Friday, October 11, 2024

# పరమార్థం...

 🔱 అంతర్యామి 🔱

# పరమార్థం...

🍁అన్నింటికీ మనసే కారణం! మన ఆలోచనలకు, ప్రవర్తనకు, వ్యవహారానికి అన్నింటికీ అదే మూలం. మనసు చేసే మాయాజాలం అంతా ఇంతా కాదు. మనసు ప్రాథమిక లక్షణం చంచలిస్తూ ఉండటం. మనసే బంధ మోక్షాలకు కారణం. ఏదైనా మనం ఆశించిన మేరకే లభిస్తే మనసు సమాధానపడుతుంది. ఒకవేళ లభించింది... ఆశించిన దానికన్నా అధికంగా ఉంటే ఆనందిస్తుంది. మనసు బలహీనమైనదైతే, భ్రమలు బలంగా చుట్టుముడతాయి. ఆ స్థితిలో అల్పమైన విషయాలు ఉన్నతంగాను, క్షణికమైన ఆనందాలు శాశ్వతమైనవిగాను కనిపిస్తాయి. దృఢమైన ఆత్మవిశ్వాసం మనశ్శక్తి ద్వారానే వస్తుంది.

🍁మనసు అన్నీ తనకు తెలుసు అనుకుంటుoది కానీ ఆ తెలిసిన సంఘటనే జరిగితే అల్లకల్లోలమవుతుంది. మనసు దేనినైనా పట్టుకుందంటే ఇక, అశాంతి మొదలు. అదే వదలగలిగితే... విముక్తి. అదే ప్రశాంతి. మనసు ఎప్పుడూ మాట వినదు. వినేలా చేసుకోవడం మన చేతిలో ఉన్న పని. పరిపరివిధాలా పోతానని మనసు గోల చేస్తుంది. ఆలోచనలతో, ఆక్రోశాలతో సందడి చేస్తుంది. దానికి కళ్లెంవేసి కుదురుగా కూర్చోబెట్టే నైపుణ్యాన్ని ఎవరికి వారు దక్కించుకోవాలి. 

🍁అరిషడ్వర్గాల వికారాల వైపరీత్యం వల్ల వ్యక్తులు అశాంతికి గురవుతారు. మానసిక వ్యధకు లోనవుతారు. ద్వేషం వల్ల కంసుడు, కామం వల్ల కీచకుడు, అసూయతో దుర్యోధనుడు, మోహంతో రావణుడు, క్రోధంతో హిరణ్యకశిపుడు... ఇలా ఎందరో తమ జీవితాల్లో శాంతిని కోల్పోయి, దుర్మార్గులుగా మిగిలిపోయారు.

🍁మనిషి తనను తాను ఉద్దరించుకోవాలి! అందుకు నియమపూర్వకంగా ప్రయత్నించాలి. మనసును నిశ్చలంగా ఉంచడం, మనోభావాల్ని ఆలోచనా తరంగాల్ని పరిశుద్ధంగా ఉంచుకోగలగడం వల్ల శాంతి చేకూరుతుంది. చంచలమైన మనసును, నిశ్చలమైన బుద్ధిగా మార్చడానికి ఆత్మవిచారణ మార్గాన్ని అంటే- తనను తాను నిరంతరం తెలుసుకోగలగాలి. తాను చేపట్టిన చర్యల ఫలితాన్ని తానే అనుభవించాల్సి ఉంటుందనే ఎరుక కలిగి ఉండాలి. ఆ ఎరుకే జ్ఞానం. 

🍁ఆధునిక కాలంలో మనషుల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఈ మార్పు ప్రతికూల ధోరణులకు కారకమవుతోంది. మనుషుల మనసులన్నీ అశాంతికి నెలవులు అవుతున్నాయి. ఆ అశాంతి అవివేకానికి దారితీస్తోంది. ఆ అవివేకం అనర్ధాలను ప్రేరేపిస్తోంది. ఆ అనర్ధాలవల్ల జీవితాలన్నీ దుఃఖపూరితమవుతున్నాయి.

🍁ఇంతటి నష్టానికి కారణం- మనిషి తన మనసును సానుకూల భావతరంగిణివైపు మరలించకపోవడమే! వ్యతిరేక భావాల సంఘర్షణలో నేటితరం కొట్టుమిట్టాడుతోంది. ఆ వ్యతిరేకతను, ప్రతికూలతను వదిలించుకుని, ప్రతి వ్యక్తీ ఆత్మచైతన్యంతో పురోగమించాలి. నవ్య ఉషోదయాల్ని స్వాగతించాలి. మనసనే మందిరంలో దివ్యమైన పరంజ్యోతిని వెలిగించుకోవాలి. ఆ వెలుగు జీవితానికి స దిశానిర్దేశం చేస్తుంది. ఆనందపు మధురిమల్ని ఆవిష్కరిస్తుంది.🙏

-✍️ డాక్టర్ కావూరి రాజేశ పటేల్

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment