Friday, August 8, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁📿🍁 📿🍁📿 🍁📿🍁
                 *ఆత్మసంతృప్తి*

*భూలోకంలో ఒక మహారాజు జనరంజకంగా పాలించాడు. పుణ్యకార్యాలు చేశాడు. మరణానంతరం తాను స్వర్గానికే వెళ్తానని, అక్కడ బంగారు కొండపై తన పేరు శాశ్వతంగా చెక్కి ఉంటుందని నమ్మాడు. చనిపోయి స్వర్గానికి వెళ్లాడు. తన పేరు చూసుకోవాలన్న ఆత్రుతతో ఆ కొండ దగ్గరకు వడివడిగా వెళ్లాడు. దానిపై తన పేరు లేదు. విచారంగా ఉన్న అతణ్ని చూసి అక్కడి భటుడు నవ్వుతూ 'ఏదో ఒక పేరు చెరిపి నీది రాసుకో' అన్నాడు. మహారాజు ఆశ్చర్యపోయాడు. 'ఆ పని చేస్తే తరవాత వచ్చిన వాడు నా పేరు కూడా చెరిపేస్తాడు. అంటే నా పేరు కొన్నాళ్లకు భూలోకంలో వినిపించదు. స్వర్గంలో కూడా కనిపించదు. ఇన్నాళ్లూ మంచి పనులు చేసి ఫలి తమేంటి...' అనుకున్నాడు.*

*మంచి పనులు చేస్తే స్వర్గం, చెడు పనులు చేస్తే నరకం లభిస్తుందని పార మార్థిక* *చింతన ఉన్నవాళ్లు నమ్ముతారు. ఆ నమ్మకం మంచి పనులు చేయడానికి ప్రేరణ ఇస్తుందని భావించారు పూర్వీకులు. చీకట్లో ఆడుకుంటున్న పిల్లల్ని ఆట మానెయ్యమంటే ఒక పట్టాన వినరు. అందుకని 'చీకట్లో దయ్యాలు తిరుగుతాయి. ఆట ఆపి రండి' అనే వారు. దయ్యాలు అనగానే భయపడి ఎవరింటికి వారు వెళ్లిపోతారు. దయ్యాలు లేవని తెలుసు. చీకట్లో పురుగూ పుట్రా, ముళ్లూ రాళ్లూ ఉండొచ్చు. పిల్లలు వాటికి భయపడరు. అందుకని దయ్యం పేరు చెప్పేవారు. దీన్ని అర్ధవాదం అంటారు. ఎలా చెప్పారని కాకుండా ఏ ఉద్దేశంతో, ఏ అర్థంతో చెప్పారో గ్రహించడమే అర్ధవాదం పురాణాల్లోని ప్రతి కథ వెనుక అర్థవాద దృక్పథం ఉంది.*

*మనస్తత్వాలను బట్టి మనుషులు రెండు రకాల స్వభావాలకు చెందుతారు. ఏం జరిగినా మన మంచికే అనుకునేవాళ్లు. ఏం జరిగినా మన సంచిలోకే వేసుకుందాం అనుకునేవాళ్లు. బయట ఎలా ప్రవర్తించినా లోపల మనుషులు వేరు. గౌరవ మర్యాదల కోసం మంచివారిగా ముద్ర వేయించుకోడానికి చూస్తారు. నిజంగా స్వభావమే మంచి అయితే ఫరవాలేదు. కానీ సహజ స్వభావాన్ని దాచుకుని, కనిపించని తప్పులు చేస్తూ బయటికి మంచివాళ్లుగా నటిస్తూ, ఆత్మవంచన చేసుకోవడం ప్రమాదకరం.*

*మన ఆయుష్షు స్వల్పం. పైగా అనిశ్చితం. ఈ కొద్దికాలంలో ఎదుటి వారికి ఉపయోగపడే పనులు చేయాలి. ఆ పనులు ఆత్మ సంతృప్తినివ్వాలి తప్ప గుర్తింపు కోసం ఆరాటపడకూడదు. వృత్తి, ప్రవృత్తుల రీత్యా నువ్వు ఎవరైనా కావచ్చు. కానీ సమాజానికి ఏం చేశావనేది ముఖ్యం. చేసిన మంచి పనులు పదిమందికి తెలవొచ్చు కానీ కేవలం పదిమందికీ చెప్పుకోడానికే ఏదీ చేయకూడదు.*

*మరణానంతర జీవితం, బంగారు కొండపై పేరుండటం... కేవలం నమ్మకం. ఇక్కడ ఉన్నంత కాలం గొప్పగా బతకడం మాత్రమే మన చేతుల్లో, చేతల్లో ఉంటుంది. ఈ క్షణమే మనది అనుకుని తృప్తిగా ప్రయోజనకరంగా బతకడమే మన పేరుకు సార్థకత.*
🍁📿🍁 📿🍁📿 🍁📿🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

No comments:

Post a Comment