Sunday, August 10, 2025

 "నడుమును పిరుదులు దాటుచు 
మెడ వెనుకనె జారిజారి మెలికలు తిరుగున్‌
పడగెత్తు నాగు రీతిని 
జడవంపుల తరచి తరచి జగతిని చూడన్‌"


జడ ఒక శిగ అలంకరణ. వెంట్రుకలను పరామర్శించడానికి చిక్కు పడకుండా కాపాడడానికి అనవసరమైన ప్రదేశాలలో రాలకుండా ఉండడానికి అందం కొరకు జడగా అల్లబడుతుంది. ఎక్కడో కొందరు పురుషులు వెంట్రుకలను అల్లుకున్నా. ఇది ఎక్కువగా స్త్రీల అలంకారమే. పురాతన యూరేపియన్లలలో ఈ అలంకరణ చోటు చేసుకున్నా ఇప్పుడు వారిలో ఈ అలంకరణ కనుమరుగైంది. ప్రత్యేక ప్రదర్శనలకు ఇది పరిమితమైంది. దక్షిణ ఆసియా దేశాలలలో జడకు ప్రాముఖ్యత అధికమే కాని ఆధునిక చైనా, జపాను, సింగపూరు, మలేషియా వాసులలో కూడా ఈ అలంకరణ కనుమరుగై ప్రదర్శనలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పటికీ భారతీయ జన బాహుళ్యంలో భారతీయ స్త్రీల సాధారణ జీవితంలో ఈ అలంకరణ కొనసాగుతుంది. దక్షిణ ఆఫ్రికన్ కొండ జాతులలో స్త్రీ పురుష భేదం లేకుండా వివిధ ప్రత్యేక రూపాలలో జడ అలంకరణ ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది.

జడ, జెడ లేదా జట, తల వెంట్రుకలను ఒక పద్ధతిలో అమర్చుకొనే పద్ధతి. కొంతమంది స్త్రీలు ఒకటే జడ వేసుకుంటే ముఖ్యంగా పిల్లలు రెండు జడలు వేసుకుంటారు. యోగుల శిరోజాలు జడలు కట్టి ఉంటుంది. అందువలన వీరిని జడధారి అంటారు.

జడకు ప్రత్యేకంగా చేసుకొనే అలంకరణలలో ముఖ్యమైనవి ఆభరణాలు. వీటిలో జడపాళీ (నాగరం), జడగంటలు, చామంతిపువ్వు, పాపిటబిళ్ళ, చెంపసరాలు ముఖ్యమైనవి. వీటిలో జడ మొత్తం అంతా పైనుండి క్రిందవరకు అందంగా చేస్తుంది. వీనికి కెంపులు, పచ్చలు, వజ్రాలు పొదిగేవారు. తల వెనుకభాగంలో జడ పైభాగంలో చామంతిపువ్వు, తమలపాకులూ సూర్యచంద్రుల్లా అమరితే, పాపిటబిళ్ళ ముందు నుండి వెనుక వరకు పాపిటంతా కప్పుతుంది. ముందున, మధ్యలో కూడా చిన్న బిళ్ళలుంటాయి. జడ చివరలో 1-3 గంటల వంటి జడగంటలు తప్పనిసరిగా జోడీగా ఉండాల్సిందే మరి.

రెండు జడలు వేసుకుంటే ఇంకా పెండ్లి కాలేదని, ఆ అమ్మాయి లో జీవ ఈశ్వర సంబంధం విడివిడి గా వుందని అర్దం. 

పెండ్లి అయిన ఆడ పిల్లలు మొత్తం జుట్టుని ఒకటి గా కలిపి ఒకే జడ గా వేసుకుంటారు. తన జివేశ్వరుని చేరి దాంపత్యం చేస్తున్నదని భావం

జుట్టును కొప్పులా పెట్టుకుంటే సంతానం కూడ వుండి బాధ్యతలు మోస్తూ వున్నట్లు అర్థం 

జుట్టు ని మూడు పాయలు గా విడదీసి త్రివేణి సంగమం లా అల్లుతారు. తాను, తన భర్త, సంతానం అని ఈ మూడు పాయలకు అర్థం. 

జుట్టు విరబోసుకొని వుండటం మాత్రం జ్యేష్ఠాదేవికి ఆహ్వానం. అరిష్టం.

జడ పదార్ఢం కాదు జడ - మరి జడ వెనుక ఎంత అంతరార్ధం ఉందో తెలుసా .. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు 'జడ' గురించి విపులంగా ఇలా చెప్పారు.

"స్త్రిల జడలలో మూడూ పాయలు ఉంటాయి. వీటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం : 

జడలోని మూడు పాయలు ఇడా, పింగళ మరియు సుషుమ్న అనే మూడు నాడులకు సంకేతాలు. వెన్నెముకు సమాంతరముగా చివర వరకూ సాగే ఈ జడ మూలాధారము నుండి సహస్రారమునకు చేరుకొనే కుండలినీ సంకేతము. 

జడ పై భాగము తలపై విప్పారిన పాము పడగవలే సహస్రార పద్మమునకు సాంకేతికము. మూడు పాయల ముడుల వలె ఇడా,పింగళ నాడులు పెనవేసుకు ఉంటాయి. అంతర్లీనముగా ఉన్న మూడవ పాయ సుషుమ్న నాడికి సంకేతము. 

ఇంత ఆధ్యాత్మిక రహస్యాన్ని మన సంస్కృతి స్త్రీల జడలలో దాచింది. ఈ విధముగా స్త్రీలు కొన్ని స్త్రీలకు మాత్రమే కలుగు వ్యాధులనుండి వారి స్వయం రక్షణకు మార్గములు పొందు పరిచారు. 
నాగరీకత పేరుతో ఇపుడు శిరోజములు అల్లుకొనకుండా, పెరిగినవి కత్తెర వేసి పొట్టిగా చేసుకొనుట జరుగుతున్నది. 

ఎంత దురదృష్టకరం. 

***
కొన్ని సామెతలు :

జుట్టు అంటూ ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు. 

వెంట్రుకలున్నమ్మ ఏ కొప్పైనా వేయ గలదు.

అప్పు చేసి కొప్పు తీర్చిందట.

అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతాత కొప్పు.

జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే. 

***
అలివేణి - తుమ్మెదవలె నల్లని రంగుగల జడ గలది. 

కొప్పుకు జత పరిచేది సగురం అంటారు తెలంగాణ లో. 
***

కొప్పుల వెలమ లేదా కొప్పు వెలమ అనేది  ఆంధ్రప్రదేశ్‌లో కనిపించే ఒక తెలుగు కులం.  
బహుశా వారి పురుషులు జుట్టు కత్తిరించుకోకుండా, వారి తలలపై ముడి రూపంలో కట్టుకునే ఆచారం నుండి ఉద్భవించి ఉండవచ్చు. 
ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనిపిస్తారు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తక్కువ జనాభా ఉన్నారు.  వెనుకబడిన తరగతులు (OBCలు) కింద వర్గీకరించిబడ్డారు.
కృష్ణా జిల్లా నూజివీడు లో చాలా మంది వున్నారు. 

***
తెలుగువారి జానపద కళారూపాలు/కోలాట నృత్యాలు:

పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో అనేక జానపద కళా రూపాలను వర్ణిస్తూ కోలాటాన్ని కోలాట గొడియ అని వర్ణించాడు. ఇతర నృత్య విశేషాలను వర్ణించినంతగా కోలాట గొడియను గురించి అంత గా వివరించనందువల్ల సోమనాథుని కాలానికి కోలాటం అంతగా అభివృద్ధి పొందలేదని వూహించవచ్చు. ​కాని విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ కోలాటాలు ప్రసిద్ధంగా ప్రదర్శించినట్లు విదేశీ యాత్రికుడైన అబ్దుల్ రజాక్ వర్ణించిన విషయం తెలిసిందే.

ఈ నాటికీ విజయనగర శిథిల శిల్పాల గోడల మీదా, శ్రీశైలం దేవాలయ ప్రాకారపు గోడలపైనా కోలాటం వేసే నర్తకీ మణులు కోలాటపు శిల్పాలు చిత్రించబడివున్నాయి.

