Friday, July 15, 2022

పెళ్ళిళ్ళయితే చేస్తారు కానీ కాపురాలు చేయించలేరు కదా! గుర్రాన్ని చెరువు దగ్గరకి తీసుకెళ్ళ గలం కానీ దాని చేత నీళ్ళు తాగించలేం" అన్నట్టు...

 "గుర్రాన్ని చెరువు దగ్గరకి తీసుకెళ్ళచ్చు.." 


పద్మావతి, మరదలు వనజ బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఉన్నట్టుండి..


"వదినా...మా అన్నయ్య పక్కింటి  వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఐటి రంగంలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. చూడటానికి బావుంటాడు కానీ కాస్త వయసు ఎక్కువగా కనిపిస్తాడు. సంబంధం కావాలని...తెలిసిన వారందరినీ వాకబు చేస్తున్నారుట. మొన్న నేనెళ్ళినప్పుడు నన్ను కూడా అడిగింది ఆవిడ.  నీకైతే పరిచయాలు ఎక్కువ కదా అని నీ చెవిన కూడా వేస్తున్నాను ..." అంది. 


"వాళ్ళ అబ్బాయి వివరాలు చెప్పమని అడిగా...'ఇంతకు ముందు పెళ్ళి అయింది. ఎందుకో ఇద్దరికీ శృతి  కలవలేదు. విడిపోయారు.  ఏదైనా రెండో పెళ్ళి సంబంధం అయినా సరే ఉంటే చూడమని చెప్పింది" అన్నది వనజ. 


@@@@


ఇప్పటికి పాతికేళ్ళ క్రితం సంగతి ఇది. 'లివింగ్ టుగెదర్'అనే పాశ్చాత్య సంస్కృతి ఇంకా మన దేశంలో కాలు పెట్టలేదు. 


అందుకని కొడుకుకి మళ్ళీ పెళ్ళి చేసే ప్రయత్నాల్లో పడింది పాపం ఆ పిచ్చి తల్లి! 


వనజ చెప్పిన వివరాలని బట్టి....ఆవిడ... తన కూతురు లహరి 'ఐటి' కాకుండా మెకానికల్ ఇంజనీరింగ్ చదివిందని తమ సంబంధాన్ని వదులుకున్న మైథిలి అని అర్ధమయింది పద్మావతికి. 


వెంటనే ఆరేళ్ళ క్రితం జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది... 


@@@@


కూతురుకి పెళ్ళి సంబంధాల గురించి కనుక్కోవటానికి బ్యూరోకి వెళ్ళింది పద్మావతి. 


పెళ్ళి సంబంధాల కోసం బ్యూరో కి వెళ్ళాలంటే అదొక పెద్ద ప్రహసనం! 


పొద్దున్నే ఇంటెడు చాకిరీ తెముల్చుకుని...అత్తమామలకి కావలసినవి వండి వార్చి..పనివారితో పనులు చేయించి..పతి దేవుల అవసరాలు..అలకలు తీర్చి...ఆజ్ఞలు పాటించి పదయ్యేసరికి బయలుదేరితేనే కానీ పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యూరోకి చేరుకోలేదు! వాళ్ళు పన్నెండయ్యేసరికల్లా మూసేస్తారు. 


గోత్రాలని బట్టి...చదువులని బట్టి..అంటే డాక్టర్స్ కి, ఇంజనీర్లకి, ఈ రెండూ కాని వారికి...బ్యాంక్ ఉద్యోగులకి...లెక్చరర్లకి..ప్రభుత్వోద్యోగులకి..ఇలా వేరే వేరే ఫైల్స్ పెడతారు.  వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫైల్స్ దొరికించుకుని వాటి మీద పరిశోధన చేస్తూ ఉంటారు. 


అప్పట్లో వివాహాలు కుదిర్చే వేదికలు బ్యూరోలే! ఇంట్లోనే కాలు చాపుకుని కూర్చుని..నచ్చిన వరుడినో, పెళ్ళికూతురినో వెతుక్కునే సౌకర్యం ఉన్న అంతర్జాల మాయాజాలాలు ఇంకా అడుగుపెట్టలేదు! 


