Thursday, October 10, 2024

 భారతీయ కుబేరుల్లో రతన్ టాటా ఒకరు. అతను తన జీవితం కాలంలో ఎన్నో ఇంటర్య్వూలు ఇచ్చారు. తన జీవిత విశేషాలను, అభిప్రాయాలను చెప్పేవారు. అలా ఒక ఇంటర్య్వూలో రతన్ టాటాకు ‘మీ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సందర్భం ఏమిటి’ అని. దానికి రతన్ టాటా ఎంతో స్పూర్తివంతమైన అనుభవాన్ని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికీ ఆచరణీయమైనదే.

రతన్ టాటా మాట్లాడుతూ ‘నేను జీవితంలో ఎన్నో దశలను దాటి ఇక్కడి వరకు వచ్చాను. నేను చేసిన ఎన్నో పనులు నాకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదు, కానీ అనుకోకుండా చేసిన ఒక పని మాత్రం నాలో జీవితానికి సరిపడా ఆనందాన్ని ఇచ్చింది.’ అని చెప్పుకొచ్చరు. రతన్ టాటా చెప్పిన ప్రకారం...అతను తన యవ్వనంలో సంపద కూడబెట్టడం పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఆయన విజయవంతంగా ఆ పని చేశారు. కానీ అతనికి నిజమైన సంతోషం మాత్రం దక్కలేదు. ఇక తరువాత విలువైన వస్తువులను సేకరించే పని చేశారు. తనకు ఇష్టమైన ఎంతో ఖరీదైన, అరుదైన వస్తువులను సేకరించారు. కానీ ఆయనకు ఆ పని కూడా ఆనందాన్ని ఇవ్వలేకపోయింది.

వ్యాపారవేత్తగా ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ పొందాలని అనుకున్నారు రతన్ టాటా. ఆ విషయంలో కూడా సక్సెస్ అయ్యారు. ఆయనకు ఇండియా, ఆఫ్రికాలో 95% డీజిల్ సరఫరా ప్రాజెక్టు దక్కింది. అంతేకాదు ఆయన ఆసియాలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారానికి యజమానిగా మారారు. కానీ ఇక్కడ కూడా అతనికి ఆనందం లభించలేదు. కానీ అతనికి నిజమైన ఆనందంగా దక్కే రోజు అనుకోకుండా వచ్చింది.

ఒకసారి ఆయన మిత్రుడొకరు వచ్చి కొంతమంది వికలాంగ పిల్లలకు వీల్ ఛైర్స్ కొనివ్వమని అడిగారు. రతన్ టాటా 200 వీల్ ఛైర్స్ కొని స్నేహితుడి కోరిక నెరవేర్చారు. ఆ స్నేహితుడు వాటిని పంపిణీ చేసేందుకు రతన్ టాటాను కూడా రమ్మన్నారు. పిల్లలకు తన చేతులతోనే ఆ కుర్చీలను అందించారు. ఆ కుర్చీలు అందుకున్న పిల్లలు ఎంతో ఆనందం పడ్డారు. వాటితో ఇటూ అటూ తిరుగుతూ అప్పుడే రెక్కలొచ్చిన పక్షుల్లా తిరిగారు. పిల్లలంతా వాటిపైనే రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. ఎవరు గెలిచారో వారికి వచ్చిన బహుమతిని ఆ పిల్లలంతా పంచుకున్నారు. ఆ పిల్లలను చూసి రతన్ టాటా ఎంతో ఆనందపడ్డారు.

అక్కడున్న పిల్లల్లో ఒక పిల్లవాడు రతన్ టాటా కాలు పట్టుకున్నాడు. రతన్ టాటా అతడిని చూడగానే... ఆ పిల్లవాడు అతడిని చూస్తూ అలాగే ఉండిపోయాడు. అప్పుడు రతన్ టాటా ‘ఎందుకలా చూస్తున్నావ్, నీకు ఇంకెమైనా కావాలా’ అని అడిగారు. దానికి ఆ పిల్లవాడు ‘మిమ్మల్ని కాసేపు ఇలాగే చూడనీయండి. మీ ముఖం నాకు బాగా గుర్తుండాలి కదా, మిమ్మల్ని ఎప్పుడైనా స్వర్గంలో చూస్తే నేను మిమ్మల్ని గుర్తుపట్టాలి కదా, అప్పుడు నేను ఈ వీల్ ఛైర్ ఇచ్చినందుకు మళ్లీ ధన్యవాదాలు చెబుతాను’ అన్నాడు.

పిల్లవాడి మాటలు విన్న రతన్ టాటా ఆశ్చర్యపోయారు. అసలైన ఆనందం అంటే అప్పుడే అతనికి అర్థమైంది. జీవితంలో ఎన్నో సాధించినా కూడా రాని సంతోషం ఆ పిల్లలకు చేసిన సాయంలో తెలిసింది.

రతన్ టాటా కోట్లకు కోట్లు డబ్బు సంపాదించినప్పుడు, భారత కుబేరుడిగా ఎదిగినప్పుడు, ఆసియాలోనే అతి పెద్ద ప్రాజెక్టులను దక్కించుకున్నప్పుడు ఆయనకు సంతోషం దక్కలేదు. కానీ దివ్యాంగ పిల్లలకు చేసిన సాయంలో ఆయనకు అసలైన ఆనందం దక్కింది. అలాగే మీకు కూడా ఏ విషయంలో నిజమైన ఆనందం కలుగుతుందో తెలుసుకోండి. చిన్న చిన్న విషయాలే ఎక్కువ ఆనందాన్ని తెస్తాయి. ఇతరులకు చేసే సాయం మనసును సంతోషంతో నింపేస్తుంది.

ఇప్పుడు వారు మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ మన మనస్సులో ఎప్పటికీ నిలిచిపోతారు, వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ 

ఓం శాంతి శాంతి శాంతిః      🙏🙏🙏

No comments:

Post a Comment