జడకోపు కోలాటం బాలికలు వేయడం ఎంతో ఆనందంగా వుంటుంది. బాలికల్లో ఒకే ఎత్తు కలిగిన వారిని కోలాటానికి ఎంచు కుంటారు. అందరూ వాలు జడలు వేసి రంగు రంగుల పూలు ధరిస్తారు. ఒకే రంగుగల లంగాలు, చొక్కాలు తొడుగుతారు. రంగు రంగుల కోలాటపు చిరుతలు ధరించి వలయాకారంగా తిరుగుతూ వుంటే ఇంద్ర లోకంలో దేవతలు నృత్యం చేస్తున్నారా అనిపిస్తుంది.

గరుడాచల యక్షగానాన్ని చెంచులక్ష్మి - నరసింహ స్వామి సంతానాన్ని పోలిన పాట తెలంగాణా కోలాటంలో భార్యా భర్తల మధ్య జరిగే సంఘర్షణను సంవాద రూపంలో చిత్రిస్తారు.

భార్య భర్తల సంవాదం - కోలాట కీర్తన
భర్త: గట్టూకు బోయి నేను - కట్టే దెమ్మంటే
కొప్పౌకున్నా పూలు - ఎక్కడవే భామ - నీ
కొప్పునున్న పూలు - ఎక్కడివే భామ
అత్తేరి పూలు ఎక్కడివే భామ
ధూత్తేరి పూలు ఎక్కడివె భామ

భార్య: గాలి ధూళి వచ్చి - గంపంత్గ మబ్ బొచ్చి
కొమ్మ వూగి కొప్పు - నిండింది మొగుడా
నాతోడు రంకాడలేదు - అమ్మతోడు రంకాడలేదు

భర్త: అన్నీ సరే కాని - ఇన్ని సరే కాని
చెంపనున్న కాట్లో ఎక్కడివె భామ?
అత్తేరి కాట్లు ఎక్కడివె భామ.
ధూత్తేరి ఎక్కడివే భామ
భార్య: కోమటోరింటికి - కొబ్బెరికి బోతేను
తక్కెట్లో గుండొచ్చి - తగిలింది మొగడా

తక్కెట్లో గుండొచ్చి - తగిలింది మొగడా,
నాతోడు రంకాడలేదు - అమ్మతోడు రంకాడలేదు.

***

పైడిపాటి లక్ష్మణకవి పద్యాలు:

క. విడిముడి గల వేలుపుచెలి
జడముడిజంగంబు గడదెసం గాపరి యౌ
యెడయండు పాఁపతొడవుల
నిడియెడివే ల్పనఁగ నొప్పు నీశానుఁ డిలన్

(విడిముడిగల వేలుపుచెలి = రొక్కముగల వేల్పునకు (కుబేరునకు) మిత్రుడు, జడముడిజంగంబు= జడలను దాల్చిన బిచ్చగాడు, కడదేశగాపరియౌ యడయండు= కడపటి దిక్కగు ఈశాన్య దిక్కునేలెడు ప్రభువు, పాప తొడవుల నిడియెడివేలుపు= నాగభూషణు డగు దేవుడు - ఈ 4 ను ఈశానుని పేర్లు). 

ఆ. నడవిమనికిపట్టు జడదారి యన వన
వాసి యొప్పునిల్లువాసి తిరుగు
బోడ తపసి కావి పుట్టగోఁచులసామి
యన యతీంద్రుఁ డలరు (నలికనేత్ర)             

(కోమట్లు, మూఁడవకొలమువారు, బేరులు - ఈమూడును వైశ్యునికి పేర్లు. కాఁవాండ్రు, నాలవవాండ్రు, బలిజెవాండ్రు - ఈ మూడును శూద్రునికి పేర్లు, వడుగు, గోఁబాపఁడు - ఈ రెండును బ్రహ్మచారికి పేర్లు, ఆలుబిడ్దలుగల యతండు = పెండ్లాము పిల్లలు గలవాడు, ఇలుఱేఁడు= ఇంటియజమానుడు, గేస్తు - ఈ మూడును గృహస్థుని పేర్లు. అడవిమనికిపట్టు = అరణ్యమునందు ఉండువాడు, జడదారి = జడలను ధరించినవాడు, - ఈ రెండును వానప్రస్థునికి పేర్లు, ఇల్లువాసి తిరుగు = ఇంటిని విడిచిపెట్టి తిరుగువాడు, బోడ, తపసి, కావిపుట్టగోచులసామి = కావిరంగుగల పుట్తగోచులను బెట్టుకొనువాడు - ఈ నాల్గును సన్న్యాసికి పేర్లు) 

***

జడ మీద   కొన్ని పద్యాలు:

భామకు వెనకను జడయే
పాముగ తానూగుచుండు, పైనను గనగా
చేమంతిబిళ్ళ మెరయుచు
తామణిగా వెలుగుచుండు తరుణీమణికిన్.

నడుమన వొయ్యారముగా
సడి జేయక పాము వోలె జారుతు జడయే
గడగడ లాడించు జగముల్
పడిపోవును జడను జూసి ఫాలుండైనన్ !

అమ్మా జడలను వేయగ
రమ్మా మరి గంట మ్రోగె రయముగనైనన్
డుమ్మా కొట్టక వెళ్ళెద
బమ్మెరకవి పాఠములను బడిలోవినగన్

చీరలుఁ గట్టెడి పడతికి
బారెడు జడ అందమొసగు, ప్యాంటులుఁ దొడిగే
నారికి పోనీటైలే
గ్యారెంటీగా పొసగును, గదరా శ్యామా!

పొడవగు జడగని పరుగున 
పడతిని పెళ్ళాడి యొకడు పంతము పోయెన్ 
పడిపడి వగచెను గదరా 
ముడివిడి సవరము వరునికి ముంగిట పడగన్. 

ఒడల భూతి బూసి జడలు ధరించిన
నొడయు డయిన ముక్తి బడయలేడు
తడికి బిర్రుపెట్ట తలుపుతో సరియౌనె
విశ్వదాభిరామ వినురవేమ. 

బారెడేసి జడలు భస్మంబుపూఁతలు
మరునితోడ మాఱుమలయఁ గలరు
ముంజికోకలెల్ల లంజెకోకలాయె
విశ్వదాభిరామ వినర వేమ.

సీగానపెసూనాంబా
బాగున్నవి పిలక జడలు బాపూ రమణల్
చేగీతల రాతలతో
లాగూ తొడిగిరిగ నాకిలాగు నిఝంగా. 

బోడనెత్తి జూసి - మురియనేలా పిల్లా - హా
అందమయిన - వాలుజడా వేయవె మల్లా
మాటంటే మాటా కాదు - ఎర్ర బుర్ర పిల్లా
సోకంటే సోకు కాదు - సూడవె మల్లా 

***

జడ మీద సినీగేయ రచనలు:

"సుందరి నీ వాలుజడే సొగసైన ఆ యమునా
హోయ్ ..నాటి తార కోట్లు వీడే
నాటి పున్నమ జాబిలి ఈడే
రాధ నేనే కృష్ణుడు నీవే
రాస లీల వేళ ఇదే
రాస లీల వేళ ఇదే..." 

"సిగ్గుతోటే ముగ్గులేసి ముగ్గులోకే దించుతారే
ముందు కాళ్ళ బంధమేసి ముద్దులోనే ముంచుతారే
వాలుజడనే మెడకే విసిరి ఊపిరే ఆపేస్తారే
జగడాలు ఆడాల్లు అని నిందలే వేస్తారే... "

" నీలి కురుల వాలు జడల చాటు నడుము కదలిక కుశలమా
అడగలేక అడుగుతున్న తీపి వలపు కానుక పదిలమా

నీలోని దాహాలు అవి రేపే విరహాలు చెలరేగే మోహాలు క్షేమమా... "

" జడలో విరులే జాలిగ రాలి జావళి పాడేనురా
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా
లేలేత వలపు సన్నాయి పిలుపు రావాలి సందిళ్ళ దాకా
మన పెళ్ళిపందిళ్ళ దాకా ఆ ఆ
విరహ వీణ హా నిదుర రాక వేగే వేళలో ఆ వేగే వేళలో... "

" నా వాలుజడ కృష్ణవేణి
నా పూలజడ వెన్నెల గోదారి
నా ఒళ్లు గంగమ్మ పరవళ్లుగా 
నర్తన చేసిన రతిని భారతిని
కూచిపూడి భారతికి హారతిని... భారతిని..."

అమ్మకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్
అమ్మకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్

ఓ..అసలేవిరహం అయ్యో దూరం ఎల్లాగున్నావు
ఆ..చారెడు..పిడికెడు. బారెడు పిల్లా ఎల్లగున్నావు
ఎందా ?
చెంపకు కన్నులు చారెడు..
సన్నని నడుము పిడికెడు..
దువ్వీ దువ్వక పువ్వులు ముడిచిన నల్లని నీ జడ బారెడు..మనసిలాయో !*

"మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది
నాగమల్లె పూలతో నల్లని జడ నవ్వింది
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది..." 

జడ మీద ఒక సమగ్ర సినీ గీతం:

చందమామ లాంటి మోము..నువ్వు పువ్వు లాంటి ముక్కు
దొండపండు లాంటి పెదవి..కలువ పూల వంటి కళ్ళూ
జామపండు లాంటి బుగ్గ..బెల్లం ముక్క లాంటి గడ్డం
వలపుశంఖమంటి కంఠం .. ఇంకా..ఇంకా..
ఎన్నో..ఎన్నో యవ్వనాల నవ నిధులు
కవ్వించి చంపే వన్నీ అన్నీ ముందువైపునే ఉంటే..
నువ్వొక్కదానివే వెనకనే ఎందుకున్నావే జడా?'

'హా.. ఆ బుగ్గలు సాగదీస్తావ్ .. ముక్కుని పిండుతావ్ ..
పెదవులు జుర్రుకుంటావ్ హు.. గడ్డాన్ని కొరుకుతావ్ ..
ముద్దులూ..గుద్దులూ..గిచ్చుళ్ళు..నొక్కుళ్ళు..
అదేవిటంటే ఆరళ్ళు..గీరళ్ళు..
శౄంగారం పేరుతో గింగిరాలు తిప్పువానే..ఇలా వెనకాలే ఉన్నా
నీ పక్క చూపులూ..వెనక చూపులూ ఎంచక్కా కనిపెడుతున్నా
అవసరమైతే పనిపడుతున్నా ! '

ఓ వాలుజడా..మల్లెపూల జడా..ఓ పాము జడా..సత్యభామ జడా
నువ్వలిగితే నాకు దడ

ఓ పట్టుజడా..రసపట్టు జడా..బుసకొట్టు జడా..నసపెట్టు జడా
ఇపుడెందుకే ఈ రగడా

ఓ వాలుజడా..మల్లెపూల జడా..ఓ పాము జడా..సత్యభామ జడా

వీపుకి మెడకీ..భుజములకీ..
తగు అందం తెచ్చే జడ..ఈ తగవులేలనే జడ
కులుకుల నడుముకి వెనకన తిరుగుతూ..
కళకళలాడే జడ..నను కనికరించవే జెడా

పిరుదుల బిరుదుల జడగంటలతో జగతికి చాటే జడా..నా పొరపాటేమే జడా
అత్తరి ఇత్తరి అనుమానాలా తత్తరి బిత్తరి జడా..ఎద కత్తిరించకే..జడా

కనికట్టు జడా..కనిపెట్టు జడా..పనిపట్టు జడా..పనిపెట్టు జడా
నిను విడువని ప్రేమికుడా

వడిసేలల్లే తిప్పితే జడా..గుండెలోన దడ దడ..
ఏ గుబులు రేపకే జడా
నడుము తిప్పుడూ నాగస్వరానికి నాగుపామువే జడా..
నగుమోము చూపవే జడా
జడకోలాటం సరసమె కాని..జగడం కాదే జడా..
నను సరసకు రానీ జడా

జడని దువ్వనీ..పొగడని మొగుడూ జడపదార్ధమే జడా..
నిను దువ్వనియ్యవే జడా

కనువిందు జడా..నను పొందు జడా..
సరసాల జడా..ఇక చాలు జడా
ఏ నాటికి నీవాడా
జజ్జడాం..జగడ జజ్జడాం... 
*** 
 పారిజాతాపహరణంలో ఒకపద్యం:

మగమీల నగఁ జాలు తెగఁ గీలుకొను వాలుఁ గనుఁగవ కొక వింత కాంతి యొదవె
వలిజక్కువల పెక్కువలు దక్కువగ నిక్కు చనుదోయి కొక వింత చాయ దోఁచె
నెల తుమ్మెదల దిమ్ము వెలిఁజిమ్ము చెలువమ్ము గలవేణి కొక వింత నలుపు మీఱె
నల చెందొవల విందు చెలువెందు వెదచిందు మొగమున కొక వింత జిగి దొలంకెఁ

జక్కఁదనమున కొక వింత చక్కఁదనము జవ్వనంబున కొక వింత జవ్వనంబు

విభ్రమంబున కొక వింత విభ్రమంబు గలిగె నద్దివ్య కుసుమంబు కతన సతికి. 

స్వర్గలోక పారిజాతం రుక్మిణీదేవి జడలో చేరగానే ఆమె సోయగము ఇలా పరిణమించిందని వర్ణన. 

ఋష్యశృంగుడు రచించిన మాలినీ శాస్త్రం లో జడలు ముడులు ప్రస్తావన వుంది. 

అనసూయ ఆశ్రమం సందర్శించినప్పుడు యెప్పుడూ జడ వేసుకొమ్మని వాడిపోని పూలదండ ఇస్తుంది. 

సౌందర్య లహరిలో అమ్మవారి కబురు బంధాన్ని (కురులను) ఇలా వర్ణిస్తారు. 

"ధునోతు ధ్వాన్తం న స్తులిత దళితేన్దీవర వనం
ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే |
యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో
వసన్త్యస్మి న్మన్యే వలమథనవాటీవిటపినాం ||" 

స్త్రీస్వరూపముగా దేవతారాధన చేసినప్పుడు కేశాదిపర్యంతము చేస్తారు. అమ్మవారి తలను ముందు దర్శించి తరవాత పాదముల వరకు చెయ్యాలి. అది ఉపాసనా విధానము. ఇది చాలా అద్భుతమైన శ్లోకము. శంకరులు చెప్పిన ఈ శ్లోక అర్ధమును మానసికముగా మననము చేస్తే తెలియకుండానే అజ్ఞానపు చీకట్లు విచ్చి పోతాయి.
‘ధునోతు ధ్వాన్తం న స్తులిత దళితేన్దీవర వనం’
అమ్మా ! నీ జుట్టు నల్లకలువల తండములా ఉన్నది అన్నారు. సహజమైన సుగంధములతో ఉండటము ఒక ఎత్తు. సువాసనలతో ఉండటమే కాకుండా నల్ల కలువల తండము ఎలా ఉంటుందో అలా ఒత్తుగా ఉండే జుట్టు కలిగి ఉండటము ఒక ఎత్తు.
‘ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే’
రెండవ పాదములో ‘ఘన’ అని మొదలు పెట్టారు. ఆమె జుత్తు ఎందుకు తెల్లబడదు అంటే ఆవిడ కాలమునందు వచ్చి కాలము నందు తిరిగి కాలమునందు పడిపోయేదికాదు కాలము ఆవిడకి లొంగి ఉంటుంది. కాలము నడిపే సూర్య చంద్రులు ఆవిడకి తాటంకములై ఉంటారు. అంటారు శంకరాచార్యులవారు. ధ్వాంతం అంటే చీకటి. అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతున్నాయమ్మా అంటూ మొదలు పెట్టారు. మిగిలిన విషయము చెప్పలేదు అంటే విశ్వాసము ఉన్నవాడే అలా చెపుతాడు. శంకరులు ‘తవశివే’ అంటారు. శివే అనగా తల్లీ మంగళప్రదురాలా ! శుభప్రదురాలా ! ఎవరిని చూసినంత మాత్రము చేత మంగళము కలుగుతుందో, నీ కేశపాశము జన్మరాహిత్యమునకు కారణము అవుతుంది. కృష్ణపరమాత్మను ఘనశ్యామం అంటున్నట్లుగా ‘ఘన’ అంటే మేఘము. నల్లని నీటితో ఉన్న మేఘములో ఒక విధమైన కాంతి, మెరుపు ఉంటుంది. అలా అమ్మవారి జుట్టు నల్లగా, వత్తుగా ఉంటుంది. ‘స్నిగ్ధ’ అనగా జల్లుకుని పోయి ఉండటము కాక కేశములు అంటుకుని ఉండటము సంస్కరింపబడి, దగ్గర దగ్గరగా దువ్వబడి ఉంటాయి. స్త్రీ కేశపాశము చల్లుకుని చివర ముడి లేకుండా ఉంటే ఉగ్రభూతములు ఆవహిస్తాయి పరమ అమంగళకరము అని గుర్తు. పెళ్ళిలో తలంబ్రాలు పోసుకునేటప్పుడు పురుషుడు నువ్వు ఎప్పుడూ జూట్టు విరబోసుకుని నాకు కనపడకుండా ఉండెదవు గాక అని అడుగుతాడు.
‘శ్లక్ష్ణం’ అనగా తిత్తులు, చిక్కులు లేకుండా ఉండటము. పరమ శివునకు మంగళము కనక తల్లి జుట్టు విషయములో ఎంతో జాగర్తగా ఉంటుంది.
‘చికుర నికురుంబం తవ శివే’
చికురములు అంటే వెంట్రుకలు. అవి ఎలా ఉన్నాయి అనగా జుట్టు వంక చూసినప్పుడు నల్లకలువల తండమును చూసినప్పుడు ఎంత అందముగా ఉంటుందో అమ్మవారి జుట్టు అంత అందముగా ఉన్నది అన్నారు. నల్లకలువకింద రేకుల యొక్క మొదటి భాగములోనీటి బిందువులు ఉంటాయి. నల్ల కలువ మొదట్లో ముఖము పెడితే ఆ నీటితనము వలన కళ్ళకు చల్లగా చాలా విశ్రాంతిగా ఉంటుంది అది నల్లకలువ లక్షణము. తెల్లకలువకు ఎర్రకలువకు అలా ఉండదు.
అప్పయ్య దీక్షితులవారు కొన్ని కొన్ని వస్తువులు మనప్రయత్నము లేకుండా మనసు లయము అయిపోవాలి అంటే వాటిని అనుభవించమని అన్నారు. ఏనుగు అంకుశమునకు ఎలా లొంగిపోతుందో, జింక ఒక పాటకు ఎలా లొంగుతుందో అలా మూడు వస్తువులకు మనసు లొంగి పరబ్రహ్మము వైపు ధ్యానములో ఒరుగుతుంది. అవి అరవిరిసిన తామరపూలు ఉన్న కొలను దగ్గర కూర్చుని కళ్ళు కూడా ముయ్యనవసరము లేకుండా ధ్యానము చేస్తే మనసు తొందరగా లయమైపోతుంది. వీణానాదము వాయించడము వచ్చినా, వేణువు వాయించినా పలికించడము వచ్చినా అమ్మవారు పరమప్రీతి చెంది ప్రసన్నురాలు అవుతుంది. వీణ వాయించడము వచ్చినా, వాయిస్తున్నప్పుడు వినడము అలవాటు అయి ఈ మూడింటి మీద దృష్టి పెట్టడము అలవాటు అయితే మనోలయము అవుతుంది. పూర్ణచంద్రబింబము కూడా అటువంటిదే. అమ్మవారి జుట్టు నల్లకలువల తండములా ఉంటుంది అని శంకరులు చెప్పడములో అర్ధము ధ్యానము చెయ్యడము నేర్చుకుంటే మనసు అందులో లయమవుతుంది. పరదేవత జుట్టుకి సువాసన సుగంధ భరితమైన తైలము రాసినందువలన, పుష్పములు అలంకారము చెయ్యడము వలన కాక సహజముగా ఉన్నది. ఎంతో సుగంధ భరితములైన పువ్వులు మందారము, నవమల్లికము, నీలోత్పలము దేవతా వృక్షములకు పూసే పూలు. ఆ పువ్వులను పెట్టుకోవాలని దేవతాస్త్రీలు ఎదురు చూస్తూ ఉంటారు. అవి వాడిపోవు వాటిని మనుష్యలోకములోని వాళ్ళు పెట్టుకోలేరు. నల్లటిజుట్టు దివ్యమైన సువాసనలు వస్తుంటే స్వర్గలోకములో ఉన్న పారిజాతాది వృక్షములు మనపువ్వులు అందరూ పెట్టుకుంటారు. అమ్మవారి కేశ పాశమునకు సహజ సుగంధము ఎలా వచ్చిందో మన పువ్వులు ఆవిడ పెట్టుకుంటే బాగుండు ఆవాసనను చూద్దామని అనుకుంటాయి. సుగంధమును మాత్రమే వెదజల్లబడే కొన్ని మంగళప్రదమైన ద్రవ్యములు అలదబడితే వాటినుంచి నుంచి వచ్చే సువాసనలకు పరిమళములని పేరు.



అశోక వనం లో సీతాదేవి తన పొడవైన వేణి తో ఆత్మ త్యాగం చేసుకోవాలి అనుకుంటుంది. 


సత్య భామనే.
 సత్య భామనే
వయ్యారి ముద్దుల!వయ్యారి ముద్దుల సత్యా భామనే..... "

అంటూజడ పట్టుకుని సత్యభామ హొయలు పోతుంది భామాకలాపం లో. 

ఇంకా క్షేత్రయ్య, అన్నమయ్య, ఆముక్తమాల్యద, కాళిదాసు శాకుంతలము, ఇంకా యెన్నో రచనలలో కేశ, వేణీ, కొప్పు, జడ ప్రస్తావన వున్నది. 

***

డ్రెస్సు వేస్తేనో, జీన్సు తొడిగితేనో కాదు.. జడవేసినా, రబ్బరు బ్యాండు పెట్టినా కొత్తగానే ఉండాలనుకుంటారు ఈతరం ఆడపిల్లలు. ఇక, జడ సంగతైతే చెప్పనే అక్కర్లేదు. హైపోనీ, ఫ్రెంచ్‌ ప్లెయిట్‌, ఫిష్‌టెయిల్‌.. ఎన్నెన్నో సింగారాలు. మగువల కురుల ముస్తాబుకు సంబంధించి యూట్యూబ్‌లో రకరకాల ట్యుటోరియల్స్‌ పుట్టుకొచ్చాయి. ఇన్‌స్టాలో ఎన్నో పేజీలు వెలిశాయి. కొత్తకొత్త మోడళ్ల జడలు వేస్తూ నెట్‌ ప్రపంచంలో స్టార్‌ స్టేటస్‌ను పొందిన వాళ్లూ ఎందరో.

అమ్మాయి జడకు అంత క్రేజ్‌ ఉండబట్టే ఎప్పటికప్పుడు వినూత్నమైన రకాలు తెరమీదకి వస్తున్నాయి. అందులో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌.. జడ మధ్యలో చిత్రం కనిపించడం. హార్ట్‌ బ్రెయిడ్‌, మిక్కీ బ్రెయిడ్‌, రోజ్‌ బ్రెయిడ్‌లాంటి పేర్లతో ఇవి మగువలను మురిపిస్తున్నాయి. జుట్టు మధ్యలో ఏదైనా బొమ్మ కనిపించాలంటే.. ఆ ఆకృతి ప్రకారం వెంట్రుకల్ని కత్తిరిస్తారు. కానీ ఇక్కడలా కాదు. జుట్టును పాయలుగా విడదీసి, చిన్న జడలల్లి, క్లిప్పులూ రబ్బర్‌ బ్యాండ్లను ఉపయోగిస్తూ వింతవింత బొమ్మలు వచ్చేలా చేస్తారు. అంటే మన జుట్టుకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండానే కొత్త హెయిర్‌ స్టైల్‌ ప్రయత్నించవచ్చు. ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తే జడలు వేయగల నైపుణ్యం ఉన్న ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఆఫీసులో ఫంక్షన్లకూ, కాలేజీ ఫెస్ట్‌లకూ వేసుకెళ్తే.. సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ మనమే. ఈ విభిన్న హెయిర్‌ స్టైల్స్‌తో సిగ సింగారించుకోండి, తెగ వెలిగిపోండి!

No comments:

Post a Comment