Sunday, August 10, 2025

 ఇది కథకాదు…!

 *హెడ్డింగ్ ఏం పెట్టాలో తెలీలేదు!*
 ================             
*ప్రభుత్వ పాఠశాలలలో కొంతమంది విద్యార్థులు అడిగే ప్రశ్నలు గొప్ప గొప్ప శాస్త్ర వేత్తలని తలపిస్తాయి.*

*అలా ఒక ఉపాధ్యాయుడి Service లొ ఏదురైన సంఘటనల సమూహరమే ఈ కథ*
------------------------
*సతీష్ గాడిప్రశ్న.....??????* 

_ఈ కథ చదివే ముందు ఈ వార్త చదవండి..._
------------------------_
*చంద్రునిపై కాలుమోపడం నిజమే..! ధృవీకరించిన చంద్రయాన్ ఫోటోలు అపోలో మిషన్ పై అనుమానాలకు నాసా సమాధానం (వాషింగ్టన్ న్యూస్)*

_చదివారు కదా... మీరు నమ్మారా...? నేను నమ్మాను. అయిదో తరగతిలో ఈ వార్త చదివి విన్పిస్తే... పిల్లలంతా ఆశ్చర్యంగా నమ్మారు._

*ఒక్క.. సతీష్ గాడు తప్ప...!*

_వాడు నమ్మలేదనడానికి... వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది. నమ్మిన మిగతా పిల్లలందర్నీ వాడు జాలిగా చూశాడు. కొంచెం సేపు వాడి చూపులు నన్ను కలవర పెట్టాయి._

*వాడు వేసే ప్రశ్న కోసం కుతూహలం పెరిగినా... సరైన సమాధానం నా దగ్గర ఉందా..? అనే అనుమానం పెరిగింది.*
_(వాడి ప్రశ్న ఏమిటో... దానికి సమాధానం ఎలా చెప్పాలో.. అనేది చివర్లో చూద్దాం.. చదవడం కొనసాగించండి. 🙏) _

*నాలుగ్గోడల మధ్య... తరగతి గదిలో వీళ్లు వేసే ప్రశ్నలు ఒక్కోసారి షాకింగ్ న్యూస్ లా తగులుతాయ్....*

*జీవితకాలం వెంటాడుతాయి.*

*ఆ ప్రశ్నలు... సమాజాన్ని... అవసరమైతే ప్రపంచాన్ని కుదిపేసి సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటాయి.*

*ఇరవై ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో ఎన్ని బదిలీలైనా.... ఏ ఊరికెళ్లినా... ఆ ప్రశ్నలు మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంటాయి. ప్రశ్న వేసిన ఆ పిల్లల మొహాలు మర్చిపోలేనంతగా వేటాడుతాయి. పదేళ్లకింద చర్లపల్లె స్కూల్లో అలాంటి ప్రశ్నే ఎదురైంది...*

*నాకు ప్రశ్న వేసిన నాలుగో తరగతి చదివే రమేష్ గాడి మొహం ఇప్పటికీ మనసులోంచి చెక్కు చెదరలేదు.*

*చాలా సందర్భాల్లో వాడే గుర్తొస్తాడు.*

*_ముఖ్యంగా తాటిచెట్లను చూసినప్పుడల్లా...🌴_*

*అప్పట్లో నాలుగో తరగతి తెలుగు వాచకంలో 'కల్పవృక్షం' అనే పాఠం ఉండేది. ‘తాటిచెట్టు కల్పవృక్షం లాంటిది. తాటికమ్మలు (తాటాకులు) గుడిసె వేసుకోవడానికి... తాటి ముంజలు తినడానికి... తాటి దోనెలు నీరు పారించుకోవడానికి... ఇలా తాటిచెట్టులోని ప్రతీది మనిషికి పనికొస్తుంది. ఇలా అడిగిందల్లా ఇస్తుంది కాబట్టి తాటిచెట్టును కల్పవృక్షంతో పోల్చారు..!’ అంటూ పాఠాన్ని వివరించినప్పుడు... పిల్లలంతా ఉత్సాహంగా విన్నారు.*

*నిజంగా... తాటిచెట్టులో పారేయతగింది ఏదీ లేదన్నంత నమ్మకంగా పాఠం చెప్పాను. పాఠం చెబుతున్నంత సేపూ... రమేష్ గాడి మొహం చిన్నబోయింది. వాడి కళ్ళల్లో తడి... నేను అబద్దం చెప్తున్నట్టు వాడి ముఖంలో కోపంకూడా..!*

