Friday, October 11, 2024

 Vedantha panchadasi:
స్వప్రకాశాపరోక్షత్వ మయమిత్యుక్తితో మతమ్ ౹
అహంకారాది దేహాంతాత్ర్పత్యగాత్మేతి గీయతే ౹౹7౹౹

7. ఏ ప్రమాణముల ఆవశ్యకతయు 
లేక నేరుగా తెలియబడునదీ స్వయముగనే ప్రకాశించునదీ అని
"అయమ్" అనగా "ఈ" అనే శబ్దము సూచించుచున్నది.ఈ ఆత్మ అహంకారము మొదలు దేహము వరకు అన్నింటియందూ అనుస్యూతమై ప్రత్యగాత్మ అని కీర్తింపబడుచున్నది.

దృశ్యమానస్య సర్వస్య జగతస్తత్త్వమీర్యతే ౹
బ్రహ్మశబ్దేన తద్ర్బహ్మ స్వప్రకాశాత్మరూపకమ్ ౹౹8౹౹

8. దృశ్యమానమగు సకల జగత్తు యొక్క సారతత్త్వము "బ్రహ్మ"శబ్దముచే సూచించబడుచున్నది. స్వప్రకాశమగు ప్రత్యగాత్మ యొక్క స్వరూపమే బ్రహ్మము.

వాఖ్య: అథర్వణ వేదములోని మాండూక్యోపనిషత్తు నందలి
"అయమాత్మా బ్రహ్మ"(2)అనే వాక్యము వివరింపబడుచున్నది.
సూక్ష్మత్వము,వ్యాపిత్వము,అపరోక్షత్వములను"ప్రత్యక్" శబ్దము సూచించును.

"అయమాత్మా బ్రహ్మ" - 
ఈ జీవాత్మయే  పరబ్రహ్మము. అథర్వణ వేదము-మాండూక్యోపనిషత్తు-
"సాక్షాత్కార వాక్యము".

అథర్వణ వేదాంతర్గతమైన శాఃతి మంత్రము:
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః.భద్రం పశ్యేమాక్షభి ర్యజత్రాః, స్థిరై రంగై స్తుష్టువాంగ్ంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః౹౹
స్వస్తిన ఇన్ద్రో వృద్ధశ్రవాః౹ స్వస్తి నః పూషా విశ్వవేదాః,స్వస్తి నస్తార్ష్యో అరిష్టనేమిః,స్వస్తినో బృహస్పతి ర్దధాతు ౹
ఓం శాన్తిః శాంన్తిః శాంన్తిః

తా:దేవతలారా!మేము(జ్ఞాన)ప్రకాశ యుక్తులమై శుభమైనదానినే చెవులతో విందుముగాక!యజన శీలురమై యుండి శుభమునే కన్నులతో చూతుముగాక!బలమైన అవయవాలతో ఆరోగ్యముగా ఉండి మిమ్ము స్తుతించుచు మాకు విధించిన ఆయుష్కాలము వరకుజీవించెదముగాక!పురాతనుడు,ప్రసిద్ధుడు,అధికకీర్తి గలవాడు అయిన ఇంద్రుడు,
సర్వమును తెలిసిన సూర్యుడు(పూషా),మిక్కిలి వేగము గల వాయుదేవుడు,మాలోని ఆధ్యాత్మిక సంపదను రక్షించు బృహస్పతి,వీరందరు మాకు విషయమును గ్రహించగల బుద్ధి కౌశల్యమును,వాటిని అనుసరించ గల హృదయ ధైర్యమును ఇచ్చి అనుగ్రహింతురుగాక!త్రివిధతాపములు శాంతింపబడునుగాక!

స్వయం ప్రకాశమై అపరోక్షమైయుండు,"ఆత్మ"అను పదము వలన అహంకారాది దేహ పర్యంతము గల సంఘాతమునకు సాక్షి అనియు"బ్రహ్మ"శబ్దము చేత మిథ్యయైన సకల జగత్తుకు అధిష్టానమై యున్న పరబ్రహ్మము. ఇట్లు లక్శణావృత్తిచేత లక్ష్యార్ధమును గ్రహించి ఈ ఆత్మ బ్రహ్మమని నిశ్చయింప వలయును.

ఓంకార రూపమైనయీ సంపూర్ణ జగత్తు నిశ్చయంగా బ్రహ్మరూపమే అయింది.ఈ ఆత్మయే బ్రహ్మము (అయమాత్మా బ్రహ్మ)ఈ ఆత్మే నాలుగు పాదములు కలది.

బాహ్యజగత్తు మిథ్య.దానికి అధిష్ఠానమగు సచ్చిదానందము బ్రహ్మశబ్ద సూచితము.
బ్రహ్మము సత్యమని గురు శాస్త్రాదుల ద్వారా తెలుసుకొని,తన ఈ అహంకార రూప జీవత్వము
(దేహేంద్రియాదులే నేనను భావన)
తో సహా విషయ ప్రపంచమంతయు మిధ్యయని నిషేధిచి,నిషేధించుటకు వీలులేకయున్న తన జ్ఞానరూపమును(సాక్షిరూపమును)బ్రహ్మరూపముగా నిశ్చయించుకొనవలయును.ఇదియే ఆత్మజ్ఞానము.ఇట్టి అజన్మమైన ఆ ఆత్మయే నేనను జ్ఞానమును పొందిన మహాత్ముడు ఎట్లు పుట్టును?

అతీద్రియ స్వరూపుడనగు నేను ఈ జగత్తునంతటిని వ్యాపించి యున్నాను.అనగా ఈ జగత్తు యందు నాకంటె భిన్నమగు వస్తు ఒక్కటి యైనను లేదనియును,ఈ సమస్త భూతములును నాయందున్నవి కాని నేను వాటి యందులేను.అనగా ఈ ప్రపంచమంతయు భ్రాంతిచే నా యందు కల్పింపబడినదనియును, ఇట్లు అధిష్టానమైన బ్రహ్మము కంటె ఆరోపితమై యుండు జగత్తు తన అదిష్టానమైన బ్రహ్మము కంటె వేరు కాజాలదు.కావున అధిష్టాన భూతుండగు నేను(బ్రహ్మము) ఎప్పటికి అద్వితీయుండనే అని నిరూపించుటకై నేనాభూతముల యందుగానీ,ఆ భూతములు నాయందుగానీ,లేవనియు,అనగా నేను వేేరు భూతములు వేరనియును నాయందు భూతములు గానీ నేను భూతములయందుగానీ యున్నామనియును వ్యవహరించుటకు వీలులేని స్థితిని చూడమని(తెలుసుకొనమని)
శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పియున్నాడు.ఇదే అద్వైత బోధయని తెలియవలెను.

సమస్త వేదాంతముల సారము, ఆత్మపరమాత్మల ఏకత్వ బోధకము,అద్వితీయ బ్రహ్మవస్తుప్రతిపాదకము.

ఆత్మయైన తనకు దేనితోనూ భేదముగానీ,కర్తృత్వ బోక్తృత్వములుగానీ,దేనితోనూ సంగముగానీ,వికారముగానీ,తనకంటే వేరుగా జగత్తుగానీ సత్యముగా లేవనియు,మిథ్యయైన వీటి పరమార్థము బ్రహ్మమేననియు 
ఆ బ్రహ్మము నేనే ననియు,నేనే బ్రహ్మము ననియు తెలిసి కొనినచో జనన మరణ రూప సంసార భయము నశించి పోవును.

జగత్కల్పనలు లేని అద్వితీయ బ్రహ్మమే నా స్వరూపమని నిశ్చయించుకొనవలెను.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
*మహావాక్య వివేక ప్రకరణమను పంచమప్రకరణము:సమాప్తము*
౼౼౼౼౼౼౼౼౼౼. 

No comments:

Post a Comment