Wednesday, August 6, 2025

 🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

*క్షమాగుణం :* 
*శాంతికి, ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం* 

🌻🌻🌻🌻🌻🌻🌻🌻

క్షమాగుణం భగవంతుడు మనిషికి ప్రసాదించిన అత్యున్నత గుణం. ఇది కేవలం మతపరమైన అంశం మాత్రమే కాదు, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక కోణాల నుంచి చూడదగిన గొప్ప శక్తి. క్షమ అంటే ఇతరులు మనకు చేసిన అన్యాయాలను, బాధలను మనసులో పెట్టుకోకుండా మన్నించడం. ఇది మన హృదయ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది.

*క్షమాగుణ విశిష్టత*

 *ధార్మిక కోణం :* భగవద్గీతలో శ్రీకృష్ణుడు క్షమాగుణాన్ని దైవీగుణంగా పేర్కొన్నాడు. రాముడు తన శత్రువైన రావణుడు మరణించిన తర్వాత కూడా అతనికి అంతిమ సంస్కారాలు చేయాలని ఆదేశించడం క్షమాగుణానికి గొప్ప ఉదాహరణ. జీవించి ఉన్నప్పుడు ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా, ప్రాణం పోయిన తర్వాత ఆ వైరాలు ముగిసిపోతాయనే సందేశాన్ని రాముడు ఇచ్చాడు.

 *ఆధ్యాత్మిక కోణం :* బుద్ధుడు క్షమాగుణాన్ని అహింసకు మార్గంగా చూపాడు. జైనులు ఏటా 'క్షమాపణ పర్వం' జరుపుకుంటూ తమ వల్ల ఎవరికైనా కలిగిన బాధలకు క్షమాపణలు కోరతారు. యజుర్వేదం ప్రకారం, క్షమ, తపస్సుల ద్వారా భగవంతుణ్ణి సులభంగా పొందవచ్చు. శివపురాణం 'క్షమయే పరమధర్మం' అని బోధించింది.

 *మానసిక ప్రయోజనాలు :*

క్షమాగుణం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ద్వేషం మనసులో నిప్పులాంటిది. మన్నించడం ద్వారా మనసు తేలికపడి ఒత్తిడి, ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. ఇది నిద్రను మెరుగుపరిచి, శారీరక ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.
క్షమాగుణాన్ని అలవరచుకోవడం
మహాత్మా గాంధీ 'క్షమ బలహీనత కాదు, బలమైన లక్షణం' అని చెప్పారు. క్షమాగుణం ఒక్కసారిగా అలవడేది కాదు. ప్రవచనాలు వినడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ధ్యానం వంటి సాధనల ద్వారా దీన్ని పెంపొందించుకోవాలి. తప్పు చేసినవారిని శిక్షించడం కంటే, వారిని మన్నించి ప్రేమించడం ద్వారా వారి మనసు మార్చవచ్చని స్వామి వివేకానంద చెప్పారు. క్షమాగుణం ఉన్న భక్తులు భగవంతుడికి ప్రీతిపాత్రులవుతారని శివపురాణం వివరించింది.
క్షమ అనేది సమాజాన్ని శాంతి దిశగా నడిపిస్తుంది. ఇది మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.

🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment