🔱 అంతర్యామి 🔱
*తథాస్తు దేవతలు...*
🍁తథాస్తు... మూడక్షరాల ముచ్చటైన దీవెన! దేవతలు మెచ్చి మానవులకు ఇచ్చే విలువైన కానుక! కష్టనష్టాల నుంచి కాపాడమని, కోరికలు తీర్చి కరుణించమని దేవతలను ప్రార్ధించడం మనుషుల సహజ నైజం.
🍁ఆకాశానికి, అంతరాళానికి నడుమ త్రిశంకులా ఊగిసలాడడం మనుషులకు ఆ భగవంతుడు ఇచ్చిన వరమో, శాపమో తేల్చడం సాధ్యం కాదు. ఊగు ఉన్నచోటే ఉండిపోవడం కన్నా, ముందుకు సాగిపోవడమే మిన్న అన్న భావన కొందరిని నిలబడి నీళ్లు తాగనివ్వదు. అటు స్వర్గానికి, ఇటు నరకానికి కాకుండా మనిషి మధ్యన వేలాడటానికి కారణం లేకపోలేదు. పైవారికి (దేవతలకు) చావురాదు. కింది వారికి (దానవులకు) చావంటే భయం లేదు. మధ్యముడైన మనిషికే చావు తప్పదు. అందుకే అదంటే అంత భయం. మనిషి పూర్తిగా చెడ్డవాడని కానీ, నూరు శాతం మంచివాడని కానీ చెప్పలేం. కాకపోతే దివ్యమానవుడిగా ఎదిగే అవకాశం ఉన్నవాడు.
🍁 సాధన ద్వారా జీవితంలో అనుకున్నది సాధించగలడు. ఏదో ఒక రోజు పూర్ణత్వం సంపాదించుకోవచ్చు. అందుకు మానవ ప్రయత్నం అవసరం. అది సఫలం కావడానికి దైవబలమూ తోడు కావాలి. చిత్తశుద్ధితో, బుద్ధి ఏకాగ్రం చేయగలిగితే ఎంతటి భోగలాలసుడైనా యోగసిద్ధేశ్వరుడుగా మారవచ్చు. అందుకు పెట్టుబడి... పట్టుదల, అవిరళ కృషి, పట్టు విడవని విక్రమార్కుడు ఎన్నో సాహస కార్యాలు సాధించి దేవి అనుగ్రహం పొందాడు. మనం తలవకపోయినా, కొలవక పోయినా, పైనుంచి అదృశ్య శక్తులు మనలని వీక్షిస్తూనే ఉంటాయి అంటారు పెద్దలు. చెడుపనులు, చెడుభావనలు చేయకూడదన్న కట్టుబాటు మానవ ప్రగతికి దారిదీపం లాంటిది.
🍁తథాస్తు దేవతలు తమకు అండగా ఉంటారని భక్తుల నమ్మకం. ప్రాచీన గ్రీకుదేశ వాసులు దారిచూపే దేవతలను 'ఎగ్రిగోర్స్' అని పిలిచేవారు.
🍁యుద్ధరంగానికి బయల్దేరే ముందు విజయం కోరి వారిని ప్రార్థించేవారు. శుభకార్యాలు నిర్విఘ్నంగా జరగాలని, ముందుగానే వారికి మొక్కుబళ్లు చెల్లించేవారు. ఇలాంటి సంప్రదాయం హిందూ ధర్మానికి కూడా దారిదీపంగా నిలిచింది. 'తమసోమా జ్యోతిర్గమయ' అన్న ఉపనిషత్ మహావాక్యం జాతి హృదయంలో సుస్ధిరమైంది.
🍁ఈ ప్రపంచంలోని జడ, జీవ పదార్థాలను ఒక యదార్ధం శాసిస్తోంది. ఇంద్రియాల వెనుక మనసు ఉన్నట్లే కార్యం వెనుక కారణం ఉంటుంది. భావమే బాహ్యరూపంలో జీవితాన్ని నడిపిస్తుంది. సదాచార, సద్విచారాలే మోక్ష ద్వారాలు. కొన్ని ఆకృతులు కంటికి కనిపించకపోయినా మనసును అలరిస్తాయి. కలవరపాటుకు గురిచేస్తాయి. పంచభూతాలు అందరికి సమానంగా తమ శక్తులను పంచుతాయి. ప్రతిఫలం ఆశించవు. అలాగే ప్రతిఫలం కోరకుండా మనం పనులు చక్కబెడితే తప్పకుండా దేవతలు మెచ్చి 'తథాస్తు' అని దీవిస్తారు.🙏
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
No comments:
Post a Comment