Friday, July 15, 2022

అన్యాయంగా సంపాదించింది ఏమవుతుంది? వీరు కర్మ సాక్షులు, బుద్ధిః కర్మానుసారిణి

 🪷🪷 "39" 🪷🪷

🪷🪷 "కర్మ - జన్మ" 🪷🪷🪷


"అన్యాయంగా సంపాదించింది ఏమవుతుంది?"

"అన్యాయో ఆర్జితం ద్రవ్యం దశవర్షాణి తిష్ఠతి
ప్రాప్తే తు ఏకాదశే వర్షే సమూలంచ వినశ్యతి"
-- వృద్ధ చాణుక్యుడు

భావం:-

"అన్యాయంగా సంపాదించిన సొమ్ము పదేళ్ళుంటుంది. అలా వచ్చిన సొమ్ము సమూలంగా, అంటే మన దగ్గర వున్న న్యాయార్జిత సొమ్ముతో సహా, పదకొండేళ్ళకి పోతుంది".

వీరు కర్మ సాక్షులు

'నువ్వు చేసేది ఎప్పటికీ ఇతరులకి తెలీదన్న హామీ ఉంటే, అప్పుడు నువు ఏం చేస్తావన్నదాన్ని బట్టి నీ కేరక్టర్ ఏమిటో చెప్పచ్చు' అని ఓ మహానుభావుడు అన్నాడు."

"ఎవరయినా చెడు పనులు చేసేది ఏ ఒక్కరికీ తెలిసే అవకాశం లేదనుకున్నప్పుడే. ఈ విషయంలో చాలామంది అంచనాలు కరెక్ట్ అయి, వారు చేసే దుర్మార్గాలు ఎప్పటికీ ఎవరికీ తెలీకుండా గుప్తంగానే ఉండిపోతాయి."

"కాని కొందరి అంచనాలు తారుమారై, అవి బయట పడుతూంటాయి. అలాంటి వారే సస్పెండ్ అయేది, జైలుకి వెళ్ళేది, టి.విల్లో చూపబడి పరువు పోగొట్టుకొనేది."

"అయితే సాటి మానవుడికి తెలీకుండా ఎంతో జాగ్రత్తగా, నైపుణ్యంతో అధర్మం చేసినా, అది ఎవరికీ తెలీకుండా ఉంటుందనుకోవడం అజ్ఞానం."

"మనం చేసే ప్రతీ అధర్మపు పనిని గమనించి తెలుసుకునేవారు వున్నారు. కనుక వాటి ఫలం మనం తప్పనిసరిగా అనుభవించే శ్రద్దని వారు తీసుకుంటారు అని మనం గుర్తుంచుకుంటే, మన ప్రవర్తనా సరళి సజావుగా ఉంటుంది."

"వృక్షాల విషయంలో, వున్న భూమాత, సూర్యుడు సాక్షులు. ఇలాగే మనుష్యుల కర్మ విషయంలో పరమాత్ముడు కేవలం సాక్షిగా వుండి వారి వారి కర్మ ఫలాలని తగిన సమయానికి ఇస్తున్నాడు."

"ఈ ప్రపంచంలో ఎంత మారు మూలయినా, ఎంత చీకట్లోనైనా అక్రమాలు, అన్యాయాలు, అధర్మాలు, నేరాలు, దోషాలు చేసే వాళ్ళని చూసే దైవ సాక్షులు చాలామందే ఉన్నారు అని భాగవతంలో వ్యాస మహర్షి ఇలా చెప్పాడు."

llశ్లోll
"సూర్యోగ్నిఃఖం మరుద్దేవః సోమః సన్ధ్యాహనీ దిశః !
కం కుః స్వయం ధర్మ ఇతి హ్యేతే దైహ్యస్య సాక్షిణః ||
-- భాగవతం

భావం:-

"మనలోని అంతరాత్మ, ఇంకా సూర్యుడు, అగ్ని, ఆకాశం, గాలి, చంద్రుడు, ఇరు సంధ్యలు, అన్ని దిక్కులు, జలం, భూమి, ధర్మం... ఇవన్నీ మానవుడు చేసే ప్రతీ కర్మకీ సాక్షులుగా నిలుస్తాయి."

"వివేక చూడామణిలో కూడా 507వ శ్లోకంలో కూడా ఓ విషయంలో కర్మలకి సాక్షి సూర్యుడు అని ఓ ఉపమానంగా ఆదిశంకరుల వారు ఈ క్రింది శ్లోకాన్ని చెప్పారు."

"రవే య్రథా కర్మణి సాక్షిభావో
వహ్నే ర్జథావాయసి దాహకత్వమ్..."

భావం:-

"సూర్యుడికి కర్మలందు సాక్షిభావం ఎలా కలదో, అగ్నికి ఇనుప లోహంనందు దహన శక్తి ఎలా కలదో..."

"పైవి మతపరమైనవి. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే నిజానికి మనం దేవుడు అని పిలిచే విశ్వ చైతన్యం సృష్టి అంతటా లీనమై ఉంది కాబట్టి అది మన కర్మలని సదా చూస్తుంది, గుర్తుంచుకుంటుంది, వాటికి ఫలితాలని ఇస్తుంది."

"ఈ కర్మ సాక్షులంతా నిజానికి ఆ విశ్వ చైతన్యం రూపాలే. వేదాంత దృష్టి లేని సామాన్యులకి అర్ధం అవడానికి మతపరంగా ఇలా కర్మ సాక్షులుగా ఋషులు వాళ్ళని పేర్కొని ఉంటారు."

"అంతేకాని వారే కర్మ సాక్షులు అని భావించడం వేదాంతపరంగా మూఢనమ్మకం అవుతుంది. మన హృదయంలోనే ఉన్న పరమాత్మ నిజమైన కర్మ సాక్షి. మన మనసుల్లోని ఆలోచనలని, మనం పని చేసేప్పుడు అది ఏ భావంతో చేస్తున్నాం అన్నది ఆయనకి తక్షణం తెలిసిపోతూంటుంది. అయనే పరమ సాక్షి."

బుద్ధిః కర్మానుసారిణి

"అలిరనుసరతి పరిమళం లక్ష్మీరనుసరతి నయన నిపుణమ్
నిమ్న మనుసరతి సలిలం విధిలిఖితం బుద్ధిరనుసరతి"

భావం:-

"తుమ్మెద పరిమళాన్ని అనుసరిస్తుంది. నైపుణ్యం గలవాడ్ని లక్ష్మీదేవి వరిస్తుంది. నీరు పల్లాన్ని అనుసరిస్తుంది. బుద్ధి విధి లిఖితాన్ని అనుసరిస్తుంది."

"మనం అనుభవించాల్సిన ప్రారబ్ధ కర్మ వైపే మనం కదులుతాం. దీన్నే 'బుద్ధిః కర్మానుసారిణి' అంటూంటాం. ప్రారబ్ద కర్మ మనల్ని మన ఫలం వైపే నడిపిస్తుంది. మనకి కర్మ ఫలం లేకపోతే అటువైపు వెళ్ళకుండా మన కర్మే మనల్ని ఆపుతుంది."

"2008లో ఆంధ్రప్రదేశ్ లో గౌతమి ఎక్స్ ప్రెస్ లోని కొన్ని పెట్టెల్లో అనేకమంది కాలి బూడిదై మరణించారు. కాని ఎస్ సెవెన్ లోని డెబ్బై ఆరో బెర్త్ నంబర్ అతనికి రిజర్వేషన్ ఉన్నా, హైద్రాబాద్ లోని ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని టైంకి వెళ్ళి రైలుని పట్టుకోలేక పోయాడు."

"అక్కడ రైలు ఎక్కే ప్రయత్నం ఉన్నా ప్రకృతి అతనికి అడ్డు పడింది. ఎందుకంటే అతనికి అందులో మరణించే ప్రారబ్ధ కర్మ లేదు. ఆ కర్మ ఉన్నవారు రిజర్వేషన్ లేకుండానే ఆ రిజర్వ్ డ్ డబ్బాల్లోకి ఎక్కి అనామకంగా మరణించారు."

"ఇంకో ఉదాహరణ. బాంబేలో 2008 చివర్లో తాజ్ హోటల్ ని పాకిస్థాన్ టెర్రరిస్టులు ఆక్రమించి మారణ హోమం చేసిన రాత్రి, ఈ గొడవ వల్ల హైద్రాబాద్ కి ఎక్కాల్సిన రైలు తప్పిపోయిన ఒకతను, తన సోదరి ఇంటికి టేక్సీలో వెళ్తూ టెర్రరిస్టుల కాల్పులకి మరణించాడు. అతని కర్మ అతన్ని ముందు ఆ రైలుకి టిక్కెట్ ని రిజర్వ్ చేసుకునేలా చేసింది."

"తర్వాత రైలు తప్పిపోయేలా చేసి, సోదరి ఇంటికి వెళ్ళే ఆలోచనని చేయించింది. దారిలో టెర్రరిస్ట్ లు కాల్పులు జరిపేప్పుడు అతనెక్కిన టేక్సీ అక్కడ ఉండేలా చేయడమే కాక, అతని ప్రారబ్ద కర్మ అది వాళ్ళ కళ్ళబడేలా చేసింది. మనుషులతో కర్మని తను ఎలా చేయిస్తాడో పరమాత్మ భగవద్గీతలో ఇలా చెప్పాడు."

"స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశ్వో తత్"
‌‌-- గీత 18-60

భావం:-

"ఓ కౌంతేయా! మోహంతో నువ్వు చేయడానికి ఇష్టపడని కర్మని కూడా, పూర్వం నువ్వు చేసిన కర్మల బలంతో బంధింపబడి, ఆ ప్రభావంతో తప్పక చేస్తావు."

"ఈశ్వరః సర్వభూతానాం హృద్ధేశేర్జున తిష్ఠతి
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా"
-- గీత 18-61

భావం:-
"అర్జునా! శరీరరూప యంత్రాలని అధిరోహించి సర్వప్రాణుల హృదయాల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన మాయతో వారి వారి కర్మలని అనుసరించి వారిని భ్రమింపచేస్తున్నాడు."

"ప్రవర్తయతి తత్కర్మ పరిపాకక్రమం విదన్: ఎవరి కర్మ పరిపాకాన్ని అనుసరించి వారు ఆ ప్రకారం ప్రవర్తిస్తారు."

🌼🕉🌼

No comments:

Post a Comment