎక్కడా చర్చకు రాకపోతే కొత్త తరానికి ఈ నవలలు ఎలా చేరతాయి?

‘వంశాంకురం’ నవల ఏ సంవత్సరంలో వచ్చిందో నాకు తెలీదు.  నేను ఈ పుస్తకాన్ని ఓ పుస్తక ప్రేమికుని పర్సనల్ కలెక్షన్‌లో సంపాదించాను. దాని ముందు పేజీ లేదు కాబట్టి ప్రచురించబడ్డ సంవత్సరం తెలీదు. కాని ఇది ఖచ్చితంగా మనం చర్చించుకుంటున్న ప్రస్తుత స్త్రీవాద నవలలన్నిటి కంటే ముందే వచ్చిన నవల అని మాత్రం అర్ధం అవుతుంది. ఇందులో చర్చించిన విషయం “స్త్రీకి సంతానాన్ని కని పెంచడమే జీవిత ధ్యేయమా? ఆమెకు జీవిత లక్ష్యాలు, ఆదర్శాలు ఉండరాదా”? ఈ నవలలో కథను నడిపించిన తీరు ఇప్పటి బోల్డ్ రచనల కన్నా ఎన్నో రెట్లు ధీటుగా ఉంది. ఆధునిక రచయిత్రులు తాము చాలా ప్రోగ్రెసివ్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కాని ఈ నవలలో మల్లాది సుబ్బమ్మ గారు స్పృశించిన కోణాలను గమనిస్తే మనం ఆమె చర్చకు పెట్టిన విషయాలనే చిలక పలుకులుగా పలుకుతూ ఆమెను తొలి తరం ప్రగతిశీల రచయిత్రిగా ముందు తరాలకు పరిచయం చేసే బాధ్యతను విస్మరిస్తున్నాం అని ఒప్పుకోవలసి వస్తుంది. పాత తరం రచయిత్రులను మరో తరానికి పరిచయం చేసే బాధ్యతను తెలుగులో ఏ సాహితీ చర్చలలో సహేతుకంగా జరపలేకపోవడం తెలుగు సాహిత్య ప్రపంచంలో పెద్ద లోటు.

‘వంశాంకురం’ నవలకు వద్దాం. ఇందులొ ప్రధాన పాత్ర నళిని. సైంటిస్ట్‌గా గొప్ప పేరు తెచ్చుకున్న స్త్రీ. ఈమె జీవితమే ఈ నవల కథా వస్తువు. నళిని ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రికి చదువు పట్ల ఎంతో ప్రేమ. అందుకే బిడ్డను గొప్పగా చదివించాలని అనుకుంటాడు. డిగ్రీలో ఈమెకు పద్మిని అనే స్నేహితురాలు పరిచయం అవుతుంది. స్త్రీ సంబంధిత ఉద్యమాలలో ఈమె క్రియాశీలకంగా పని చేస్తూ ఉంటుంది. ప్రతి స్త్రీకి విధిగా వివాహం చేసుకోవల్సిన అవసరం లేదని పద్మిని నమ్ముతుంది. స్త్రీకి వ్యక్తి వికాసం ముందా లేక దాంపత్యం అనే పేరుతో వివాహ బంధం ముందా అనే విషయాన్ని ఆమె లోతుగా చర్చిస్తుంది. ఈ రెంటికి సమన్వయం కలగని చోట వివాహ బంధంలో స్త్రీ ఇరుక్కోవడం పొరపాటని ఆమె అభిప్రాయం. నాకు తెలిసి ఇంత స్పష్టతో స్త్రి వికాసం గురించి మరే రచయిత  రాయలేదు. “నేను పురుషుణ్ణి అనే భావం పురుషుల్లో ఉన్నంత వరకు నాకు నా ఉద్యమానికి విశ్రాంతి ఉండదు” అని ప్రకటించుకుంటుంది పద్మిని. “నేను పురుష ద్వేషిని కాదు. పురుష దురహంకార ద్వేషిని” అని చెప్పుకోగల  స్పష్టత పద్మిని సొంతం.

