Thursday, October 10, 2024

 Vedantha panchadasi:
ఏక మేవాద్వితీయం సన్నామరూప వివర్జితమ్ ౹
సృష్టేః పురాధునాఽ ప్యస్య తాదృక్త్వం తదితీర్యతే ౹౹5౹౹

5.  సృష్టికి పూర్వము నామరూపములు లేని సత్తా ఒక్కటే అద్వితీయమై ఉండెను.ఈ కాలమున కూడా అది అట్లే ఉండుటను 'తత్' శబ్దము సూచించుచున్నది.
సామవేదీయమైన ఛాందోగ్యోపనిషత్తులోని తత్త్వమసి (6.8.7)అనే వాక్యము వివరింపబడుచున్నది.

శ్రోతుర్దేహేంద్రియాతీతం వస్త్వత్ర త్వంపదేరితమ్ ౹
ఏకతా గ్రాహ్యతేఽ సీతి తదైక్యమనుభూయతామ్ ౹౹6౹౹

6.  శ్రోతయందలి దేహేంద్రియాంతఃకరణములకు అతీతమైన సద్వస్తువు ఇచ్చట 'త్వం' పదముచే సూచితమైనది. 'అసి' అనే పదము ఈ రెండింటి ఐక్యమును సూచించుచున్నది.ఈ ఏకతనే అనుభవింపవలసి ఉన్నది.

"తత్త్వమసి" - 
అది నీవై యున్నావు.
సామవేద ఛాందోగ్యోపనిషత్ ఉపదేశ వాక్యమును గూర్చి
 చెప్పంబడినది.

సామవేదాంతర్గతమైన శాంతి మంత్రము:
ఓం ఆప్యాయన్తు మమాంగాని,వాక్ ప్రాణశ్చక్షు శ్ర్శోత్ర మథో బల మిన్ద్రియాణిచ సర్వాణి;సర్వం బ్రహ్మౌపనిషదం;మాహం బ్రహ్మ నిరాకుర్యాం;మామా బ్రహ్మ నిరాకరోత్;అనిరాకరణ మస్త్వనిరాకరణం మేఽస్తు;తదాత్మని;నిరతే య ఉపనిషత్సు ధర్మాఃతే మయిసన్తు తే మయిసన్తు.
ఓం శాన్తిః శాంన్తిః శాంన్తిః.

తా: ఉపనిషత్తులచే ప్రబోధింపబడిన బ్రహ్మము, నాయొక్క అంగములు వాక్కు నేత్రములు శ్రోత్రములు ప్రాణములు,బలము ఇంద్రియములు మొదలగు వానిని రక్షించుగాక!బ్రహ్మము నన్ను నిరాదరణ చేయక యుండును గాక! నేను బ్రహ్మమును నిరాదరణ చేయకుండునట్లు అనుగ్రహించుగాక!
నా విషయమున బ్రహ్మమునకు ఆదరము కలుగుగాక!నేను ఆత్మజ్ఞాన నిరతుడనై యుండునుగాక!ఉపనిషత్తులలో చెప్పబడిన ధర్మములు నాలో స్థిరపడి యుండును గాక!త్రివిధ తాపములును శాంతింపబడును గాక!

ఓం,సహనావవతు,సహనౌ భునక్తు,సహవీర్యం కరవావహై
తేజస్వి నావధీతమస్తు, మావిద్విషావహై,
ఓం శాంన్తిః శాంన్తిః శాంన్తిః

నామరూపములతో నిండిన ఈ సృష్టి పుట్టుటకు పూర్వము సత్తుగా ఏకమై అద్వితీయమై యుండినది.
అసత్తుగూడ ఉన్నదని కొందరు చెప్పినారు.కాని అదెట్లు వీలగును?అసత్తునుండి సత్తు ఏరీతిగా పుట్టును?అట్లు జన్మించుట అసంభవమేయగును. కావున సత్తుగా నున్న పరబ్రహ్మమే మొట్టమొదట ఉండెను.రెండవ వస్తువే లేదని తెలిసికొనుము.

"తత్త్వమసి"వాక్యార్థ చింతనమేవ అంతరంగ సాధనం ఆత్మ బోధస్య"
"తత్త్వమసి"వాక్యము మీద సక్రమ అవగాహనతో జేసెడి విచారమే ఆత్మజ్ఞానమునకు సరియైన అంతరంగ సాధన.

తత్ అనగా నామరూప రహితాద్వితీయ పరబ్రహ్మము.
త్వం,అసి అనగా,
వేదాంతశ్రవణాద్యనుష్ఠానము గలిగి మహావాక్యార్థమును దెలియ ఇచ్ఛగలవాని ఈ మహావాక్యమునందు త్వం పదముచే దేహాంద్రియాతీతమగు సద్వస్తువు లక్షిత మగుచున్నది.(త్వం అనగా దేహాంద్రియాతీత వస్తువు)అసి యను పదముచే ఏకత్వము గ్రహింపబడుచున్నది.ఈ ప్రమాణముచే ముముక్షువులు జీవబ్రహ్మైక్యము ననుభవింతురుగాక.

ఇట్లు "తత్త్వమసి" మహా వాక్యమందు"తత్"పదముచే సర్వోపాది రహితమైన
"సత్యం జ్ఞానమనంతం"మనియెడు స్వరూపలక్షణముతో తెలియబడు శుద్ధబ్రహ్మము సిద్ధించినది.

"త్వం"పదముచే"సచ్చిదానంద
"కూటస్థాత్మ"సిద్ధించినది.

ఇక "అసి"పదము వలన ఈ సామ్యముతో అనగా
"సత్యం జ్ఞానమనంతం" "సచ్చిదానంద"మనియెడు ఈ పదముల పొందికచే జీవుని నిజస్వరూపమైన ఆత్మ బ్రహ్మమేనని సిద్ధించుచున్నది.

ఈ చెప్పబడిన సచ్చిదానందాదులు ఆత్మకు గుణములుగావు స్వరూపమే.
ఇట్లు చెప్పుట ఏలనగా,శ్రుతికి విరుద్ధమైన ద్వైతం సిద్ధింపకుండుటకు,మరియు స్వస్వరూపమైన ఆత్మబ్రహ్మమేనని నిర్ధారించుటకు ఈ లక్షణములు చెప్పబడినవి.

జగత్తుగూడ సత్తే,పరబ్రహ్మమే అనుచు అఖండ వాక్యార్థమును
(అది నీవయితివి అను దానిని) తెలుపుచున్నారు.
ఈ జగత్తు యధాప్రకారము కనిపించినప్పటికీ, అది స్వరూప బ్రహ్మమున కంటె వేరుకాజాలదు. అధిష్టానము నందు ఆరోపించబడిన వస్తువు ఆ అధిష్టానము కంటె వేరుకాజాలదు.

ఎట్లు మట్టి యొక్క మార్పుచే అనగా"ఇది మట్టి" అని యదార్థమును గ్రహింపలేక ,ఆ మట్టినే వేరు విధముగా భావించుటచే ఏర్పడిన కుండ ఆమట్టి కంటె వేరుగానట్లు,

జీవుడు స్వరూపమును బ్రహ్మముగా తెలియక పోవుటచే స్వస్వరూపమైన బ్రహ్మమే జగద్రూపముగా గోచరిచుటచే 
ఆ జగత్తు ఆ బ్రహ్మమున కంటె వేరు గాదు.కాన జగత్తు బ్రహ్మమాత్రంగానే యున్నది.

యే పరబ్రహ్మ వస్తువు ప్రశాంతమైనదో,నిర్మలమయినదో,అద్వయమయినదో,పరమైనదో అట్టి పరబ్రహ్మమే నీవయితివి అని గురువు ఉపదేశించుచున్నాడు.

శిష్యునకు 
నేను బ్రహ్మను (అహం బ్రహ్మఽస్మి) అను అపరోక్షానుభవజ్ఞాన ముదయించుచున్నది.                

No comments:

Post a Comment