Thursday, October 10, 2024

*** *సత్యం.....*

 *సత్యం.....*

సత్యం అంటే తెలిసింది తెలిసినట్లు, చూచింది చూచినట్లు, విన్నది విన్నట్లు చెప్పటమే. అయితే ఈ సత్యం హితంగా - ప్రియంగా కూడా ఉండాలి. ఇక్కడే గొప్ప చిక్కు వస్తుంది. మీ ప్రక్క ఇంటిలో ఉండే యజమానికి గుండెజబ్బు ఉన్నది. ఆయన కుమారుడికి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ లో చేర్చారు. పరిస్థితి సీరియస్ గా ఉంది. ఈ వార్త ఆయనకు చెప్పాల్సి వచ్చింది. జరిగింది జరిగినట్లు చెబితే ఆయన హరీ! అంటాడు. మార్చి చెబితే అబద్ధం అవుతుంది. ఎలా? అలాంటప్పుడు నిజం చెప్పక పోయినా - కొంత మార్చి చెప్పినా అసత్యదోషం అంటదు.  
 ఒక అమ్మాయిని రౌడీలు తరుముతున్నారు. నీ ఇంట్లో దాక్కుంది. వాళ్ళు వచ్చి అడిగారు. నిజం చెబితే అమ్మాయికి ప్రమాదం. చెప్పకపోతే అబద్ధం అవుతుంది. కనుక ఏదో తెలివిగా సమాధానం చెప్పి తప్పించాలి. ఇలాంటి సమస్యే ఒక ఆశ్రమంలో సాధువుగారికి ఎదురైతే ఆయన, "చూచినవాడు చెప్పలేడు, చెప్పగలవాడు చూడలేదు" అన్నాడట. వాళ్ళు ఇదేదో మెంటల్ కేస్ అని వెళ్లిపోయారు. చూచింది కళ్ళు. చెప్పగలిగింది నోరు అని ఆయన ఆంతర్యం. అందుకే శుక్రనీతి చెబుతున్నది. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమానభంగమందు …బొంకవచ్చు - అని. సత్యం దైవీసంపద. 

సత్యం పలకాలి గదా! అని గుండెలు పగిలేటట్లు నిజాలు చెప్పకూడదు. అలాగే ప్రియంగా ఉండాలి గదా! అని కట్టుకథలు, పచ్చి అబద్ధాలు చెప్పరాదు*. ఇతరులకు బాధ కలగకుండా, నీకు స్వార్థ బుద్ధి లేకుండా ఉండే విధంగా సత్యం పలకాలి.  
వేదంలో 'సత్యంవద ధర్మంచర' - అన్నారు. సత్యాన్ని పలుకు - ధర్మాన్ని ఆచరించు అని. దానినిప్పుడు 'సత్యంవధ ధర్మం చెర' - చేశారు. సత్యాన్ని వధించు, ధర్మాన్ని చెరబట్టు అని. సత్యానికే ప్రథమస్థానం ఇవ్వాలి.  

'సత్యమేవజయతే' అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. సత్యానికి మించిన ధర్మం లేదు. 'Truth is god' అన్నారు. భూదేవి అంటుంది "పర్వతాలు అరణ్యాలు మోయటం నాకు బరువు కాదు. అసత్య వాదులను మోయటమే నాకు సాధ్యం కాదు" - అని. ధర్మరాజు ఒక చిన్న అబద్ధం ఆడాడు. భూమికి 4" ఎత్తున నడిచే ఆయన రథం ఆ దెబ్బతో నేలకు ఆనింది. చివరలో నరకదర్శనం చేయాల్సి వచ్చింది. మరి రోజూ కోకొల్లలుగా అబద్ధాలాడే వారిగతి ఏమిటి?  

 'ఆ! ఏదో చెబుతారు గాని నిజం మాట్లాడితే ముద్ద కూడా దొరకదు' అంటారు. ముద్ద కోసమేనా నిజం పలకాల్సింది? కష్టాలు రాకుండా ఉండటానికా? లాభం కోసమా సత్యం? సత్యం దైవీసంపద. దైవానికి దగ్గర చేసేందుకు సత్యవాక్పాలన. మోక్షసాధనకు సత్యసాధన మెట్టు. "హరిశ్చంద్రుడు సత్యాన్ని పలికితే ఏమయిందో మనకీ అంతే. కనుక సత్యాన్ని పలుకరాదు" అని కొందరు లాపాయింటు తీస్తారు. సత్యం కోసం అన్ని కష్టాలు పడ్డాడు గనుకనే ఆయన సత్యహరిశ్చంద్రుడై శాశ్వతంగా మన హృదయాలలో జీవించి ఉన్నాడు. అబద్ధాలు పలికిన రాజులను ఎవరు తలుచుకుంటారు? ఏ కాలంలోనైనా సత్యం సత్యమే. అసత్యం అసత్యమే.  
అసలు అబద్ధాలు అసత్యాలు పలకటానికి ఒక హెడ్డాఫీసు ఉంది. అదే కోర్టు. అక్కడ లాయర్లు ఎలా అబద్ధాలు చెప్పాలో, తప్పుడు సాక్ష్యాలు చెప్పాలో ట్రైనింగ్ ఇస్తారు. నేను ఇలా అదుగుతాను. నీవు ఇలా చెప్పు - అని పాఠం నేర్పుతారు. కోర్టులో ప్రశ్నలు అడిగే ముందు భగవద్గీతఫై చేతులు పెట్టించి భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెబుతాను. అబద్ధం చెప్పను, అని చెప్పిస్తారు. ఇదే మొదటి అబద్ధం. భగవద్గీత, భగవంతుడు ఈ అబద్ధాలకు మౌనసాక్షులు. ఇదొక అబద్ధాల ప్రపంచం. అబద్ధం తాత్కాలికంగా విజయాన్ని, లాభాన్ని కలిగించవచ్చు. కాని దాని ఫలితం మాత్రం ఘోరాతి ఘోరంగా అనుభవించవలసి ఉంటుంది. 

No comments:

Post a Comment