కాలేజి రోజుల నుండి పద్మిని, నళిని, చంద్రం ఒక జట్టుగా ఉంటారు. పద్మినిని చంద్రం ఇష్తపడతాడు. ముగ్గురు కలిసి యూనివర్సిటీ చదువుకు వస్తారు. అక్కడ నళిని సారధి అనే పుట్ బాల్ ప్లేయర్ పట్ల ఆకర్షితురాలవుతుంది. ఇద్దరు ఒంటరిగా సమయం గడపడం మొదలవుతుంది. ఆమెకు సారధి పట్ల ఉన్నది మోహం మాత్రమే అని పద్మిని చెప్పబోతుంది. కాని నళిని ఈ విషయంలో స్నేహితురాలిని పట్టించుకోదు. సారథితో జీవితం పంచుకోవాలని అనుకుంటుంది. సారధి బ్రాహ్మణ కూటుంబానికి చెందిన వాడని, తండ్రి చాటు బిడ్డ అయిన సారథి కులాన్ని వదులుకోడని చాలా మంది కులంకు అతీతంగా ఉన్నట్లు ప్రవర్తిస్తూనే తమ దాకా వచ్చేసరికి కులాన్ని వదిలి రారని నళినిని హెచ్చరిస్తుంది పద్మిని. దసరా సెలవుల తరువాత సారధి మరో అమ్మాయితో తిరగడం చూస్తుంది నళిని. ఆ ఇద్దరూ కలిసి తనను వెటకారం చేయడం ఆమె సహించలేక స్పృహ తప్పి పడిపోతుంది. చంద్రం, పద్మిని లు ఆమెను కనిపెట్టుకుని ఆ అవమానం నుండి బైటకు తీసుకొస్తారు. తాను అనవసరంగా సారధి ఆకర్షణలో పడి చదువు నిర్లక్ష్యం చేసానని అర్ధమయి నళిని ఆ తరువాత పూర్తిగా చదువుపై మనసు కేంద్రీకరిస్తుంది. 

నళిని ప్రతిభను గమనించిన ప్రొఫెసర్ సుధాకర్ అనే రీసర్చ్ స్టూడెంట్ ను ఆమెకు గైడ్ గా నియమిస్తాడు. సారధితో పరిచయం నళినిని కొంతకాలం చదువుకు దూరం చేయడాన్ని గమనించిన సుధాకర్ ఆమెను తిరిగి చదువు దారిలోకి తీసుకువస్తాడు. చంద్రం లా కోర్సులో జాయిన్ అవుతాడు. నళిని సుధాకర్ తన జీవన సహచరుడు అయితే బావుండుననే ఆలోచనకు వస్తుంది. కాని పద్మిని ఆమెను జాగ్రత్తగా ఆలోచించుకొమ్మని చెబుతుంది. నీకు శాస్త్రజ్ఞుడు భర్తగా కావాలా శాస్త్రియ భావన, అవగాహాన ఉన్నవాడు కావాలా అని సూటిగా అడుగుతుంది. మన భారత దేశంలో ఇవి రెండు విభిన్నమైన మనస్తత్వాలని అందుకే జాగ్రత్తగా ఆలోచించుకొమ్మని చెబుతుంది. నళిని శాస్త్రీయ దృష్టి, శాస్త్రీయ భావన  శాస్త్రీయ అవగాహన ఉన్న శాస్త్రజ్ఞుడుని తాను భర్తగా కోరుకుంటున్నానని చెబుతుంది. సుధాకర్ కి కులం గోత్రం పట్టింపులు లేకపోయినా జాతకాలను నమ్ముతాడని అని ఆమెకు ఆలస్యమ్గా తెలుస్తుంది. పైగా ఓ బాబా పై  తన కుటుంబానికి నమ్మకం, భక్తి ఉన్నాయని చెప్తాడు సుధాకర్. తాను ఆ బాబాగారి శిష్యుడిని అని అతని అనుమతితోనే వివాహం చేసుకుంటానని అంటాడు. సైంటిస్టు కాబోయే వ్యక్తి బాబాలకు దాసుడని తెల్సి నళిని సహించలేకపోతుంది. అతన్ని కాదనుకుంటుంది. 

నళిని ఎమ్.ఫిల్ లో చేరుతుంది. ఇంగ్లీషు సారస్వత విభాగంలో రీడర్ అయిన చిత్తరంజన్ తో ఆమెకు పరిచయం అవుతుంది. ఇతను చంద్రం స్నేహితుడు కూడా. అతని పరిచయంతో ఆమె ఇంగ్లీషు సాహిత్యాన్ని చదవడం మొదలెడుతుంది. ఇద్దరి పరిచయం వివాహం వరకు వస్తుంది. కాని వివాహం చేసుకున్నా కొన్నేళ్ల వరకు అంటే తన పీ.హెచ్.డి అయిపోయేవరకు తాను అతనితో కలిసి ఉండనని చెబుతుంది నళిని. తాను భార్యగా జీవిస్తూనే గృహిణిగా అప్పుడే బాధ్యతలు చేపట్టనని హాస్టలులోనే ఉంటానని స్పష్టంగా చెబుతుంది.
చంద్రం పద్మినిని ఆరాధిస్తాడు. కాని ఆమె అతన్ని వివాహం చేసుకోదల్చుకోదు. నళినికి పెళ్లి ఇష్టం. కాని దాని కోసం ఆమె వెంపర్లాడట్లేదు. చంద్రం తాను ఇక ఒంటరిగా జీవించలేనని నిశ్చయించుకుంటాడు. నళినిని కలిసి వివాహ ప్రస్తావన తీసుకువస్తాడు. నళిని సంతోషంగా ఒప్పుకుంటుంది. తన ఆలోచనల గురించి, జీవితం గురించి ఆశయాల గురించి పూర్తిగా తెలిసిన చంద్రంతో తన జీవితం బావుంటుందని నిశ్చయించుకుంటుంది. పద్మిని కూడా ఈ వివాహాన్ని సంతోషంగా ఆమోదిస్తుంది. ఇద్దరూ సింపుల్ గా రిజిస్టర్ మారేజ్ చేసుకుంటారు. ఈ వివాహానికి చిత్తరంజన్ కూడా వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు చెపుతాడు. 

చంద్రం ఇంట్లోనే వారానికి రెండు రోజులు కలుసుకుంటూ ఉంటారు దంపతలు. మిగతా సమయం అంతా యూనివర్సిటీలో తన రీసెర్చ్ లో గడుపుతుంది నళిని. చంద్రం అక్కలు బంధువుల నడుమ పిల్లల ప్రస్తక్తి రావడం మొదలవుతుంది. నళిని పీ.హెచ్.డి పూర్తి చేసి పూర్తి స్థాయి ప్రయోగాలలో పడిపోతుంది. చంద్రం పెద్ద లాయరుగా పేరు తెచ్చుకుంటారు. పిలల్ల గురించి అతనిలోనూ ఆలోచన మొదలవుతుంది. అందుకే నళినిని డాక్టర్ దగ్గరకు తీసుకెళతాడు. ఇద్దరిలోనూ ఏ లోపం లేదని డాక్టర్ చెబుతుంది. 

తాను కుటుంబ నియంత్రణను పాటిస్తున్నానని, ఒక సారి అబార్షన్ కూడా చేయించుకున్నానని, పిల్లల పట్ల తనకు ఆసక్తి లేదని నళిని చంద్రానికి చెబుతుంది. తన గర్భంపై తనకు హక్కు ఉందని పిల్లలను కనాలా వద్దా అన్నది తన నిర్ణయమని ఆమె స్పష్టం చేస్తుంది.  దీన్ని సహించలేకపోతాడు చంద్రం. ఇద్దరూ విడిపోతారు.
పద్మిని చిత్తరంజన్ లు వివాహం చేసుకుంటారు. చంద్రంతో విడిపోయి నళిని రీసర్చ్ లో పడిపోతుంది. నోబల్ బహుమతి సాధిస్తుంది. సన్మాన సభలో తన జీవన ప్రయాణాన్ని వివరిస్తూ, ఆలిగా జీవించినా గృహిణిగా ఉండడానికి అంగీకరించకపోవడమే తన ఉన్నతికి కారణం అని స్త్రీ తన గర్భంపై తానే నిర్ణయం తీసుకునే దిశగా ఎదగకపోతె స్త్రీలు తము కోరుకున్న రంగాలలో ముందుకు వెళ్లలేరని అందరికీ బిడ్డలపై ఒకే రకమైన మమకారం ఉండదని తనకు తన పని బిడ్డతో సమానమని ఆ రకంగా తాను తల్లినే అని ప్రకటించుకుంటుంది. 

నవలలో చర్చించిన విషయాలు అన్నీ ఆ రోజుల్లో విప్లవాత్మక భావాలే. నళిని ముగ్గురు పురుషులని గమనించి చివరకు స్నేహితుడయిన చంద్రాన్ని వివాహం చేసుకుంటుంది. కాని పద్మినిలోని స్పష్టత ఆమెలో ఉండదు. సారధి పట్ల అకర్షితురాలవుతుంది, సుధాకర్ తన పరిశోధనా జీవితానికి ఊతం అవుతాడనుకుటుంది. చిత్తరంజన్ దగ్గరకు వచ్చేసరికి వివాహం చేసుకుని అతనితో కలిసి ఉండనని ప్రకటిస్తుంది. కాని చంద్రం దగ్గరకు వచ్చేసరికి తాను కోరుకున్నవన్నీ అతనితో సహజీవనంలో జరుగుతాయని నమ్ముతుంది. చంద్రం ఆమె కోరుకున్నట్లే అన్నిటికీ సహకరిస్తాడు. ఐదు సంవత్సరాల పాటు విడిగానే జీవిస్తాడు. ఆమె ఉన్నతిని ప్రోత్సహిస్తాడు. కాని తండ్రి కావాలనే అతని కోరికను ఆమె కొట్టిపడేయడంతో ఆమెతో విడిపోతాడు. 

ఇలాంటి పరిస్థితి వస్తుందనే పద్మిని వ్యక్తివికాసం ముందా వివాహ బంధం ముందా అని స్త్రీ నిర్ణయించుకోవాలని ప్రశ్నిస్తుంది. నళిని తన గర్భంపై అధికారం ప్రకటించడం న్యాయమే అయినా ఆ విషయంలో చంద్రం ఆలోచనలను పరిగణించకుండా అతను తన చర్యలన్నిటినీ ఆమోదిస్తాడని గుడ్డిగా నమ్మడం  మాత్రం వక్తిగతంగా నాకు తప్పుగా ఆనిపిస్తుంది. తనతో ముందుగా చెప్పకుండా డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లాడని కోపగించి అది అవమానంగా అనుకున్న నళిని తనకు అబార్షణ్ విషయం ఎందుకు చెప్పలేదని చంద్రం అడిగితే అతన్ని తప్పుపడుతుంది. వివాహానికి ముందే పిల్లల పై తనకున్న అభిప్రాయాన్ని చంద్రానికి ఆమె చెప్పకపోవడం నళిని వ్యక్తిత్వంలో లోపంగానే అనిపిస్తుంది. 

నళిని కాదన్న చిత్తరంజన్ పద్మినిని వివాహం చేసుకుంటాడు. పద్మిని స్పష్టమైన స్త్రీవాది. తనకేం కావాలో ముందే చెప్పగలదు. విశ్లేషించగలదు. చిత్తరంజన్ వివాహం తరువాత భార్యతో వేరుగా ఉండవల్సి రావడాన్ని ఒప్పుకోలేకపోతాడు. ఆ కారణంగా నళినితో వివాహం కాదనుకుంటాడు. అదే విధంగా చంద్రంతో పిలల పట్ల తన అభిప్రాయాని నళిని ముందే చెప్పి ఉంటే అతని నిర్ణయం వేరేగా ఉండేదేమో. చంద్రం తన ప్రతి  నిర్ణయాన్ని ఆమోదించేస్తాడని నిర్ణయించుకోవడం, అబార్శణ్ విషయంలో అతనితో ఏమీ చెప్పకపోవడం నళినిలోని ఆధిపత్య ధోరణిని చూపిస్తుంది. ఏది ఏమయినా వివాహం అనే స్టీరియోటైప్ జీవితంలో తాను ఉండదల్చుకోనప్పుడు స్త్రీలో చాలా స్పష్టత ఉండాలని పద్మిని, నళిని ఇద్దరూ నిరూపిస్తారు. అంత స్పష్టత ఉండటం వల్ల పద్మిని చిత్తరంజన్ ఒకటిగా జీవించగలిగితే ఆ స్పష్టత కొరవడి నళిని భర్త నుండి విడిపోతుంది.  

అయినా పితృస్వామ్య వ్యవస్థలో కుటుంబ జీవినంలో తన పాత్రను తానే నిర్ణయించుకోగల ఇద్దరు స్త్రీల జీవితాన్ని ఆ రోజుల్లో ఈ నవలలో మల్లాది సుబ్బమ్మ గారు చర్చకు పెట్టిన తీరు విప్లవాత్మకం. వీరి రచనలు ప్రస్తుత తరం  పాఠకులకు అందుబాటులో ఉండాలి. ఈ నవల ప్రస్తుతం మార్కెట్ లో లేదు. మల్లాది సుబ్బమ్మ గారిని ఆక్టివిస్టుగా మాత్రమే కాదు రచయిత్రిగా సముచిత స్థానంలో నిలబెట్టాలని ప్రస్తుత స్త్రీవాద రచయిత్రులు పూనుకుని వీరి పుస్తకాలను పునఃముద్రించే దిశగా కృషి చేస్తె బావుంటుంది.

Smt. P. జ్యోతి.

No comments:

Post a Comment