Friday, October 11, 2024

 Vedantha panchadasi:
షష్టము: చిత్రదీప ప్రకరణము
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

యథా చిత్రపటే దృష్టమవస్థానాం చతుష్టయమ్ ౹
పరమాత్మని విజ్ఞేయం తథాఽ వస్థాచతుష్టయమ్ ౹౹1౹౹

1.  చిత్రపటములు చిత్రీకరించుటయందు నాలుగు అవస్థలను మనము గమనించినట్లే పరమాత్మపై జరుగు జగద్రచన యందు కూడా నాలుగు అవస్థలను తెలియవలెను.

వాఖ్య:అవ్యక్తము అంచిత్యము అగు బ్రహ్మమునకు బదులు ఇంద్రియ గోచరము అపారవైవిధ్య సంపన్నము అగు ఈ జగత్తును మనము చూచుచుండుట ఎట్లు జరుగుచున్నది?

ఆరోపించుట వలన.
తెల్ల కాగితముపై గాని వస్త్రముపైగాని వివిధ వర్ణములను ఆరోపించుట వలన మనము ఇక కాగితమును గాని వస్త్రమును గాని చూడము.

వానిపై ఆరోపించబడిన పర్వతములను నదులను వృక్షములను ప్రాణిజాతమును చూచుచు
 "ఎంత మనోహరమైన చిత్రము"
అని ఆనందించుచు మైమరచి పోవుదుము.

శ్రద్ధాయుతమగు వివేచన వలనగాని ఆ చిత్రమంతా శుద్ధ వస్త్రము పైని రంగురంగుల విన్యాసమే అని మనస్సునకు తోచదు.అట్లే జనన మరణములు జరావ్యాధులు సుఖదుఃఖములతో నిండి మనలను సమ్మోహపరచు ఈ జగత్తు కూడా శుద్ధము ఆనందస్వరూపము అగు బ్రహ్మముపై ఆరోపింపబడిన అజ్ఞానపు విన్యాస వైచిత్ర్యమే.

వస్త్రమును రంగులను వివేచించినట్లే బ్రహ్మమును అజ్ఞానవికారములను వివేచించి తత్త్వమును తెలియవలెను.
ఈ రెండు ప్రక్రియలకే 
అద్వైత శాస్త్రమున
"అధ్యారోపము-అపవాదము"అని పరిభాష.

జగద్రచనలో శుద్ధ బ్రహ్మము, అంతర్యామి,సూత్రాత్మ ,విరాట్టు అను నాలుగు అవస్థలు గలవు.

అధ్యారోప అపవాదమును 
శంకర భగవత్పాదులు ఇలా చెప్పుచున్నారు-
"బ్రహ్మమునందు దేహేంద్రియాది ప్రపంచమున్నదని ఆరోపణచేసి అటుపై అపవాదము అనగా ఇదిగాదు ఇదిగాదు అని నిషేధించగా ఆత్మ తత్త్వము తెలియబడుచున్నది".

ఈ విధముగా ఆత్మయందు లేక బ్రహ్మమునందు ఆరోపింపబడిన జగత్తు సత్యముగాదు.శుక్తియందు రజితమువలె,రజ్జువందు సర్పమువలె బ్రహ్మము యందు జగత్తుయున్నది.

ఎంతవరకు స్వస్వరూపమైన బ్రహ్మము తెలియబడదో అంతవరకు ఈ బ్రహ్మమే జగద్రూపముగా తోచుచున్నదేగానీ నిజముగా లేదు.

ఆత్మ తన మాయ ద్వారా తనలో వివిధ ఆకారముల,రజ్జువు పై జూడబడు సర్పాది స్వరూపముల వలె కల్పించు కొనును.కాన ఈ జగత్తు మిథ్యయే.బ్రహ్మము తెలియనందువల్ల కనబడు ఈ జగత్తు సృష్టించ బడినదని చెప్పుట అవివేకి దృష్టి ననుసరించియేగానీ, వివేకిదృష్టి ననుసరించి చెప్పబడలేదు.      

No comments:

Post a Comment