Monday, August 4, 2025

 🔴 *_అమరావతి కథలు_* 
_(-సత్యం శంకరమంచి)_ 
---------------------- 
❤ 6వ కథ:- *ముక్కోటి కైలాసం*
----------------------
*🙏మొదటగా వింజమూరి వేంకట అప్పారావు గారు ఫేస్బుక్ లో ఈ కథ గురించి క్లుప్తంగా చేసిన పరిచయం గురించి తెలుసుకుందాం. తరువాత అసలు కథను చదువుదాం...🙏*
_♦ముఖ్య పాత్రలు:- ముసలమ్మ, బిచ్చగాళ్ళు... ఇందులో ఎవరికీ పేర్లు పెట్టలేదు._

_♦బాపు బొమ్మ:- నేలమీద చాలా హీనంగా కూచుని చేతులెత్తి నమస్కరిస్తున్న ముసలిది, ఆకాశంలోనుండి ఒక అద్భుత హస్తం అమె వైపుకు తిరిగి. ఆదిదేవుడే ఆ ముసలమ్మను తన చేత్తో, పూజలే ముఖ్యమయ్యి, తోటి మనిషిని పట్టించుకోని లోకంనుండి, ఒక పర్వదినాన ఆమెను కైలాసానికి తీసుకొని వెళ్ళబోతున్నట్టు స్ఫురిస్తుంది._ 

_♦ఈ కథ కూడా సంఘటనా వర్ణనమే.. ఒక దిక్కులేని ముసలమ్మ వైకుంఠ ఏకాదశి నాడు అమరావతిలో శివాలయంలో దైవదర్శనంకోసం ప్రయత్నించటం, అశేష జనవాహినిలో పడి కొట్టుకుపోయి, ఆ జన సంద్రపు తీరాన విసిరివేయబడటం, ఆమె అక్కడే తనువు చాలించటం._ 

_♦కథలో బిచ్చగాళ్ళ దీన జీవన గాథ, అంతటి బీదరికంలోనూ వాళ్ళలో వాళ్ళు తన్నుకోవటం, తమకంటే తక్కువ వాళ్ళను చీదరించుకోవటం, దిక్కులేని ముసలమ్మను పట్టించుకోక పోగా, కసిరి అవతలకి పొమ్మనటం, చివరికి ముసలమ్మను "చచ్చిందిరోయ్" అని  కనిపెట్టి, ఆనందంగా..._ 

_♦ఆ శవాన్నే పణంగా పెట్టి అడుక్కోవటానికి కూడా వెనకాడక పోవటం, చాలా హృద్యంగా చిత్రీకరించారు._

_♦ *"ముసలమ్మ ముందు రెండు కొబ్బరిముక్కలు పడ్డాయి. వాటిని కొరకబోయింది గాని మింగుడు పడలేదు"* అన్న వాక్యం మనస్సును ద్రవింపచేస్తుంది._
~~~~~~~~~~~~~~~
*--(ఇక ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం)--*
*_కథ: ముక్కోటి కైలాసం_*
=================

*వైకుంఠ ఏకాదశినాడు!ఉత్తరద్వారం దగ్గర స్వామి దర్శనం కోసం ఇంకా తెల్లవారకముందే జనం గుంపులు గుంపులుగా చేరారు. కొందరు పట్టుబట్టలు కట్టుకున్నారు, మరికొందరు తడి బట్టల్లోనే వచ్చారు. అపుడే కృష్ణలో స్నానం చేసి నీళ్ళోడుతున్న తలల్తో కొబ్బరికాయలు, హారతి కర్పూరం చేతబట్టి ఉత్తర ద్వారదర్శనం కోసం జనం తొక్కిసలాడుతున్నారు.*

*_'శంభోశంకర సాంబసదాశివ'_ భజనలు _'హరహర మహాదేవ'_ స్మరణలు...* 

*ఉత్తర ద్వారం తలుపులు మూసి ఉన్నాయి, జనం క్రిక్కిరిసి పోతున్నారు.*

*“ఏవిటయ్యా ఆ తోసుకోవడం?”*

*"మేం పదావడనుంచి వచ్చామయ్యా!"*

*"మేం తెల్లవారు జామునుంచీ కాచుకున్నామయ్యా!”*

*"అవతల ఆడంగులు! కళ్ళు కన్పించటంలా?"*

*“ఓ యబ్బ! మాకూ ఉన్నార్లేవయ్యా ఆడంగులు"*

*ఓ... హోశ్!*
*ఆ.... హోశ్!*

*"హర హర మహాదేవ్!"*

*"ఇంకా తెరవరేవయ్యా తలుపులు?"*

*జనం పెరిగిపోతున్నారు. కాళ్ళు తొక్కుకుంటున్నారు, డొక్కల్లో పొడుచు కుంటున్నారు. ఎత్తయిన ఉత్తరద్వారం తలుపులు మూసే ఉన్నాయి.*

*క్షణ క్షణానికి పెరిగిపోతున్న జనం మధ్యన ఓ ముసల్ది. ఆ ముసలమ్మకి లోపలికి పోవాలని తాపత్రయం. ఆ ముసలమ్మ స్నానం చేసినట్టు లేదు. దాన్ని చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. ఆవిడ ఎంత ముందుకు పోవాలను కుంటుందో అంత వెనక్కు తోసేస్తున్నారు జనం.*

*"తలుపులు తియ్యండో" జనం కేక.*

*"కాస్త ఆగండో...!" లోపల్నించి అర్చకుల కేక.*

*"కరణంగా రొచ్చారా?" లోపల్నించి అర్చకులు.*

*"ఆఁ!"*

*"మున్సబుగారొచ్చారా?"*

*"ఆఁ!"*

*“పెద్దొరగారి గుమాస్తాగారొచ్చారా?"*

*"ఆఁ!"*

*“పెద్దశెట్టిగారొచ్చారా?"*

*"ఆఁ!"*

*"తలుపులు తీయొచ్చునా?"*

*"ఆఁ!"*

*ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకున్నాయి.*

*"ఓం నమః పార్వతీ పతయే నమః……..!”*

*కొబ్బరికాయలు పెఠేలు పెఠేల్మని పగిలాయి. కర్పూర హారతులు వెలిగాయి. జేగంటలు, శంఖాలు కలిసి మోగాయి. జనం తొక్కుకుంటూ, తోసుకుంటూ విరగబడ్తున్నారు. ముసలమ్మని ఇంకా ఇంకా వెనక్కి తోశారు.*

*స్వామి విగ్రహాలు వూరేగింపుగా ముక్కోటి మంటపంవైపు బయలుదేరాయి. మళ్ళీ తొక్కిసలాట, కోలాహలం, ముసలమ్మను నుంచో నివ్వరు, కూర్చోనివ్వరు. తోసేస్తున్నారు. విగ్రహాలు బయలుదేరటంతో జనంకూడా స్వామి వెంట బయలుదేరారు. గుడికీ.. ముక్కోటి మంటపానికీ మధ్య బారులు తీరిన బిచ్చగాళ్ళు. ఆ రద్దీలో, ఆ తోపిడిలో బిచ్చగాళ్ళ పక్కనొచ్చి పడ్డది ముసలమ్మ, విగ్రహాల ఊరేగింపు బిచ్చగాళ్ళ మధ్యనుంచీ వెళ్ళిపోయింది.*

*"ఈ ముసలిముండ యాడనుంచొచ్చిందీ!” పక్కనున్న బిచ్చగాళ్ళు అసహ్యించుకున్నారు. ముసలమ్మ లేవలేక చతికిలపడిపోయింది. మాట రావటంలేదు.*

*బారులు తీరిన రకరకాల బిచ్చగాళ్ళు కన్పిస్తున్నారు. కళ్లులేనివారు, కాళ్ళు పోయినవారు, పంగనామాలు పెట్టుకున్నవాళ్లు, విభూతి తీర్చినవాళ్ళు, రాముడి పేరుతో కృష్ణుడి పేరుతో కొబ్బరిముక్కలు అడుక్కుంటున్నారు. మధ్య మధ్య "ఈడ చచ్చావేం! ఆడకెళ్ళి అడుక్కో మేం రాత్రినించి ఇక్కడ కూకున్నాం” అని ముసలమ్మని తిడుతున్నారు.*

*చింపిరి జుట్టు ముసలమ్మ, బోసినోటి ముసలమ్మ, లోతుకళ్ళ ముసలమ్మ మాట్లాడదు! పడిన చోటునుంచి కదల్లేదు.*

*అమ్మా! ధర్మం! అయ్యా ! ధర్మం! కబోదిని తల్లీ!*

*"అనాధజన్మ తండ్రీ!" రకరకాలుగా ఏడుస్తూ అడుక్కుంటున్నారు బిచ్చగాళ్ళు. చింపిరి జుట్టు ముసలమ్మ ఏమీ అడగదు.*

*గుడికి ముక్కోటి మంటపానికి భక్తుల రద్దీ పెరిగిన కొద్దీ బిచ్చగాళ్ళ కేకలు పెరిగాయి. కొత్త బిచ్చగాళ్ళని రానివ్వటంలేదు. అమ్మలక్కలు తిడుతూ వాళ్ళ హక్కులు కాపాడుకొంటున్నారు.*

*_ముసలమ్మ ముందు రెండు కొబ్బరిముక్కలు పడ్డాయి. వాటిని కొరకబోయింది. గాని మింగుడు పడలేదు._*

*తంబురా వాయించే గుడ్డోడికి బాగా డబ్బులు పడుతున్నయ్యని కాళ్ళులేని అవిటివాడు తన బండిని కొంచెం ముందుకు జరిపితే, కుష్టు బిచ్చగాడు అమ్మా నాయనా బూతులు తిట్టి యధాస్థానానికి పంపించేశాడు.*

*రాత్రి జాగరణ. జనం ఎక్కువయ్యారు. ముక్కోటి మంటపంలో శివ సంకీర్తన జరుగుతోంది.*

*వాళ్ళతోపాటు గొంతులెత్తి ఏడుస్తూ బిచ్చగాళ్ళు అడుక్కుంటున్నారు. ముసలమ్మ ఉలకదు, పలకదు. ఓ రాత్రివేళ ముసలమ్మ పక్కకి వొరిగి పడుకుంది.*

*తెలతెలవారుతుండగా స్వామి విగ్రహాలు ఊరేగింపుగా తిరిగి దేవాలయంలోకి వెళ్లాయి. పడుకున్న ముసలమ్మ లేవనేలేదు. బిచ్చగాళ్ళంతా పైసలు లెక్క పెట్టుకుని, కొబ్బరి ముక్కలు మూటగట్టుకుని లేవబోతూ... "లెయ్యే ముసలి ముండా!" అన్నారు.*

*స్నానం చేయని ముసలమ్మ, దేవుణ్ణి చూడని ముసలమ్మ, 'సాంబశివా' అనని ముసలమ్మ ముక్కోటినాడు చచ్చిపోయింది.*

*"ముసల్ది చచ్చిందిరోయ్!" సంబరంగా అన్నారు బిచ్చగాళ్ళంతా;*

*ముక్కోటి మర్నాడు ముసల్దాన్ని పాతేయడానికి ఆ శవాన్ని చూపించి బిచ్చ గాళ్ళంతా పోటీలేకుండా ఐకమత్యంగా మళ్ళీ అడుక్కున్నారు.!!!!😲*
-------((🙏))------ 
*_{ఎలా ఉంది కథ...?? అయ్యో..ఇంకా అక్కడే ఉన్నారా? ఇలా ఉంటాయి మరి "అమరావతి కథలు" ఈ కథలు చదువుతున్నప్పుడు ఆసన్నివేశాలన్నీ మన కళ్ళముందే జరుగుతున్నట్లే ఉంటుంది. మనకు తెలియకుండానే మనమూ అందులో నిశ్శబ్దంగా లీనమైపోతాం.. : ధన్యవాదములతో... --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*

No comments:

Post a Comment