*నాకేమీ అర్ధం కాలేదు... “రమేష్... ఏమైందిరా...?” అనడిగాను.*

*సమాధానం చెప్పకుండా చేతులు కట్టుకొని లేచి నిలబడ్డాడు. పిల్లలంతా వాడివైపే చూస్తున్నారు.*

*“ఏమైందిరా...?” మళ్లీ అడిగాను.*

*మరో రెండు నిమిషాలు గడిచాయి. వాడి మొహం ఎర్రగా అయింది.* 

*“ఏమైందో చెప్పు...” అన్నాను కొంచెం సీరియస్ గా.*

*_“మా అయ్య రోజూ తాటికల్లు తాగొచ్చి అమ్మనూ, నన్నూ, తమ్మున్ని బాగా కొడతాడు.. తాటిచెట్టు మంచిదెట్లయితది సార్..?”_*
❓❓❓❓❓❓❓❓
*వాడి ప్రశ్నకి... షాక్ తిన్నాను. నన్నే కాదు... విద్యావ్యవస్థనే ప్రశ్నించినట్లుంది వాడి ప్రశ్న. నిజానికి తాటిచెట్టు పాఠంలో 'కల్లు' ప్రస్తావన ఎక్కడా రాయలేదు. తాటిచెట్టు కల్పవృక్షంతో పోల్చదగిందేనా...!*

*వాడికి నేను సమాధానం ఎలా చెప్పాలి.*

*ఏం చెప్పాలి...???*

*మా సార్ కి అన్నీ తెలుసనే నమ్మకం పిల్లలకుంటుంది.*

*ఏదో చెప్పాలి... కానీ ఏం చెప్పాలి...? అయిదు నిమిషాల వరకు తేరుకోలేదు. చివరకు “తాటికల్లు మంచిదేరా...! కాకపోతే ఓ కప్పుగాని, అరకప్పు గానీ తాగితే మంచిది... కానీ మీ నాన్న కుండల కొద్దీ తాగుతాడు కాబట్టి అలా ప్రవర్తిస్తున్నాడు...” అంటూ ఇంకొంచెం విపులంగా చెప్పాను.* 

*అయినా నా సమాధానం వాణ్ణి సంతృప్తి పర్చలేదు. అంతకు మించి చెప్పడానికి నాక్కూడా ఏం తోచలేదు.*

*వాడు అయిష్టంగానే కూచున్నాడు.*

*ప్రభుత్వాలు మారితే... పాఠ్యపుస్తకాలు కూడా మారుతాయి. కాబట్టి... ఆ పాఠ్యాంశం ఇప్పుడు లేదు...* 

*అయినా ఇప్పటికీ నాకు తాటిచెట్లని చూసినప్పుడల్లా రమేష్ గాడు గుర్తొస్తాడు. దీనమైన వాడి మొహం గుర్తొస్తుంది.*

*వాళ్ళ నాన్న ఇంకా తాగుతున్నాడా...? వాళ్లమ్మనీ, వాణ్నీ , తమ్ముణ్నీ ఇంకా కొడుతూనే ఉన్నాడా...????* 
❓❓❓❓❓❓❓

