*శ్రావణమాస మాహాత్మ్యము*
*🪔🛕🏵️ శ్రావణమాస మాహాత్మ్యము 🏵️🛕🪔*
*స్కాందపురాణాంతర్గత శ్రావణమాస మాహాత్మ్యము*
*`శ్రీమద్భగవద్గీత` గ్రూప్స్ వీక్షకులకు ప్రత్యేకంగా శ్రావణ మాసం ప్రత్యేకం...*
*📿IIపదునైదవ అధ్యాయముII📿*
*శుక్రవారవ్రతం*
*ఈశ్వరుడు చెప్తున్నాడు - "ఇప్పుడు శుక్రవారవ్రత మాహాత్మ్యం గురించి చెప్తాను. దీనిని వినినంత మాత్రాన మానవులు సకల కష్టాలనుండి విముక్తులౌతారు. ఈ సందర్భంగా ఒక జరిగిన కథను తెలియజేస్తాను.*
*ఒకప్పుడు పాండ్యవంశస్థుడైన సుశీలుడు అనే రాజు సకల భోగభాగ్యాలతో ఉండేవాడు కానీ ఎన్నివిధాల ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి సంతానం కలగలేదు. దానికి ఎంతో విచారిస్తుండగా అతని భార్య సుకేశి ఒకానొక పథకం వేసి, తాను గర్భవతి అయినట్లుగా తన కడుపు పైన వస్త్రాలు చుట్టుకుని నటించేది. అదే రాజ్యంలో ఒక పురోహితుని భార్య అదే సమయంలో గర్భం దాల్చింది. ఆమెను సుకేశి* *గమనిస్తూ తాను ఏ విధంగా గర్భవతిగా ప్రవర్తించేదో వాటినే సుకేశి కూడా అనుకరించేది. రాజు నిజమే అనుకుని ఆనందపడి ఆమెకు సీమంతోత్సవం, అనవలోభనసంస్కారం (8వ నెలలో చేసేది) మొదలైనవన్నీ చేయించాడు. పురోహితుని పత్ని ప్రసూతికా గృహంలో ఉన్న సమయంలోనే రాణి కూడా తన ప్రసూతికా గృహానికి చేరుకుంది.*
*పురోహితుని భార్యకు ప్రసవం జరిగే సమయంలో ప్రసవం చేయించేదాది ఆమె కంటికి ఒక వస్త్రాన్ని కట్టి ప్రసవం చేయించింది. ఆమె కళ్ళు తెరిచేలోపు ఒకానొక రాణిసేవకురాలి చేతికి ఈ పురోహితుని బిడ్డను ఇచ్చి రహస్యంగా రాణిగారి పక్కలోకి చేర్పించింది. ఒక మాంసపు ముద్దను వేరేగా తెప్పించి, పురోహితుని భార్యతో తన సంతానం చనిపోయిందని అబద్దం చెప్పింది. దానితో పురోహితుని భార్య చాలా దుఃఖించింది కానీ గర్భవతిగా ఉన్నప్పుడు కలిగిన స్పర్శ మొదలైన వాటి చేత తన బిడ్డ మరణించి ఉండడు... ఈ దాది ఏదో కుట్ర పన్ని ఉంటుందని భావించింది. కానీ రహస్యాన్ని ఛేదించలేక, ఇక చేసేది ఏమీ లేక ఊరుకుంది. రాణీవాసానికి చేరిన ఆ బిడ్డకు జాతకర్మాదులు చేసి ప్రియవ్రతుడు అని పేరు పెట్టారు.*
*శ్రావణమాసం వచ్చాక శుక్రవారం నాడు పురోహితుని భార్య తన బిడ్డ క్షేమం కోరుతూ జీవంతికా వ్రతాన్ని ఆచరించింది. అమ్మవారిని పుత్రులసహితంగా గోడపై లిఖించి, పువ్వులమాలలతో, అక్షతలతో పూజించింది. గోధుమపిండితో అయిదు దీపాలను వెలిగించి, గోధుమపిండితో చేసిన పదార్థాలను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించింది. తాను కూడా ఆ గోధుమపిండితో చేసిన పదార్థాన్నే ప్రసాదంగా తీసుకుని, అక్షతలు అమ్మవారిపై వేసి, "యత్ర మే బాలకో భవేత్ తత్ర త్వయా రక్షణీయో జీవన్తి కరుణార్ణవే - ఓ కరుణామయివైన జీవంతికాదేవి! నా బిడ్డ ఎక్కడ ఉన్నా తనను నువ్వు రక్షించాలి" అని కోరుకుని నమస్కరించింది. ఈ విధంగా ప్రతి శ్రావణమాసంలో శుక్రవారాలు ఈ వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరించేది. దానితో జీవంతికాదేవి అనుగ్రహంతో పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు.*
*కొంతకాలం గడిచాక ప్రియవ్రతుని తండ్రి మరణించాడు. తండ్రికి చెయ్యాల్సిన పితృకర్మలు అన్నీ చేసి, ప్రియవ్రతుడు పితరులనుద్దేశించి శ్రాద్ధాది కర్మల కోసం గయకు వెళ్ళడానికి నిశ్చయించుకొని, మంత్రులకి రాజ్యభారాన్ని అప్పజెప్పి సామాన్య వస్త్రాలు ధరించి గయకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక గృహస్థు ఇంట్లో విశ్రమించాడు. ఆ ఇంటి ఇల్లాలికి ఆ రోజు ప్రసవమైన అయిదవ రోజు. ఇప్పటి వరకు ముందు కలిగిన అయిదుగురు పిల్లలను, పుట్టిన అయిదవరోజున వారి కర్మానుసారం ముక్తి కలిగించాలని షష్ఠీదేవి ఆజ్ఞతో ఒక దేవత వారి ప్రాణాలను తీసేసింది. ఈ బిడ్డ ప్రాణాలు తియ్యడానికి కూడా ఆ శక్తి రాగా, ప్రియవ్రతుడు ఉన్న కారణంగా జీవంతికాదేవి ఆ బిడ్డను చంపకుండా వదిలిపెట్టమని షష్ఠీదేవితో చెప్పింది. సరేనని షష్ఠీదేవి విడిచిపెట్టింది. దానితో ఆ దంపతులు ఆనందించి, ఆ రాజుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.*
*అక్కడనుండి మరల ప్రయాణమై, గయకు వెళ్ళి పిండవిధి గావించి, శ్రీవిష్ణు పాదంపై పిండం వేసే సమయంలో ఆశ్చర్యంగా రెండురకాల చేతులు పిండాన్ని గ్రహించడానికి వచ్చాయి. శాస్త్రవిధిని అనుసరించి ఆ పిండాలను విష్ణుపాదంపై ఉంచి, ప్రియవ్రతుడు వెనుదిరిగి వచ్చి, అక్కడ ఉన్న ఒక జ్ఞానవంతుడైన బ్రాహ్మణుని ఆ విషయమై ప్రశ్నిస్తే, ఇద్దరు తండ్రులు ఉంటేనే ఇలా జరుగుతుందని చెప్పి, తన తల్లినే ఈ విషయమై అడగమని చెప్పాడు. ప్రియవ్రతుడు తిరుగుప్రయాణంలో మరల అదే గృహస్థు ఇంటికి రాగా, మరల అదే రోజు ఆ గృహిణికి ఆరవ ప్రసవం జరిగి అయిదవరోజు. ఆ రోజు కూడా షష్ఠీదేవి తన శక్తిని ఆ బిడ్డ ప్రాణాలు తియ్యడానికి పంపించింది. ఆ సమయంలో కూడా మరల రాజు ఉండడం వల్ల జీవంతికాదేవి షష్ఠీదేవిని వారించింది. అప్పుడు షష్ఠీదేవి కారణం అడిగితే జీవంతికాదేవి ఈవిధంగా చెప్పింది- "శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాలు ఈ రాజు తల్లి చాలా భక్తిగా క్రమం తప్పకుండా నా అర్చన చేస్తుంది. వ్రతనియమాలన్నీ పాటిస్తూ ఆకుపచ్చని వస్త్రం, రవిక, గాజులు నాకు ఇష్టం ఉండవని నాకు సమర్పించదు. తాను కూడా ధరించదు. బియ్యం కడిగిన నీరు ఎప్పుడూ దాటదు. పచ్చని ఆకులతోనున్న మండపం క్రిందనుండి ఎప్పుడూ వెళ్ళదు. పచ్చగా ఉండే కూరలు కూడా ఎప్పుడూ. తినదు. ఇదంతా నాకు ప్రీతి కలిగించడానికి ఆమె నిష్ఠతో ఆచరిస్తోంది కాబట్టి, ఆమె పుత్రుని నేను రక్షించడమే కాక, ఆమె పుత్రుడు ఉన్న చోట కూడా పిల్లలు ఎవరికీ హాని జరగకుండా చూస్తాను" అని చెప్పింది. ఇదంతా నిద్రను అభినయిస్తున్న ప్రియవ్రతుడు విన్నాడు.*
*రాజ్యానికి చేరుకుని తల్లిని "జీవంతికా వ్రతం చేస్తున్నావా?" అని ప్రశ్నించాడు. దానికి తల్లి, "ఆ వ్రతం గురించి కనీసం వినలేదు కూడా" అని చెప్పింది. దానితో 'రాజు గయ వెళ్ళివచ్చినందుకు ఒక బ్రాహ్మణ సంతర్పణ, దానాలు ఏర్పాట్లు చేయిస్తున్నట్లు ప్రకటించి, భటుల చేత అందరికీ ఆకుపచ్చని వస్త్రాలు పంపించి అవి కట్టుకురమ్మని చెప్పించాడు. దానికి ఈ పురోహితుని భార్య పచ్చవి కట్టుకోనని చెప్తే ఎర్రని వస్త్రాలు సమర్పించారు. ఆ విషయం భటులు రాజుతో చెప్పారు.*
*రాజసదనానికి అందరూ వచ్చే తూర్పు ద్వారంలో బియ్యం కడిగిన నీళ్ళు పోయించాడు. అప్పుడు ఆ పురోహితుని భార్య వేరే ద్వారం ద్వారా వచ్చింది. ఒక పచ్చని పందిరి వేయిస్తే దాని క్రిందనుండి కాకుండా ప్రక్కనుండి వచ్చింది. ఇవన్నీ రాజు గమనించి ఆ పురోహితుని భార్య వద్దకు వచ్చాడు. ప్రియవ్రతుని చూడగానే పురోహితుని భార్య స్తన్యాలనుండి ఆమెకు తెలియకుండానే క్షీరం రాసాగింది. దానితో సందేహం వచ్చి రాజు పెంచిన తల్లిని దయతో నిజం చెప్పమని ప్రాధేయపడగా, ఆమె జరిగినదంతా వివరంగా తెలియజేసింది. దానితో జన్మనిచ్చిన తల్లిదండ్రులను కలుసుకుని ఆనందించాడు. తన కన్నతండ్రి బ్రతికి ఉండగా మరి గయలో రెండు చేతులు కనబడడమనే విషయం సందేహంగా ఉండి అదే ఆలోచిస్తుండగా, స్వప్నంలో జీవంతికాదేవి కనబడి, ప్రియవ్రతునికి విషయం తెలియడానికి తాను కల్పించిన మాయ వల్ల అలా జరిగిందని తెలియజేసింది.*
*ఆ నాటినుండి రాజ్యంలో అందరినీ శ్రావణమాస శుక్రవారాలలో జీవంతికా వ్రతాన్ని ఆచరించమని చెప్పి, ఆచరింపజేయసాగాడు. ఈ వ్రతానుష్ఠానం వల్ల సంతానం ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందడమే కాక, కోరిన కోరికలు కూడా తీరుతాయి.*
*శ్రీ స్కాందపురాణములోని ఈశ్వర సనత్కుమార సంవాదరూపంగానున్న*
*శ్రావణమాస మాహాత్మ్యమునందు పదునైదవ అధ్యాయము సమాప్తము*
*రేపటి శీర్షికలో...*
*📿IIపదహారవ అధ్యాయముII📿*
*┈┉━❀꧁ఓం శ్రీ మాత్రే꧂❀━┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🪷🌺🪷 🙏🕉️🙏 🪷🌺🪷
No comments:
Post a Comment