ఈ నేపధ్యంలో పద్మావతి వెళ్ళేసరికే మూడొంతుల ఫైల్స్ ర్యాకులల్లో కాకుండా ఎవరో ఒకరి చేతుల్లోనో, ఒళ్ళోనో ఉంటాయి. 


పదయ్యేసరికి ఆదరా బాదరాగా నోట్లో ఏదో ఒకటి పడేసుకుని కారెక్కింది పద్మావతి. 


@@@@


అసలే ఆలస్యమయిందని కంగారుగా ఫైల్స్ తిరగేస్తుండగా అన్ని విధాల లహరికి సరిపోయిన ప్రొఫైల్ ఒకటి కనిపిస్తే డైరీలో రాసుకుంది. 


ఇది గమనించిన ఆ సంస్థ నిర్వాహకురాలు..."ఏమండీ మీరు నోట్ చేసుకుంటున్న ప్రొఫైల్ తాలూకు అబ్బాయి తల్లి  వీరేనండి. డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు" అని పరిచయం చేసింది. 


లహరి వివరాలు చెప్పి.."మా అమ్మాయి సన్నగా..నాజూగ్గా, తెల్లగా, పొడుగ్గా  ఉంటుందండి. ప్రస్తుతం అమెరికాలో ఎమ్మెస్ చేస్తోందండి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు" అనడిగింది. 


పద్మావతిని ఎగాదిగా చూసి..ఇంటి పేరు, గోత్రం, తల్లిదండ్రులు-అక్క చెల్లెళ్ళు.. ఇత్యాది వివరాల జోలికి వెళ్ళకుండా డైరెక్ట్ గా .."ఇంతకీ ఇంజనీరింగులో మీ అమ్మాయి సబ్జక్ట్ ఏమిటి" అన్నది అసహనంగా! 


అప్పటికి ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాని చదువులు...అంటే బియ్యేలు, సియ్యేలు, బికాం లు విస్తారంగానే చదువుతున్నారు. ఇంజనీరింగు చదువు అంత కామనేం కాదు. అది చదివిన ఆడ పిల్లలని తెలివైన వారుగా ...ఓ మెట్టు పైనే చూసే రోజులు! 


అందులోనూ లహరి కాలేజి ఫస్ట్! 


మగపిల్లవాడి తల్లి ఇచ్చిన భావప్రకటనకి, ఆమె ధోరణికి కంగు తిన్న పద్మావతి  "అదేంటండి అలా అడిగారు? మా అమ్మాయి ప్రీమియర్ కాలేజిలో ఇంజనీరింగ్ చదివింది. మెరిట్ స్టూడెంట్! కాలేజి ఫస్ట్" అన్నది కాస్త గర్వంగా మొహం పెట్టి. 


"అది సరే! మీ అమ్మాయిది ఏ సబ్జక్ట్" అన్నది మళ్ళీ అదే ధోరణిలో! 


"మెకానికల్" అన్నది పద్మావతి అదే ఆత్మ విశ్వాసంతో! 


"ఎబ్బే లాభం లేదండి... మా వాడు ఐటి. మీ సంబంధం మాకు కుదరదు" అన్నది 

నేను మగపిల్లవాడి తల్లిని అనే ఆధిక్యతని మాటలో వ్యక్తపరుస్తూ! 


"అంటే మీకు పిల్ల రూపు రేఖలు, కుటుంబ నేపధ్యం, సంప్రదాయం, పిల్ల తెలివితేటలు, గోత్రం, జాతక పొంతన..ఇవేవీ ముఖ్యం కాదా? కేవలం చదువు అడిగి వద్దంటున్నారేంటి" అంది అమాయకంగా! 


పద్మావతిని చూసి ఏమనుకుందో ఆవిడ... "అమెరికాలో ఐటి వారు ఉద్యోగం చేసే చోట మెకానికల్, సివిల్, కెమికల్ వాళ్ళకి ఉద్యోగాలు రావండి. ఇంతంత చదువులు చదువుకుని ఖాళీగా ఉండమంటే ఉండలేరు. అమెరికా లో కెమికల్, ఎలెక్ట్రికల్, మెకానికల్, సివిల్ వాళ్ళకి భౌగోళికంగా విభజించబడిన పద్ధతిలో ఒక్కొక్క సబ్జక్ట్ వాళ్ళకి ఒక్కో రాష్ట్రంలో..ఒక్కొక్క ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంబంధాలు అందుకు తగినట్టు వెతుక్కుంటే  వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ కలిసి హాయిగా బ్రతుకుతారు" అని జీవన సారాన్ని  టూకీగా చెప్పింది. 


"ఓహో పెళ్ళి సంబంధం వెతకటమంటే ఇన్ని తిప్పలా" అనుకుంది స్వగతంగా! 


@@@@


ఒకే చదువు అయి ఉండాలి..ఒడ్డూ పొడుగూ సరిపోవాలి..నాలుగేళ్ళే వయసు తేడా ఉండాలి... జాతకాలు కలవాలి..కుటుంబ హోదాలు సరిపోవాలి (ఈ మొత్తం ప్రక్రియలో అంతంత చదువులు చదువుకున్న పిల్లా పిల్లవాడి టెంపర్మెంట్స్ మ్యాచ్ అవ్వటం అనే విషయానికి ప్రాముఖ్యతే లేదు)... ప్యాకేజిలు సరిపోవాలి...ఇలా అనేక 'గండాలు గడిచి పిండం బయటపడ్డాక' చేసే పెళ్ళిళ్ళు పెద్దల అలసటన్నా తీరక ముందే పెటాకులవుతుంటే... పిల్లలకేం కావాలో పెద్దలకి ఎలా అర్ధం అవుతుంది? అసలు పెళ్ళి చేసుకుంటున్న వాళ్ళకన్నా తెలుసా? 


ఒకే చోట ఉద్యోగాలు చేసుకుంటూ కలిసి బతకచ్చు అన్న ఆవిడ సిద్ధాంతం ఏమయిందో అనుకుంది పద్మావతి, వనజ చెప్పిన మాట విన్నాక! 


కలిసి బతకటానికి కారణాలు వెతుక్కోవలసిన పిల్లలు, విడిపోవటానికి సాకులు వెతుక్కుంటుంటే...పెళ్ళి అనే దానికి అర్ధం ఏమిటి? 


ఒకప్పుడు పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధం. 


ఆకలి, దప్పికల లాగా ఒక ప్రాకృతిక అవసరం. 


ఆరోగ్యకరమైన కుటుంబాన్నిచ్చే వనరు! 


ఒక సామాజిక బాధ్యత! 


అలాంటి 'పెళ్ళి' ని  ఒక బొమ్మలాటలాగా తీసుకుంటున్న నేటి తరం డబ్బు...అహం..కెరియర్ కి తప్ప మానవ సంబంధం అనే ముఖ్యమైన కోణాన్ని విస్మరిస్తున్నది. 


ఒక చోట సామరస్యంగా కలిసి బతకటానికి కావలసింది ఒకే రకమైన చదువా? సంపాదనా? డబ్బా? 


ఒకరి మీద ఒకరికి ఆధిక్యమా? 


ఒకరి పట్ల ఒకరికి గౌరవమా? 


సర్దుబాటు తత్వమా? ఇవేవి కావా? ఏమో...ఆలోచిస్తున్నది పద్మావతి. 


వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పద్మావతి స్నేహితురాలు మంజరి ఫోన్ చేసింది. 


"ఏంటే చాలా రోజులయింది నువ్వు ఫోన్ చేసి! ..ఎక్కడున్నావ్? ఇండియానా..అమెరికానా" అన్నది పద్మావతి. 


"వారం అయింది అమెరికా నించి వచ్చి. మా మనవడికి సెలవులంటే ఒక నెల అక్కడే ఉండిపోయాను. రేపు కలుద్దామా" అన్నది. 


