కథ పేరు : *బంగారు* *పంజరం*
రచన : కోడూరి తిరుమల మాధవి.
( స్వీయ రచన 30-7- 25)
మహతి ఆడిటోరియం ప్రాంగణం చాలా కోలాహలంగా వుంది.
పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహం గా వున్నారు కారణం ఈరోజు పిల్లలకు జూనియర్ క్యాడర్ లో పెద్దలకు సీనియర్ క్యాడర్ లో అన్నమాచార్య కీర్తనల మరియు ఇతర వాగ్గేయకారుల కీర్తనల పోటీలు జరుగుతున్నాయి.
ఈ పోటీలలో నా దగ్గర సంగీతం నేర్చుకుంటున్న పిల్లలు పాల్గొంటున్నారు.
సీనియర్ కేటగిరీలో నేను కూడా పాడుతున్నాను.
ఒక్కొక్క స్టూడెంట్ వారి తల్లి తండ్రులు వచ్చి నాకు నమస్కరించి నా ఆశీస్సులు తీసుకుంటూ వుంటే గురువుగా ఎంతో గర్వంగా సంతోషంగా మనసు ఉప్పొంగి పోతోంది.
అలా ఆనందంతో నిండిన నా ఆలోచనలు గతంలోకి పరుగు తీశాయి.
మాది తిరుపతి దగ్గరలోని చిన్న గ్రామం. మా నాన్నగారు మాకు వున్న అయిదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసేవారు.
నాకు ఒక అన్నయ్య, ఒక అక్క, నేను మూడవ దాన్ని.
వున్నదంట్లో అమ్మ నాన్న మమ్మల్ని ప్రేమగా చూసుకుంటూ వుంటే ఏ చీకూ చింతా లేకుండా మా జీవితాలు గడిచిపోయాయి.
నాకు చిన్నప్పటి నుండీ సంగీతం అంటే చాలా చాలా ఇష్టం రేడియోలో వచ్చే ఏ పాటనైనా ఇష్టంగా విని పాడేదాన్ని నా ఇంట్రెస్ట్ చూసిన నాన్న నన్ను మా ఊరిలో సంగీతం నేర్పించే లలిత టీచర్ దగ్గర చేర్పించారు.
లలిత టీచర్ ఏ రోజు చెప్పిన పాఠం రోజే శ్రద్ధగా నేర్చుకుని పక్కరోజు పాడేసేదాన్ని. సంగీతంలో నాకు వున్న శ్రద్ధ చూసి లలిత టీచర్ చాలా ముచ్చట పడేది. అలా రెండు మూడు సంవత్సరాల్లోనే గీతాలు దాటి వర్ణాలకు వచ్చాను.
నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు హఠాత్తుగా నాన్నకు చాలా జబ్బు చేసింది.
ఎంత మంది డాక్టర్స్ కి చూపించినా లాభం లేకుండా పోయింది.
వ్యవసాయం కుంటుపడింది.
నాన్నకు వైద్యం చేయించడానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవడంతో పొలాలు అమ్మవలసి వచ్చింది.
కుటుంబం ఆర్థికంగా బాగా దెబ్బ తినింది. ఎంత ప్రయత్నించినా నాన్నను కాపాడుకోలేక పోయాము.
అన్నయ్య ఇంకా పై చదువులు చదవాలి అనుకున్నా వీలు కాక, డిగ్రీ తరవాత ఉద్యోగంలో చేరాడు.
అక్క కూడా చిన్న పాటి ఉద్యోగం చేసి అన్నయ్యకు అండగా వుండేది.
తరవాత మా బంధువులలోనే మంచి సంబంధం చూసి, మిగిలిన కాస్త పొలాన్ని అమ్మి అక్కకు పెళ్ళి చేశారు.
అలా అలా రోజులు గడిచిపోతున్నాయి. నా చదువు డ్రిగ్రీ చివరి సంవత్సరం లోకి వచ్చింది.
నాన్న పోవడం ఇంటి ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో నా సంగీతం వర్ణాల వరకు వచ్చి ఆగిపోయింది.
ఆరోజు డిగ్రీలో నా ఆఖరి పరీక్ష వ్రాసి ఇంటికి వచ్చాను, ఇంటి బయట రెండు కార్లు ఆగి వుండడం చూసి ఆశ్చర్య పోయాను,
"మా ఇంటికి కార్లలో వచ్చేవాళ్ళు ఎవరబ్బా" అని, అలా ఆలోచిస్తూ ఇంట్లోకి అడుగు పెట్టాను.
హాల్ లో ఐదారు మంది కూర్చుని వున్నారు. వారి ఎదురుగా మా అమ్మ, అన్నయ్య నిలుచుని వున్నారు వారి మొహాలు సంతోషంతో వెలిగిపోతూ వున్నాయి.
నేను లోపలికి వెళ్ళగానే "తనే మా చిన్నమ్మాయి శారద అంటూ నన్ను పరిచయం చేశారు.
నేను నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయాను.
కొంత సమయం తరవాత వాళ్ళు వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిన వెంటనే మా అమ్మ, అన్నయ్య నా దగ్గరికి వచ్చారు.
అమ్మ నన్ను గట్టిగా హత్తుకుని "నా కూతురు ఎంత అదృష్టవంతురాలో ఏ జన్మలో ఏ పూజ చేసుకుందో మహారాణిలా వుండబోతుంది "అనగానే అన్నయ్య కూడా" అవునమ్మా ఇది నిజంగా మనం ఊహించని అదృష్టం అంటుంటే నాకు ఏమీ అర్థం కాక అయోమయంగా చూసాను.
"ఇంకా నీకు అర్ధం కాలేదా! ఈ మధ్య మనం మన బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్ళాం కదా. అక్కడికి ఇప్పుడు మన ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చారట. అక్కడ వాళ్ళ అబ్బాయి నిన్ను చూశాడట నువ్వు తనకి చాలా చాలా నచ్చావుట, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని పట్టు పట్టుకుని కూర్చున్నాడట.
అందుకే మనతో మాట్లాడటానికి వచ్చారు వాళ్ళు ఎవరో తెలుసా కోట్ల కొద్దీ ఆస్తులు వున్న జమీందారులు ఒక్కడే అబ్బాయి, ఫారిన్ లో చదువుకుని వచ్చాడు. ఇంతకంటే అదృష్టం వేరే వుంటుందా ?
ముందు మేము కూడా భయపడ్డాము, మన స్తోమత ఏమిటి ? వాళ్ళ స్థోమత ఏమిటి ? అని కానీ వాళ్ళు ఈ పెళ్ళికి సంతోషంగా ఒప్పుకుంటున్నాము, మా అబ్బాయి సంతోషమే మా సంతోషం అన్నారు, పైగా వాళ్ళు మన నుండి ఏమీ ఎదురు చూడడం లేదని చెప్పారు.
వచ్చేవారం అబ్బాయి కూడా వస్తాడట ఆరోజే తాంబూలాలు మార్చుకుందాం అని చెప్పారు అనగానే
నేను "అది కాదు అమ్మా....! అని ఏదో చెప్పబోయేంతలో
ఇంక నువ్వు ఏమీ చెప్పవద్దు అని అమ్మ, అన్నయ్య అక్కడి నుండి వెళ్ళిపోయారు .
అనుకున్నట్టుగానే వారం గడిచిపోయింది,
అబ్బాయి వాళ్ళు రావడం నన్ను చూడడం , తంబూలాలు మార్చుకోవడం అన్నీ జరిగిపోయాయి.
మాటల మధ్యలో నాకు తెలిసింది ఏమిటంటే అబ్బాయికి సంగీతం, పాటలు ఇవి ఏవీ అస్సలు ఇష్టం లేదని, అది తెలియగానే నా గుండె ఆగినంత పని అయింది.
అదే విషయం అమ్మతో అన్నాను "అమ్మా నీకు తెలుసు కదా నాకు సంగీతం అంటే ప్రాణం అని ఎలా గోలా మళ్ళీ ఆగిపోయిన నా సంగీతాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నాను, మరి ఆ అబ్బాయికేమో సంగీతమంటేనే ఇష్టం లేదని అంటున్నారు నాకు ఈ పెళ్ళి వద్దు" అనగానే.
మా అమ్మ కంగారుగా "నోరు ముయ్యి". పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు సంగీతంకోసం కాళ్ళ దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటావా ?
అదంతా పెళ్ళి అయ్యాక చూసుకోవచ్చులే అని "ఏం పిల్లో ఏమిటో" అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది.
నాకు ఎప్పుడూ ఆడంబరాలమీద ఆశ లేదు. నాకు చిన్నప్పటి నుండీ వున్నది ఒక్కటే కోరిక. ప్రశాంతమైన చిన్న ఇల్లు, నన్ను అర్ధం చేసుకుని ప్రేమగా చూసుకునే భర్త, చక్కని పిల్లలు ఇంట్లో ఎల్లవేళలా స్వరార్చన జరుగుతూ, సంగీత సాధన చేస్తూ, ఒక గురువుగా పిల్లలకు సంగీతం నేర్పించాలి అనేది నా కోరిక, కానీ ఇప్పుడు చూస్తే నా ఆశలు అన్నీ అడియాశలు అయ్యేలా వున్నాయి.
నేను ఏం చెప్పినా ఎవరూ వినే పరిస్థితిలో లేరు. నా ప్రమేయం ఏమీ లేకుండానే నా పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. పెళ్ళికి వచ్చిన మా బంధువులు అందరూ నా అదృష్టానికి పొగుడుతూ వుంటే మా అమ్మా, అన్నయ్యా, అక్కల సంతోషానికి అవధులు లేవు.
నేను మా అత్తారింటిలో అడుగుపెట్టాను. పెద్ద బంగాళా, రెండు మూడు కార్లు, పని మనుషులు, ఖరీదైన చీరలు, నగలు వేటికీ కొరత లేదు.
మా వారితో సహా అందరూ నన్ను బాగానే చూసుకుంటున్నారు.
నాకు ఆ ఇంట్లో పెద్దగా పని కూడా లేదు. ఆ ఇంటికి తగ్గ కోడలిగా వాళ్ళు చెప్పినట్టు ఆ ఇంటి గౌరవానికి ఏ మాత్రం భంగం కలుగకుండా వుండడమే నా పని.
గంగిరెద్దులాగా అలంకరించుకోవడం, వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవడం, వాళ్ళు ఏదన్నా తల ఆడించడం ఇవే నా పనులు.
బంగారు పంజరంలో వున్న చిలకలా వుంది నా పరిస్థితి.
ఒకటి రెండుసార్లు మెల్లగా మా వారి దగ్గర " నాకు సంగీతం అంటే ఇష్టం అని, కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆపేశాను అని, మళ్ళీ నేర్చుకుంటాను అని అడిగాను" దానికి వారు ఏదో వినకూడని మాట విన్నట్టు మొహం పెట్టి నాకు ఈ సంగీతాలు, నాట్యాలు అస్సలు ఇష్టం వుండవు అని పెళ్ళికి ముందే చెప్పాను కదా! అయినా ఈ ఇంటి కోడలు అలాంటివి చేస్తే మన పరువేం కావాలి అన్నారు.
సరే పోనీ ఏదైనా ఉద్యోగం అయినా చేస్తానండీ అన్నాను.
ఏదో వినకూడని మాట విన్నట్టు అన్నన్నా...కూడదు అన్నారు.
కాలక్రమంలో పిల్లలు పుట్టారు వాళ్ళని పెంచడంలో కూడా నా ప్రమేయం ఏమీ లేదు, ఆ ఇంటి పద్ధతులకు తగ్గట్టుగానే పెరిగారు, ఆ ఇంట్లో నేను ఒక జడపదార్థం లా తయారయ్యాను, నా మనసు మెదడు రెండూ స్తబ్దుగా తయారయ్యాయి.
పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, అమ్మాయికి మా కంటే ఒక మెట్టు పైన వున్న ఆస్తి పరులను చూసి పెళ్ళి చేశారు.
అబ్బాయి సంగతి సరే సరి తండ్రి హోదాకు తగ్గట్టుగా చదివి తండ్రి వ్యాపారాలు చూసుకుంటున్నాడు.
జీవితం అంటే ఇంతేనా అనిపించేది, విసుగు పుట్టేది. అందరినీ వదిలేసి అన్ని బంధాలు తెంచుకుని ఎక్కడికైనా పారిపోవాలి అనిపించేది.
కాలం గడిచిపోతోంది.
హఠాత్తుగా మా ఆయన గుండె పోటుతో మరణించారు. ఇంటి నిండా చుట్టాలు, స్నేహితులు, పిల్లలు అందరూ అందరూ ఏడుస్తున్నారు, నా దురదృష్టానికి బాధ పడుతున్నారు. నన్ను ఓదారుస్తున్నారు.
కానీ నాలో ఎందుకో ఏ చలనం లేదు. ఏడుపు రావడం లేదు అందరూ నేను భర్త పోయిన షాక్ లో వున్నాను అనుకున్నారు.
నాకు కూడా నేను ఎందుకు అలా వున్నానో అర్ధం కాలేదు. బహుశా ఇన్ని ఏండ్లుగా స్తబ్దుగా వున్న నాకు ఏదో ఒక బలమైన బంధం నుండి బయట పడిన అనుభూతి కలుగుతోంది,ఇది నాకే విచిత్రంగా వుంది.
ఆయన పోయి ఆరు నెలలు కావస్తోంది, ఒక రోజు మా అబ్బాయిని పిలిచి పల్లెలో మా వారి పూర్వీకులు కట్టిన పాత ఇంటికి వెళతాను. ఇంక మీదట అక్కడే వుంటాను అని నా నిర్ణయాన్ని చెప్పాను.
నా నిర్ణయాన్ని విని మొదట ఆశ్చర్య పోయి "అదేంటి అమ్మా అలాంటిది ఏమీ వద్దు" అన్నాడు. కానీ, ఈసారి నేను ఎవరి మాట వినదలుచుకోలేదు, మొండి పట్టు పట్టాను, "చూడు ఇన్ని రోజులు మీరు చెప్పినట్టు విన్నాను, మీకు తగ్గట్టుగా బ్రతికాను కనీసం ఇప్పుడైనా నాకు నచ్చినట్టు నన్ను బ్రతకనివ్వండి" అన్నాను
నా మొండితనం చూసి ఏమనుకున్నాడో ఏమో! అయిష్టంగానే సరే అన్నాడు.
నేను నా బట్టలు సర్దుకుని కారులో పల్లెలో వున్న పాత ఇంటికి బయలు దేరాను.
రెండు గంటల ప్రయాణం తరవాత మా కారు ఊరిలోని మా పాత ఇంటి ముందు ఆగింది.
నేను కారులోనుండి కిందకు దిగాను, చుట్టూ ఖాళీ స్థలం అందులో కొబ్బరి, జామ, బొప్పాయి ఇంకా రకరకాల పూల చెట్లు మధ్యలో పాత తరానికి ప్రతీకగా వున్న ప్రశాంతమైన పెంకుటిల్లు.
నేను ఇంట్లోకి అడుగు పెట్టాను. వాకిట్లో విశాలమైన అరుగులు.
పెద్ద హాలు, పక్కన రెండు పెద్ద విశ్రాంతి గదులు, భోజనాల గది, వంట ఇల్లు.
ఎంతో చక్కగా ప్రశాంతంగా వుంది.
ఇన్నాళ్ళకి నా కల నిజమైంది అనిపించింది.
పనివాళ్ళు వుండడం వల్ల ఇల్లంతా శుభ్రంగా వుంది, నేను పెట్టెలో నుండి త్యాగరాజస్వామి, రాముల వారి పటాలు తీసి హాలు మధ్యలో తగిలించాను. చెట్టులోని పూలు కోసి పటాలకు అలంకరించాను.
ఇప్పటినుండైనా సంగీత సాధనలో నా బ్రతుకు గడిచేలా చూడమని మనసారా వేసుకున్నాను. నాకు ఎందుకో మళ్ళీ కొత్త జన్మ ఎత్తినట్టు అనిపించింది.
వర్ణాల దగ్గర ఆగిపోయిన నా సంగీత సాధన మళ్ళీ మొదలు పెట్టాను.
రోజూ గంటల తరబడి సాధన చేశాను.
సంగీతం నేర్పిస్తాను అని చుట్టుపక్కల వారికి చెప్పడం తో మొదట ఇద్దరు ముగ్గురు పిల్లలతో మొదలైన నా సంగీత శిక్షణ రాను రాను పెరిగి ఈ నాటికి పాతిక మంది పిల్లలు నా దగ్గర సంగీతం నేర్చుకుని ఇలా ఈరోజు నా శిష్యులతో సంగీత పోటీలకు వచ్చే స్థాయికి ఎదిగింది.
ఇలా గత కాలపు జ్ఞాపకాలలో చిక్కుకుని వున్న నాకు "టీచర్ వేదిక మీద మీ పేరే పిలుస్తున్నారు" అన్న నా శిష్యురాలి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను.
వడి... వడిగా వేదికవైపు కదిలాను.
వేదిక పై కూర్చుని మనసులో భగవంతునికి కోటి నమస్కారాలు అర్పించి,
"నిధి చాలా సుఖమా! రాముని సన్నిధి సేవ సుఖమా! అంటూ కీర్తన ఆలపించాను.
కీర్తన ముగియగానే అందరి కరతాళ ధ్వనులు నా చెవులకు తాకుతుంటే ఇంత కంటే ఈ జన్మకు ఇంకేం కావాలి! నా జన్మ ధన్యం అయింది అనిపించింది.
శుభం 💐
No comments:
Post a Comment