*📖 మన ఇతిహాసాలు 📓*
5️⃣
*మౌసల పర్వము*
*శ్రీకృష్ణుడి నిర్యాణము*
బలరాముడు ఈ తన అవతారము చాలించడము కళ్ళారా చూసిన శ్రీకృష్ణుడు తాను కూడా అవతారము చాలించవలసిన సమయము వచ్చిందని అనుకున్నాడు. తాను ఈ భూలోకములో ఏ కార్యనిర్వహణకు అవతరించాడో అది ఎలా నిర్వహించాడో తలచుకుంటూ దిక్కుతోచకుండా తిరుగుతున్నాడు. ఇప్పుడు తాను ఎలా ఈ శరీరము వదిలి పెట్టాలో అని ఆలోచించసాగాడు. శ్రీకృష్ణుడికి గతము గుర్తుకు వచ్చింది. ఒకసారి దుర్వాసుడు తన ఒంటికి పాయసము పూయమని కోరినప్పుడు తాను శరీరము అంతా పూసి అరికాలుకు పూయలేదు. అప్పుడు దుర్వాసుడు " కృష్ణా ! నీ మరణము అరికాలులో ఉంది " అన్నాడు. అది గుర్తుకురాగానే తాను ఎలా ప్రాణాలు వదిలి పెట్టాలో అర్ధము అయింది. శ్రీకృష్ణుడు నేలమీద పడుకుని ఇంద్రియములను నిగ్రహించి యోగసమాధిలోకి వెళ్ళాడు. అ సమయములో జర ఆరణ్యములో ప్రవేశించింది. జర అక్కడ తిరుగుతున్న వేటగాడిని ఆవహించింది. అతడి కళ్ళకు పడుకుని ఉన్న కృష్ణుడి కాళ్ళు ఒక లేడి అనే భ్రాంతిని కలుగజేసింది. వెంటనే వేటగాడు పడుకుని ఉన్న శ్రీకృష్ణుడి కాలుకు గురిపెట్టి ఒక బాణమును వదిలాడు. ఆ బాణము పడుకుని ఉన్న శ్రీకృష్ణుడి పాదములో గుచ్చుకుని బయటకు పొడుచుకు వచ్చింది. ఆహా జింక చచ్చింది అనుకుని దానిని తీసుకు పోవాలని అనుకుని దగ్గరకు వచ్చిన వేటగాడికి దగ్గరకు రాగానే మాయ తొలగిపోయి అక్కడ ఉన్నది జింక కాదని శ్రీకృష్ణుడు అని తెలుసుకున్నాడు. అది చూసిన వేటగాడు భయముతో వణికి పోయి భోరుమని ఏడుస్తూ శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడ్డాడు. శ్రీకృష్ణుడు అతడిని ఓదార్చి తాను ఈ మానవ శరీరమును వదిలి వైకుంఠము చేరుకున్నాడు. వైకుంఠములో ఉన్న ఋషులు, సిద్ధులు, సాధ్యులు, మరుత్తులు, మునులు, విశ్వదేవతలు, స్వర్గాధిపతి దేవేంద్రుడు తిరిగి వైకుంఠము చేరిన శ్రీకృష్ణుడికి ఘనస్వాగతము చెప్పారు.
*శ్రీకృష్ణుడు వైకుంఠమును చేరుట*
వైకుంఠము చేరిన శ్రీకృష్ణుడితో దేవేంద్రుడు " మహాత్మా ! ధర్మరక్షణలో ఒక భాగముగా నీవు ఆడే జగన్నాటకములో ఒక భాగంగా ఈ భూమిమీద అవతరించావు. కంసుడు, నరకుడు మొదలైన లోక కంటకులను సంహరించావు. భ్రష్టుపట్టిన భరత కులమును పరిశుభ్రము చేసావు. తిరిగి వైకుంఠము చేరుకున్నావు. నీవు ఆది పురుషుడవు, అజరామరుడవు నీకు ఆది అంతము లేదు. నీకు మరణము ఏమిటి. శ్రీకృష్ణుడిగా జన్మించడము, మరణించడము అంతా నీ లీల. ఓ మహాత్మా మానవుల కష్టాలు నీ కష్టాలుగా భావిస్తావు కనుక నిన్ను నమ్ముకున్న నీ భక్తుల కష్టాలు తీరడానికి నీవు ప్రతి యుగములోను అవతరించాలి " అన్నాడు. ఆ మాటలను చిరునవ్వుతో విన్నాడు శ్రీకృష్ణుడు. ఇంతలో బ్రహ్మదేవుడు వచ్చి చేతులు జోడించి వేదమంత్రములతో స్తుతించాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు అందరినీ చూసి " అనిరుద్ధమనే పేరు కలిగింది, ప్రద్యుమ్నమనే కాంతి కలిగింది, సంకర్షణమనే భావముతో ప్రకాశించేది, వాసుదేవుడు అనే నామముతో పిలువబడేది, అనన్యమైనది, అద్వితీయమైనది, జ్ఞానముతో కూడుకున్నది, ఏ దోషము లేనుది అయిన విష్ణుపదమును నాకు నేనుగా సిద్ధించుకున్నాను. పరమ మంగళకరమైన ఈ విష్ణు పదమును నేను స్వీకరిస్తున్నాను. ఓ సుకృతులారా మీరు అందరూ మీ మీ నెలవులకు వెళ్ళండి " అన్నాడు. అలా మునులను దేవతలను పంపిన తరువాత నారాయణుడు తన మూలస్థానము చేరుకున్నాడు.
*మిగతా భాగం రేపటి "📖 మన ఇతిహాసాలు 📓" లో...*
No comments:
Post a Comment