Wednesday, October 16, 2024

****వివేక మార్గం!

 *వివేక మార్గం!*
                

 *ప్రాణులకు మంచి-చెడు తెలుసుకొనే శక్తి సహజంగానే కొంత ఉంటుంది. సింహాన్ని చూడగానే జింకలు పారిపోతాయి. కుందేళ్లు మొదలైన జంతువులను చూసి అవి అదరవు బెదరవు.  వేటగాడు పన్నిన వలలో వివేకహీనత వల్ల పశువులు పక్షులు పడుతుంటాయి. సింహం సైతం ఎరను చూసి మోసపోయి పట్టుబడుతుంది. ప్రాణులన్నింటిలో మనిషే తెలివిగలవాడు. కారణం వివేకం! అది లేకపోతే మనిషి కూడా జంతువులాగా బతకవలసి వస్తుంది. కొందరు- మోసగాళ్ల చేతిలో పడి, అవివేకంతో సర్వం పోగొట్టుకోవడం చూస్తుంటాం.*

 *అజ్ఞాన స్థితిలో చేసే నిర్ణయాలు చెడు ఫలితాలనిస్తాయి. బలవంతం, లోభం, భయం, పక్షపాతం... తదితర దుర్లక్షణాలు వివేకాన్ని నశింపజేస్తాయి. ఇటువంటి వారికి మంచిమాటలు రుచించవు.* 

*రాముడు లంకలో ప్రవేశించగానే రావణుడు సభ ఏర్పాటు గావించి తన అనుచరుల సలహాను అడిగాడు. మూర్ఖులైన పరిజనులు ‘రాజా! ఆ మనుషులూ కోతులూ మనకు ఆహారం. ఇది మనకు సంతోషించవలసిన సమయం!’ అంటూ శ్రీరామ సైన్యాన్ని పరిహసించారు. చివరకు వానరసైన్యం చేతిలో చిత్తుగా ఓడిపోయారు.*

 *విదురుడు, భీష్ముడు చెప్పిన మంచిమాటలను దుర్యోధనుడు లక్ష్యపెట్టలేదు.    తుదకు కృష్ణుడు హితవు చెప్పడానికి వస్తే, ఆయన్ని బంధించాలని ప్రయత్నించాడు. వివేకం చూపి ఉంటే అతడి రాజ్యం, ప్రాణం నిలిచేవి.*

*అసలు వివేకం అంటే ఏమిటి? ఏది వివేకం, ఏది కాదు... ఎలా తెలుసుకోవడం?*


*ఒక వ్యక్తికి ముగ్గురు కుమారులున్నారు. తన కుమారుల భవిష్యత్తును గురించి భయం పట్టుకున్నది. ముసలితనంలో తనను సంరక్షించేది ఎవరు, వీరిలో ఎవరు ఉత్తములు, వృద్ధాప్యంలో తనను ఎవరు ఆదరిస్తారు... అని అనుమానం వచ్చింది. కుమారులను వెంటపెట్టుకొని ఒక మహాత్ముడి వద్దకు వెళ్ళాడు. ఆయనకు తన సమస్యను విన్నవించుకున్నాడు.* 

 *ఆయన వారికి అరటిపండ్లు ఇచ్చి వాటిని తినమన్నాడు. వారిలో పెద్దకుమారుడు పండ్లు తిని, వాటి తొక్కలను అక్కడినుంచే ఆ ఇంటి ముందుకు విసిరిపారవేశాడు. రెండోవాడు తన దగ్గరున్న అరటి తొక్కలను ఇంటిబయట ఉన్న చెత్తకుండీలో పడవేసి వచ్చాడు. మూడోవాడు తన దగ్గరున్న తొక్కులను తీసుకొని పోయి అక్కడే ఉన్న ఆవుకు తినిపించి వచ్చాడు. ఆ మహాత్ముడు పిల్లల తండ్రితో ఇలా అన్నాడు…*

*‘మీ పెద్దవాడు పెద్ద మొద్దబ్బాయి. అతడి వల్ల నీకు గాని, సమాజానికి గాని ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా నష్టం కూడా కలుగుతుంది. ఇక మీ రెండోవాడు తెలివిగలవాడే! తాను మంచివాడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మీ మూడోవాడు పరార్థ పరాయణుడు. నీకు వృద్ధాప్యంలో తప్పక చేదోడు వాదోడుగా ఉంటాడు!’*

*ఆ తండ్రి ఆశ్చర్యంతో….   ‘ఎలా చెప్పగలరు, మీ తీర్పునకు ఏమిటి ఆధారం?’ అని ప్రశ్నించాడు.*

*‘వివేకం!’  అన్నాడు జ్ఞాని.* 

*వివేకం కంటే గొప్ప సాధనం లేదు. వివేకి తన స్థాయిని తెలుసుకొని ప్రవర్తిస్తాడు. అందరి మన్ననలను పొందుతాడు. అవసరమైతే తన పద్ధతిని మార్చుకోవడానికి వెనకాడడు.*

 *బుద్ధుడు సర్వం త్యజించాడు. వస్త్రాలు ఆడంబరానికి దారితీస్తాయి కాబట్టి, వాటిని కూడా విడిచి పెట్టాడు. ఆహారం తీసుకోవడం మానేశాడు. ఒక చెట్టు నీడలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవగాయకులు కొందరు అటుగా పోతూ ఇలా పాడుకుంటున్నారు…*

*‘వీణ తీగలను చక్కగా సవరించుకో*
కాని తెగేదాకా బిగించితివో పరికరమే పాడవును గుర్తుంచుకో!’

 *ఈ పాట విన్న బుద్ధుడు మనసు మార్చుకున్నాడు.*
 *మధ్యే మార్గాన్ని ఎంచుకున్నాడు.* 

No comments:

Post a Comment