Friday, August 8, 2025

 . *11వ సర్గ కైకేయి వరం కోరుకోవడం*
*꧁❀❀━❀🏵️🌏🏵️❀━❀❀꧂*

*కామోద్రేకంతో ఉన్న దశరథుణ్ణి చూసి కైకేయి, ఇకపై ఆలస్యం చేయరాదనుకుంది. తన మనస్సులో మాట బయటపెట్టే సమయం వచ్చిందని అనుకొంది. అయినా భర్త నుండి మరొకసారి ప్రతిజ్ఞ తీసుకొనిగాని తన కోరిక బయటపెట్టరాదని అనుకుంది.* 

*కైకేయి: మహారాజా! నన్ను ఎవరూ అవమానపరచలేదు. నాకో కోరిక కలిగింది. ఆ కోరికను మీరు నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తేనే, నా కోరిక ఏమిటో చెప్పగలను. లేకుంటే వృథాయే గదా!*

*దశరథుడు: (నవ్వుతూ ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ) ప్రియురాలా! నాకీ ప్రపంచంలో నువ్వు, రాముడు తప్ప మరెవ్వరూ అంతటి ప్రియమైన వారు కారని నీకు తెలియదా? నా పంచప్రాణాలు రాముడే అని నీకు తెలుసుగదా! అట్టి రాముడి మీద ఒట్టుపెట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నీకు ఏం కావాలో చెప్పు. రాముణ్ణి చూడకుండా బ్రతుకలేను. అటువంటి రాముడి మీద ఒట్టుపెట్టి చెబుతున్నాను.* *నేనింతవరకు సంపాదించిన పుణ్యం మీద ఒట్టుపెట్టి చెబుతున్నాను. నీ కోరిక చెల్లిస్తాను. నన్ను నమ్ము.* 

*కైకేయి: మహారాజా! నా కోరిక చెల్లిస్తానని మీరు సంపాదించిన పుణ్యం మీద, రాముడి మీద ఒట్టుపెట్టుకున్నారు. మీరు చెసిన ఆ వాగ్గానాన్ని అగ్నిదేవుడు, ముక్కోటి దేవతలు విన్నారు. సూర్యచంద్రులు, ఆకాశం, గ్రహాలు, రాత్రి, పగలు, దిక్కులు సర్వజగత్తు విన్నారు. గంధర్వులు, రాక్షసులు, సర్వభూతాలు మీ మాటలు విన్నారు.*

*రాజా! మీరు సత్యవ్రతులు, పరమ ధార్మికులు. మీరు నాకు రెండు వరాలు ఇచ్చారు. అందుకు పైన చెప్పిన ముక్కోటి దేవతలంతా సాక్షులు. ఆ వరాలు రెండూ ధర్మానుసారంగా మీరు నాకు ఇవ్వాలి. అట్లా ఇవ్వలేనని తప్పించుకోవటానికి ప్రయత్నిస్తే నేను ప్రాణత్యాగంచెయ్యటానికి సిద్ధపడి ఉన్నాను.*

*దశరథుడు: ఓ కైకేయీ! నేను ధర్మబద్దుడనై ఉంటాను.*

*కైకేయి: ఓ రాజా! వెనుక దేవాసురయుద్దం జరిగినప్పుడు మీరు ఇంద్రుని పక్షాన పోరాడారు. ఆ యుద్ధంలో మాయావి అయిన శంబరాసురుడు అందరినీ సంహరించుకుంటూ వచ్చాడు. అప్పుడు మీరు స్పృహతప్పి ఉన్నారు. ఇంకొద్ది క్షణాల్లో వాడు మిమ్మల్ని సంహరించేవాడే కానీ నేను రథసారథ్యం వహించి మిమ్మల్ని అక్కడనుండి తప్పించి ప్రాణాపాయం నుండి కాపాడాను. మిమ్మల్ని కాపాడిన కొద్దిసేపటికే మరల ఇంకో ఉపద్రవం ముంచుకొచ్చింది. అప్పుడుకూడా మళ్ళీ ప్రాణాలు పోయేస్థితిలో మిమ్మల్ని సురక్షితమైన ప్రాంతానికి చేర్చి సేవలుచేసి మీ ప్రాణాలు కాపాడాను. మీ ప్రాణాలు రెండుసార్లు కాపాడాను కాబట్టి నన్ను రెండు వరాలు కోరుకోమన్నారు.*

*నాథా! మీరు భూమినంతా ఏలుతున్న మహారాజులు, పైగా నాకు భర్త. సత్యసంధులు, ధర్మపరాయణులు. కాబట్టి ఆ వరాలు రెండూ మీ వద్దనే దాచుకున్నాను. వాటి అవసరం వచ్చినప్పుడు కోరుకుంటాను, అప్పటి వరకూ మీ వద్దనే దాచి ఉంచండి అని కోరాను. మీరు కూడా అంగీకరించారు. ఆ రెండు వరాలు ఇప్పుడు కోరుకుంటున్నాను. అదే నా కోరిక. మీరా వరాలు ఇవ్వటానికి నిరాకరించినట్లెతే, నాకు అంతకన్నా పెద్ద అవమానం మరొకటి ఉండదు. ఆ అవమానభారంతో జీవించడం కన్నా, మరణమే నాకు శరణ్యం అవుతుంది.*

*దశరథుడు: దేవీ! నీకు నే నిచ్చిన వరాలు జ్ఞాపకమున్నాయి. నువ్వు కోరే ఆ వరాలు రెండూ నేను చెల్లిస్తాను. అవి ఏమిటో చెప్పు?*

*కైకేయి: నాథా! ప్రశాంతంగా వినండి. రాముడి రాజ్యపట్టాభిషేకం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు గదా! ఆ యౌవరాజ్య పట్టాభిషేకాన్ని రాముడికి బదులుగా భరతుడికి చేయండి. ఇదే నేను కోరే మొదటి కోరిక. ఇక రెండవ వరం. రాముడు పట్టుపీతాంబరాలన్నీవదలి, నారబట్టలు ధరించి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. ఇదే నా రెండవ కోరిక.*

*ప్రభూ! ఇంక ఏమాత్రమూ ఆలస్యం కాకుండా రాముడు ఈ క్షణాన్నే అడవులకు వెళ్ళిపోవాలి. మీరు సత్యవ్రతులు అయితే, ధర్మాన్ని పరిరక్షించేవారయితే ఈ రెండు వరాలను ఇప్పుడే అమలు చేయండి. మీ వంశగౌరవాన్ని నిలబెట్టుకోండి. సదాచారాన్ని పాటించేవారికే ఇహమూ, పరమూ దక్కుతాయని, జన్మసార్థకమవుతుందని తపోధనులు వచిసారు.* 

*┈┉┅━❀꧁జై శ్రీరామ్꧂❀━┅┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🦚🏹🦚 🙏🕉️🙏 🦚🏹🦚

No comments:

Post a Comment