Tuesday, October 15, 2024

శ్రీ రమణీయం - 41, ఇంద్రియాల నియంత్రణతోనే ఆత్మశాంతి

 🌹 శ్రీ రమణీయం - 41 🌹
👌 ఇంద్రియాల నియంత్రణతోనే ఆత్మశాంతి👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ,
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

✳️ *కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం, నాలుక.... అనేవి ఐదు బాహ్యేంద్రియాలు. ఇవి మనకు రూపాన్ని, వాసనను, శబ్దాన్ని, స్పర్శను, రుచిని అందించే పరికరాలుగా ఉన్నాయి. మన శరీరానికి కష్టసుఖాలు, మనసుకు సంతోష, దుఃఖాలు కలిగేది ఈ ఇంద్రియాల వల్లనే. మనలోని ఆత్మ పరిపూర్ణ శాంతితోనే ఉంది. కానీ మన మనసు ఆ ఆత్మ శాంతిని పొందలేకపోతుంది. అందుకు కారణం ఇంద్రియాలు అందించే అనుభవాలు. అవే మనసు ఆత్మభావన నుండి దూరం చేసి శరీర భావనను కలిగిస్తున్నాయి. మనం నిద్రించేటప్పుడు ముందుగా బాహ్యేంద్రియాలు సద్దుమణిగి ఇంద్రియాల భావన (అంతరేంద్రి యాలు) మిగిలి ఉంటుంది. అదే కొంతసేపు స్వప్నంగా నిలిచి ఉంటుంది. ఆ తర్వాత గాఢనిద్రలో ఇంద్రియాలు పూర్తిగా అణిగి ఉంటాయి. అక్కడ ఏ భావనా లేని శాంతి స్థితి మాత్రమే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికీ అనుభవం లోనిదే. ఈ శాంతిని నిత్యజీవితంలో కూడా సాధించడమే ఆధ్యాత్మిక జీవనం.*

✳️ నిద్రలో సద్దుమణిగిన ఇంద్రియాలు నిత్యజీవితంలో తిరిగి విజృంభించటం వల్లనే ఆ శాంతి దూరం అవుతుంది. స్విచ్ ఆపిన టి.వి. అప్పటికి తన కార్యకలాపాలను ఆపినా మళ్లీ స్విచ్ వేస్తే తిరిగి తన పనులన్నింటినీ యధాతథంగా కొనసాగిస్తుంది. మన నిద్రకూడా అలాంటిదే. నిద్రలో ఇంద్రియాలు లేవు కనుక, నేను అనే భావన లేదు. కానీ అక్కడ మనం శాంతిగా ఆత్మస్వరూపంలో ఉన్నాం. మనలో శాంతిగా ఉన్న ఆత్మ భావనే అసలైన ‘నేను'. ఇంద్రియానుభవంతో మనకికలిగే శరీర భావనే దొంగ 'నేను'. మనకి ఆ లోపల ఉన్న అసలు 'నేను' తెలియకపోయినా బయట కనిపించే దొంగ 'నేను' తెలుస్తూనే ఉంది. మనకి తెలిసిన బయటి నేనుతో చేసే ఆధ్యాత్మిక సాధనతోనే తెలియని లోపలి నేను అనుభవంలోకి వస్తుంది.

✳️ మనప్రతి అనుభవానికి ఇంద్రియాలు కారణం. ఇంద్రియాలు లేని సుఖాన్ని, దుఃఖాన్ని మనం ఊహించలేము. శాంతిగా ఉన్న లోపలి నేను గురించి మనకి ఏ దిగులు లేదు. ఆ శాంతిని మనం అనుభవించకుండా చేస్తున్న ఇంద్రియాలే సమస్యగా ఉన్నాయి. కనుక ఇంద్రియాలనే జాగ్రత్తగా వాడుకోవాలి. దుఃఖం కలుగుతుంది బయటి నేనుకే. కనుక, పరిష్కారం కూడా దాని విషయంలోనే అవసరం. ఇంద్రియాలు ఏ అనుభవాన్ని అందించని నిద్రలో అసలు నేను తాలూకూ శాంతిని మనం అనుభవిస్తున్నాం. ఈ శాంతి మనకు నిరంతరం అందాలంటే ఇంద్రియాల పనులను ఆపాలి. 

✳️ జీవనంలో ఇంద్రియాలను పూర్తిగా ఆపటం ఎవరికీ సాధ్యం కాదు. కనుక, వాటి కార్యకలాపాలను వీలైనంతగా తగ్గిస్తే మనలోని శాంతి క్రమేణా వ్యక్తమౌతుంది. అంటే అనవసర విషయాల్లో ఇంద్రియాల వ్యాపారం, వ్యాపకం తగ్గిస్తే సరిపోతుంది. ఆత్మానుభవం జరగాలన్నా, దైవదర్శనం కావాలన్నా మనం ఇంద్రియాల ద్వారా జరిగే పనులను నియంత్రించాలి. ఆధ్యాత్మికత వైపు ఇష్టం బలపడితే మన మనసు తెలియకుండానే ఇంద్రియ వ్యాపారం తగ్గించు కుంటుంది. ఆ స్థితి కలిగే వరకూ మనమే ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాల పనులను నియంత్రించుకోవాలి.

✳️ ఇంద్రియాలను నియంత్రించుకోవాలంటే మనకు ఏది అవసరమో, ఏది అనవసరమో గుర్తించి, మసలుకునే వివేకం కావాలి. అంటే మన బుద్ధి సక్రమంగా పనిచేయాలి. నిజానికి ఆత్మానుభవం బుద్ధిస్థాయికి మించిందే అయినా ఆ బుద్ధిని బుద్ధి కుశలతతోనే దాటగలం. కనుక బుద్ధిని బాగుచేసుకోవడం చాలా ముఖ్యం. బుద్ధి అంటే మంచి చెడుల వివేచన. అది కలిగిన రోజు చెడును వదిలి మంచిని మాత్రమే స్వీకరించగలుగుతాము. 

✳️ మనకి ఆత్మ గురించి ఏ జాగ్రత్తలూ అవసరం లేదు. కానీ ఆ ఆత్మ తెలియాలంటే బుద్ధి విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన సచ్ఛీలమంతా బుద్ధిపైనే ఆధారపడి ఉంది. ఇంద్రియాల ద్వారా ఏ చెడు జరక్కూడదన్న సూచననే మన పెద్దలు చెడుఅనకు, చెడుకనకు, చెడువినకు, చెడు తినకు, చెడునుఆనకు (అంటుకోకు) అనిచెప్పారు. మనం మనకి అసాధ్యమైన విషయాల్లో దేవుడ్ని, గురువుని ఆశ్రయిస్తాము. అలానే మంచి బుద్ధిని ప్రసాదించమని అడుగుతూ ఉంటాం. గురువైనా సరేనేరుగా మన బుద్ధిని మార్చరు. బుద్ధిని మార్చుకునేందుకు మనం చేసే దుర్గుణాల విషయంలో కూడా అంత దూరంగా ఉండాలి. ఉదయం నిద్రలేచేటప్పుడే మన బలహీనతలు దాటాలన్న దృఢ సంకల్పంతో ఉండాలి. శాంతి జీవనానికైనా, ఆత్మ దర్శనానికైనా సుగుణమే అవసరం. *మితమైన ఆలోచనలు, మంచి తలపులు మనశ్శాంతిని ఇస్తాయి.* మనసుని కలుషితం చేసే క్రియల జోలికి వెళ్లకూడదు. అందుకు తరుణోపాయమే భగవన్నామస్మరణం, నామజపం చేస్తున్నప్పుడు మన వ్యాపకాలు తగ్గటం వల్ల మనకి శాంతి కలుగుతుంది. అదే రకంగా వ్యాపకాలను తగ్గించి నిత్యజీవితంలో శాంతిని కొనసాగించాలి.

✳️ భక్తుని పారవశ్యానికి ప్రతిఫలంగా రూపంతో దర్శనమిచ్చే దైవం ఆత్మాన్వేషికి అణువు అణువులో కనిపిస్తాడు. భగవంతుడ్ని తత్వరూపంలో దర్శించే జ్ఞానాభిలాషికి జరిగే ప్రతి క్రియలోనూ, ఆ క్రియ ఫలంగా జరిగే 'ప్రతిక్రియ’ (ఫలం) లోనూ దైవమే ఉన్నాడని తెలుస్తుంది. దైవం ఈ సృష్టి అంతటా అన్ని పనులుగా, ఆ పనులకు లభించే ఫలం గానూ ఉన్నాడు. అందుకే మనకి అనుకూలమైన 'ఫలాల కోసం దైవాన్ని ప్రార్థిస్తాము.

మన క్రియకు జరిగే ప్రతిక్రియే (రియాక్షన్) అనుభవాన్నిస్తుంది. ప్రతిక్రియ దైవమే కనుక ప్రతీ అనుభవము దైవమే. ఉప్పు తింటే బి.పి. పెరగటం, మందువాడగానే బి.పి. తగ్గటం అనే రెండు ప్రతిక్రియల్లోనూ దాగి ఉన్నది దైవమే. మన గుండె స్పందన మనకి తెలుస్తుంది గానీ మన కాలేయం ఉనికి మనకి తెలియదు. అయినా కాలేయం ద్వారా మనలో ఎంతో పని జరుగుతూనే ఉంది. ఈ విధంగా మనలో తెలిసినవి, తెలియనివి అనేక క్రియలు దైవానికి ప్రతిరూపంగా జరుగుతున్నాయి. ఆ దైవాన్ని దర్శించే సూక్ష్మదృష్టిని సాధించడమే సాధనలో పరమార్థం.

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment