Thursday, October 10, 2024

 *ఆత్రేయగీత*

మొదటి భాగం

అధ్యాయము - 9

"భగవంతుని విభూతి"

ప్రతీ జడజీవ పదార్ధము పరమాత్మ స్వరూపమే, అందులో ఎటువంటి సంశయము లేదు.

మనం చూసే ప్రతి జడజీవపదార్ధము ఒక ప్రత్యేకతను సంతరించుకొంది. దాన్నే విభూతి అంటారు!

మామిడిపండులో తియ్యదనం, నిమ్మకాయలో పులుపుదనం, నీళ్లలో జీవశక్తి, పాలలో పౌష్టికశక్తి, పువ్వుల్లో అందం, ఇనుములో గట్టిదనం, తైలములో మండెగుణం,
విప్పపువ్వులో మత్తెకించేగుణం, సింహంలో ధైర్యం, ఏనుగులో బలం, ఉడుముకి పట్టుగుణం, జలగకు పీల్చేగుణం, చేపలకు ఈదేగుణం, పక్షులకు ఎగిరేగుణం, మనిషికి సంపూర్ణ జ్ఞానం  ఇలా ఎన్నో ఎన్నెన్నో చెప్పుకోవచ్చు.

ప్రతి పదార్ధం ఇంకొక పదార్థంతో ఏదోయొకవిధంగా ఒక క్రియాశీలక సంబంధం కలిగివుంటుంది. వీటి సంపర్కం మూలంగా ఒక క్రొత్త శక్తి ఉదవీస్తుంది. వీటికి ఆ గుణం
ఎలా వచ్చింది?

బాగా ఆలోచిస్తే ఎదో కనబడని చైతన్యం వీటన్నిటిలో అంతర్లీనంగా వుందన్న విషయం బోధపడుతుంది. ఇలా అన్ని జడజీవవస్తువులలో వ్యాపించివున్న చైతన్యాన్నే మనం పరమాత్మ విభూతిగా ఆరాధించడం జరుగుతోంది.

ఎలాగైతే ఫొటోతో కూడిన Passport, Aadhaar Card, PAN Card ఆ వ్యక్తిని REPRESENT చేస్తున్నాయో, అలాగే తమలో నున్న చైతన్యాన్ని ఆయా పదార్థాలు పరమాత్మ స్వరూపంగా REPRESENT చేస్తున్నాయి.

అలాంటి పరమాత్మ విభూతిని అన్నిటియందు గుర్తించడమే మనుజుల జ్ఞానానికి నిదర్శనం. అలానే తనలో కూడా నెలకొనియున్న పరమాత్మను గ్రహించడం జీవుని విజ్ఞానానికి నిదర్శనం.

విశ్వమంతా అతని సృష్టే అని భావించినప్పుడు, సృష్టిలోని ప్రతివస్తువు అతని అంశమే అని భావించి, ఆరాధించడంలో ఎంతో మాధుర్యం వుంది. ఆ మాధుర్యాన్ని మనసారా గ్రోలినప్పుడే ఆ విశ్వచైతన్యం మనకు గోచరమౌతుంది.

మనం దానిని అనుభవపూర్వకముగా గ్రహించాలి. అనుభవం లేని జ్ఞానం అజ్ఞానంతో సమానం కదా!

అంతేగాని పరమాత్మ ఎక్కడో, ఎవ్వరికి అంతుచిక్కని ప్రదేశంలో వున్నాడని, ఎవ్వరికి అతడు కనిపించడని, అతని దర్శనం దుర్లభమని, ఏ జడజీవపదార్ధం అతని స్వరూపం కాదని, అనుకుంటూ పొతే అది అజ్ఞానానికి నిదర్శనమే‌ అవుతుంది.

అన్నింటిని వాడుకుంటూ, వాటి శక్తిని గుర్తించకపోవడం, జీవుడు చేస్తున్న అన్యాయమే అవుతుంది. ఇటువంటి సాధనకు ప్రధానమైనది జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనుజులకు పరిపూర్ణంగా ప్రసాదించేడు పరమాత్మ. ఇక మనదే ఆలస్యం.

విగ్రహరూపంలో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నా, క్రమక్రమంగా పరమాత్మను అన్నిచోట్లా, అన్నిటియందు, అణువణువునా దర్శించే స్థితికి చేరుకోవాలి.

అంటే పువ్వునుండి కాయగా, కాయనుండి పండుగా మారే ప్రయత్నం చేయాలి.

అందుకు కావలసిన జ్ఞానాన్ని పరమాత్మ ప్రసాదిస్తాడు. ఇందులో సంశయంలేదు.    

No comments:

Post a Comment