*వాడి ప్రశ్న ఇప్పటికీ ఇలా వెంటాడుతూనే ఉంటుంది.*
~~~~~~~~
*పాఠాలెప్పుడూ పిల్లల పక్షాన ఉండాలని కోరుకుంటాను. పల్లెటూర్లలోని సర్కారు బడుల పిల్లలు స్వేచ్చగా ఉంటారు కాబట్టి... వాళ్ల భావప్రకటనల్లోనూ నిజాయితీ ఉంటుంది. టీచర్ గా అధికారం చెలాయిస్తే మాత్రం వాళ్లు ఏ ప్రశ్ననీ అడగలేరు. అప్పుడు వాళ్ల భావప్రకటన నాలుగ్గోడల మధ్య సమాధి కావాల్సిందే...! టీచర్ అడుగుపెట్టగానే భయంతో నిండిన వాతావరణం తరగతి గదిలో నెలకొనిందంటే... ఆ నలభై నిమిషాలు ఎంత బాగా పాఠం చెప్పినా వృధానే...!!! 😲* 

*ఇందుకు మంచి ఉదాహరణ మా సుజాత టీచర్.*

*తను ఓరోజు మూడో తరగతిలో బాతు బంగారు గుడ్డు పాఠం చెప్పింది. ఒక బాతు రోజూ బంగారు గుడ్లు పెడుతుంటే... ఆత్యాశతో దాన్ని కోసి... యజమాని భంగపడ్డాడని అనే పాఠ్యాంశాన్ని చెప్పింది.*

*తీరా ఒక పిల్లాడు వేసిన ప్రశ్నకి ఆమెకు చిర్రెత్తుకొచ్చి వాడి వీపు బద్దలు చేసింది. ఇంతకీ వాడు అడిగింది ఏమిటంటే....*

*_“బాతుని కోస్తే తప్పేంటి టీచర్... బాతు కడుపులో గుడ్డు తయారవుతుంది కానీ... బంగారం తయారు కాదు గదా... అందుకే బాతుని కోసి చూసాడేమో టీచర్... యజమాని తప్పేముందీ? కాదంటారా?”_ అనడిగాడు.*

*'అత్యాశ' మంచిదికాదు అని చెప్పడానికి ఇలాంటి అబద్దపు పాఠాలు రచించడం సబబు కాదేమో అన్పిస్తుంది. వాన్ని కొట్టాక మిగితా పిల్లలెవరూ ప్రశ్నలు వేయలేదు.*

*ఈ మధ్య మా స్కూళ్ళలో 'నిజాయితీ పెట్టె' లు పెట్టాలని విద్యాశాఖ సూచించింది. ఏ పిల్లవాడికైనా ఏదైనా దొరికితే దాంట్లో వేయాలి. టీచర్ దాన్ని తీసి అది పోగొట్టుకున్న పిల్లలకి అందజేస్తాడు. ఇది పిల్లల్లో నిజాయితీని పెంచుతుంది. పిల్లలు కూడా ఏవి దొరికినా ఉత్సాహంగా దాంట్లో వేస్తున్నారు. మొన్నీమధ్య 'తిరుపతిగాడు నా పెన్ను దొంగతనం చేసాడు సార్' అంటూ రాధిక అనే అమ్మాయి నాకు కంప్లయింట్ చేసింది.*

*“అవును... వాడు పెన్ను దొంగతనం చేసాడు సార్..” అంటూ పిల్లలందరూ చెప్పారు.*

*తిరుపతి గాడిని పిలిచి అడిగితే... మౌనంగా ఉండిపోయాడు. వాడి బ్యాగ్ తీసి పుస్తకాలు బయట పడేసి వెతికినా దొరకలేదు. చివరికి గట్టిగా అడిగితే... నేనే తీసాను అని ఒప్పుకున్నాడు. “ఎక్కడ దాచావురా?” అని అడిగితే... నిజాయితీ పెట్టిని చూపించాడు. నాకు ఆశ్చర్యమేసింది. పెట్టెని తెరచి చూస్తే... రాధిక పెన్ను అందులో ఉంది.*

*“దాంట్లో ఎందుకు వేసావురా?” అనడిగాను.*

*“రోజూ అందరికీ ఏవేవో దొరుకుతున్నాయి. పెట్టెలో వేస్తున్నారు. నాకేం దొరకట్లేదు... అందుకే పెన్ను తీసి అందులో వేసాను” అని చెప్పాడు.*

*నాకు బుర్ర తిరిగిపోయింది.*😲

*పిల్లలందరిలోను ఒకటే ప్రశ్న...???* 

*తిరుపతి దొంగనా... నిజాయితీ పరుడా...?*

*దొంగతనం చేసాడు కాబట్టి... దొంగే కదా సార్... అన్నారు కొందరు. పెట్టెలో వేసాడు కాబట్టి నిజాయితీ పరుడే కదాసార్... అని మరికొందరు పిల్లలు వాదించారు.*

*Class అంతా ఒకటే అల్లరి... వాడిని దోషిగా నిలబెట్టడానికి ఒకటి రెండు అబద్దాలు చెప్పారు. చివరికి వాడు నిజాయితీ పరుడే అని వాళ్లని సమాధానపర్చడానికి ఒక పీరియడ్ అయిపోయింది.*

*ఇలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలకి సమాధానం దొరక్క చాలా మంది టీచర్లు సహనం కోల్పోతారు. ముఖ్యంగా తరగతి గదిలో దొంగతనం, కులం ఈ రెండు ఉద్రిక్తతని సృష్టిస్తాయి. అలాగే కులం ప్రస్తావన వచ్చినప్పుడల్లా నాకు వేదవతి అనే పాప గుర్తిస్తుంది.* 

*శ్రీరాములపల్లె స్కూల్లో పని చేసేటప్పుడు... మధ్యాహ్న భోజనం సమయంలో ప్రతి మంగళవారం ఉడకబెట్టిన కోడిగుడ్డు పెట్టేవాళ్లం. మూడో తరగతి చదివే వేదవతి అనే పాప మాత్రం తన ప్లేటులో వేసిన గుడ్డుని టీచర్లు చూడకుండా వేరే పిల్లలకి ఇచ్చేది. ఓసారి అది గమనించిన నేను హెడ్ మాస్టర్ కి చెప్పాను. ఆయన పాపని పిలిచి గుడ్డు తింటే గుండెకు బలం వస్తుందని బుజ్జగించి మరీ మరీ చెప్పటంతో చాలా ఇష్టంగా కోడిగుడ్డు తింది. ఆ తర్వాత వేదవతి నాల్రోజుల వరకూ పాఠశాలకు రాలేదు. అనుమానంతో నేనూ, హెచ్.ఎం. కల్సి వాళ్లింటికి వెళ్లాం. మమ్మల్ని చూడగానే వాళ్లమ్మ దాడి చేసినంత వేగంగా కయ్యానికి దిగింది.*

*“మేం బ్రాహ్మలం... మా పాపచేత కోడిగుడ్డు తినిపిస్తారా...? మీ స్కూల్ కి నా బిడ్డని చస్తే పంపించం.” అంటూ గొడవ పడింది.*

*గుడ్డు తిన్న పాపానికి వేదవతిని బాగా కొట్టినట్టుంది. జ్వరంతో పడుకుంది. మమ్మల్ని చూడగానే భయంగా.... నీరసంగా లేచి నిల్చుంది. కోడిగుడ్డు శాకాహారమే అంటూ మహాత్మగాంధీ చెప్పిన మాటలు కూడా ఆమె దగ్గర ఏం పని చెయ్యలేదు. చివరికి పాప చదువు పాడైపోతుందని, కోడి గుడ్డు తనకి పెట్టించమని మేం హామీ ఇచ్చాక గానీ బడికి పంపడానికి ఒప్పుకోలేదు.*

*వేదవతి జ్వరంతోనే మర్నాడు స్కూల్ కొచ్చింది.*

*పిల్లల్లో గుసగుసలు... అందరి మధ్యా కోడిగుడ్డు ప్రస్తావనే... వేదవతి మెల్లిగా తలొంచుకొని నాదగ్గరికొచ్చింది.*

*“హోం వర్కు చేసావా?” అనడిగాను.*

*మాట్లాడలేదు... నిమిషం సేపు నిశ్శబ్దంగా నా కళ్లలోకి సూటిగా చూస్తూ... _“మేమెందుకు కోడిగుడ్డు తినకూడదు సార్?”_ అనడిగింది.*
❓❓❓❓❓❓

*ఎవరో గుండెమీద సర్రున చరిచినట్లయింది నాకు..! ఆ ప్రశ్నకు ఏ సమాధానం లేదు నా దగ్గర... ఆ చిన్ని గుండె ఎంత చిన్నబోతే... ఎంత గాయపడితే... అలా అడుగుతుంది.*

*ఇంట్లో స్వేచ్చని చంపే ఆచారాలు బడిలో కూడా ఎంతగా ప్రభావం చూపిస్తాయో వేదవతి ప్రశ్న నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది. “దానికి బదులు నీకు అరటిపండు తెప్పిస్తాను సరేనా” అని భుజం తట్టి పంపించాను.*

*పిల్లల ప్రశ్నలకు మనసంతా నమ్మకం నిండేలా జవాబు చెప్పకపోతే ఏదో వెలితిగా ఉంటుంది నాకు.*  

*వాళ్ల అనుమానంలోంచి పుట్టే ప్రశ్నకి రాగద్వేషాలుండవు. సినారేకి జ్ఞానపీఠం అవార్డు వచ్చాక చాలామంది పండిత పామరులు రకరకాల ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేశారు.* 

*ఓసారి స్కూల్ పిల్లలు కూడా ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు.. మేధావులెవరూ అడగని ప్రశ్న ఒక పాప అడిగింది.*

*"మీ పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి కదా. మరి మీ పేరు ముందు 'ఎస్' రావాలిగాని సి' ఎలా వస్తుంది?" అని.*

*ఆయన ఆశ్చర్యపోయారట... ఇప్పటివరకూ ఎవరూ అడగని ప్రశ్న... “పదో తరగతి మార్కుల మెమోలో 'ఎస్'కి బదులు 'సి' అనీ పడిందమ్మా అప్పట్నించి సి. నారాయణరెడ్డి అనే పిలుస్తున్నారు' అని నవ్వేసారట.*

*పిల్లలు ఏలాంటి పదాన్నైనా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడంలో సిద్ధహస్తులు. మాన్కూలు పిల్లలు 'ఇంటర్వెల్ ' బెల్ మోగగానే...చిటికెన వేలు చూపిస్తూ... 'సార్...ఒంటెర్వెల్' అంటారు. ఇలాంటిదే ఒక సీరియస్ విషయం చెపుతాను… తన అనుభవంలోకి వచ్చిన ఈ విషయాన్ని ఒక సీనియర్ టీచర్ చెప్పారు.*

*ఆయనేదో విషయాన్ని రాసుకుంటూ... బాగా అల్లరి చేస్తున్న ఒక పిల్లవాన్ని దగ్గరగా పిలిచి…    ’ఏదేశమేగినా... ఎందుకాలిడినా పాట చదువరా' అన్నాడు. వాడొకసారి చదివాడు. సార్ పని చేసుకుంటూనే... మళ్ళీ చదవరా' అన్నాడు. ఇలా ఐదారుసార్లు చదివినా సార్ పట్టించుకోవట్లేదు.*

*చివరికి వాడు ఆ పాటని కసిగా ఇలా చదివాడట...*

*“ఏదేశమేగినా...ఎందుకాలిడినా... పొగడరా నీ.... తల్లి భూమి భారతిని'...* 
_(నీ తల్లి అనే పదాన్ని వాడు తిట్టులా చదివాడట)._

*తరగతి గది లోపల పుట్టే ప్రశ్నలో నిజాయితీ ఉంటుంది. సమాధానం కూడా అంతే నిజాయితీగా లేనప్పుడు రానురాను వాళ్లు ప్రశ్నలు వేయటం మానుకుంటారు. ప్రశ్నించే స్వేచ్చని పాఠశాలల్లో బాగా విస్తరిస్తే ప్రతి పాఠ్యాంశం గురించి మేమంతా హోంవర్క్ చేసుకోవాల్సిందే... కాని మమ్మల్ని తరగతి గదిలోంచి సర్వేలని, జనాభా లెక్కలని, ఎలక్షన్ డ్యూటీలని ప్రభుత్వమే తరిమికొడుతుంటుంది.*

*ఎక్కడో రెండు మండలాల్లో జడ్.పి.టి.సి. ఎన్నికలున్నాయని జిల్లా మొత్తం దసరా సెలవులకి ముందుండే త్రైమాసిక పరీక్షలు వాయిదా వేసారు. సెలవుల తర్వాత పరీక్షలు పెడితే ఎంత నిరాసక్తంగా వస్తారో మాకు తెలుసు. వాళ్ల ఇష్టాఇష్టాలని గుర్తించేంతగా ఎవరున్నారు ?*

*ఓసారి పాఠం చెప్పాలన్పించక... రోటీన్‌కి భిన్నంగా “మీకు ‘నచ్చని’ బొమ్మ ఏదైనా గీసి చూపించండి' అంటూ డైలీ పేపర్ లో తలదూర్చాను.*

*అరగంట తర్వాత... రకరకాల బొమ్మలు చూపించారు.*

*కుక్క, పంది, బడి... ఇలా రకరకాలుగా... ఒకడు మనిషి బొమ్మ గీసి కింద చిరంజీవి అని రాసాడు.*

*“అదేంట్రా... నీకు చిరంజీవి అంటే ఇష్టం లేదా” అనడిగాను నవ్వుతూ.... “లేద్సార్... నాకు బాలకృష్ణ అంటేనే ఇష్టం” అన్నాడు నవ్వుతూ. రెండో తరగతి అనూష మాత్రం నాలుగు గీతలతో ఓ డబ్బా గీసుకొచ్చింది.*

*“ఏంటే... ఈ బొమ్మ” అనడిగాను.*

*పాప కళ్లల్లో సన్నటి నీటి పొర.*

*“డబ్బా బొమ్మ” అంది.*

*_“అదే... ఏం డబ్బా?...”_ అనడిగాను. మిగతా పిల్లలు కూడా ఆసక్తిగా చూస్తూ.... "చాక్లెట్ల డబ్బా..." అని నవ్వారు కొందరు.*

*నిమిషం తర్వాత... నెమ్మదిగా అంది.*

*“మా బాపు మస్కట్లో చచ్చిపోతే... గీ డబ్బాల్నే తీసుకొచ్చిండ్రు” గీ తరగతి గది ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. 'పాపని దగ్గర తీసుకున్నాను. కాసేపయ్యాక నవ్వింది.*

*అప్పుడప్పుడు... ఉపాధ్యాయుడి స్పర్శ... తల్లిదండ్రుల స్పర్శకన్న ఎక్కువ ధైర్యాన్నిస్తుందేమో...!* 

*ఎక్కడ శవపేటిక కన్పించినా... అనూష కళ్లలోని తడి గుర్తొస్తుంది.*

*చిటికేస్తే చైతన్యం ప్రవహించాల్సిన చోట... నిస్సారమైన తరగతి గది కూడా.... అనూష గీసిన ఆ డబ్బాలాంటిదేనేమో... సమాధానం చచ్చిన చోట ప్రశ్నలెక్కడ ఉద్భవిస్తాయి? ఇంతకీ సతీష్ గాడి అనుమానంలోంచి ఏం ప్రశ్న పుట్టుకొస్తుందోనని... నాకూ కలిగాయి.*

*ఒకవైపు ఆసక్తి... సమాధానం నా దగ్గరుందా... లేదా... అన్న భయం ఒకేసారి పుట్టుకొచ్చాయి.*

*సతీష్ గాడు నన్నూ... ఆ పేపర్ లోని అమెరికా వాళ్లు దిగిన చంద్రమండలం బొమ్మని మార్చి మార్చి చూశాడు. మీరు నమ్ముతున్నారా సార్...?” అన్నంత ఎగతాళిగా చూశాడు. క్లాసంతా నిశ్శబ్దం...*

*“నీ డౌట్ ఏంట్రా...? అమెరికా వాళ్లు ఖచ్చితంగా చంద్రమండలానికి వెళ్లి వచ్చారు. అదే ఈ వార్త” అన్నాను.* 

*మీరందరూ నమ్ముతున్నారా...? అన్నట్టు క్లాసంతా కలియజూశాడు. “నేను నమ్మట్లేదు సార్...” అన్నాడు ధృడంగా... “ఎందుకురా... నువ్వేమైనా చూసొచ్చావా” అన్నాను కోపంగా.* 

*ప్రపంచమంతా ఒప్పుకుంటుంటే... వీడేంటి అన్న అసహనం పుట్టుకొచ్చింది. “మీరు నమ్ముతున్నారా సార్?” అనడిగాడు.* 

*“అవున్రా...” అన్నాను.* 

*“నాకు నమ్మకం లేద్సార్” మళ్లీ అంతే ధృఢంగా చెప్పాడు.* 

*“అదే... ఎందుకు???” కొంచెం కోపంగా అన్నాను.* 

*క్లాసంతా ఆసక్తిగా వాణ్ణే చూస్తోంది. కాసేపాగి, “చంద్రమండలం మీద గాలి లేదన్నారు కదా సార్... మరి అమెరికా వాళ్ల జెండా ఎలా రెపరెపలాడుతుంది?” అన్నాడు.* 

*_ఖంగుతిన్నాను... ఆ రాకెట్టు నామీదే కూలిపడ్డట్టయింది...!!!_* 
😲😲😲😲😲😲😲

*వాడి ప్రశ్న వందలాది వేట కొడవళ్ళుగా మారి... అమెరికా వైపు దూసుకెళ్తున్నట్టు... అగ్రరాజ్యాన్ని నిలదీస్తున్నట్టు...!*

*అవేవో టవర్స్ ని విమానాలు ఢీకొడ్తున్నట్టు... కలవర పెట్టింది. వాడి మొహంలో చిద్విలాసం... ఒబామా మొహంలోకి చూస్తున్న ఒసామా లాగా... నన్ను చూస్తున్నాడు.*

*నిజమే ... ఇప్పుడు నాకూ నమ్మకం కలగట్లేదు.. మరి మీకో...!?!?!?*
-----------------------
*_{రాసింది ఎవరోగానీ...!  హృదయవేదనతో వ్రాసిందని అర్థమవుతోంది…: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*

No comments:

Post a Comment