@@@@


పద్మావతి భర్త అన్ని మాటల్లోను తలదూర్చి ముందు, వెనక వినకుండా ఏదో ఒక సలహా ఇచ్చేస్తూ ఉంటాడు. అందుకే ఇంట్లో అయితే ప్రశాంతంగా మాట్లాడుకోవటానికి ఉండదని...స్నేహితురాళ్ళు ఎప్పుడు కలిసినా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవటానికి హోటల్ కి వెళ్ళటానికి ఇష్టపడతారు. 


అలా మినర్వా హోటల్ కి వెళ్ళి ఒక మూలగా కూర్చున్నారు స్నేహితురాళ్ళిద్దరు. "ఆ:( ఇప్పుడు చెప్పు ఏంటి అమెరికా విశేషాలు. మీ ఇంటి విశేషాలు. మీ వారెలా ఉన్నారు" అన్నది మంజరితో పద్మావతి మిరపకాయ బజ్జీలకి ఆర్డర్ ఇచ్చి! 


"ఆ:( ఏమున్నాయే...ఈ మధ్య ఎక్కడ చూసినా లక్షలు..కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకోవటం..నాలుగు నెలలు తిరగకుండా విడిపోవటం! ఇదేదో బొమ్మలాట లాగా ఉన్నది ఈ కాలం పిల్లలకి" అన్నది. 


"మా పిన్ని కూతురు రమ సంగీతం పాడుతుంది.. నీకు తెలుసుకదా! తను ప్రొఫెషనల్ గాయని. తన సంగీతాన్ని గౌరవిస్తాడని, ఇటి బాధ్యతలు పంచుకుని తన సాధనకి సహకరించి కచేరీలకి తనని ప్రోత్సహిస్తాడని... ఏరి కోరి సెంట్రల్ యూనివర్సిటీ లో మ్యూజిక్ ప్రొఫెసర్ ని పెళ్ళి చేసుకుంది. నాలుగైదేళ్ళు బాగానే ఉన్నారు. ఏమయిందో తెలియదు..ఈ మధ్యనే విడిపోయారు."


"నువ్వన్నది నిజమే!  మన స్కూల్ మేట్ నళిని గుర్తుందిగా. అది లాయర్. ఒకే వృత్తిలో ఉండే వాళ్ళయితే స్పర్ధలు, ఘర్షణలు ఉండవని హై కోర్ట్ లో తనతో పాటే ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ ని ఏరి కోరి ప్రేమించి పెళ్ళాడింది."


"చాలా కాలం తరువాత ఈ మధ్య మా మరిది కూతురి పెళ్ళిలో అనుకోకుండా కలిసింది. వాళ్ళాయన్ని గురించి అడిగితే..'విడిపోయాం..ఇప్పుడు అతనితో కలిసి ఉండట్లేదు' అని చెప్పింది."


"ఈ విడాకులేంటో.. ఈ జీవితాలేంటో అస్సలు అర్ధం కావట్లేదే! భగవంతుడి దయ వల్ల మా ఇంట్లో ఆ సమస్య రాలేదు కానీ ఇవన్నీ చూస్తుంటే మన పిల్లలు ఏం చేస్తారో అని భయమేస్తోంది" అన్నది మంజరి. 


"అవునే...ఇప్పుడు ఉన్న చదువులు విలువలు, వ్యక్తిత్వాలని పెంచట్లేదు. సంపాదనలతో వస్తున్న ఆర్ధిక స్వాతంత్ర్యం మనుషుల్లో సర్దుబాటు ధోరణిని చంపేస్తున్నదేమో అనిపిస్తోంది" అన్నది పద్మావతి సాలోచనగా! 


"ఒకేరకం చదువులైతే అమెరికా లాంటి దేశాల్లో ఇద్దరికీ ఒకే చోట మంచి ఉద్యోగాలొస్తాయని, కలిసి హాయిగా బతుకుతారని ఆలోచించే వారు. అలా సంబంధాలు వెతికిన మాకు తెలిసిన వారి అబ్బాయి కూడా ఇప్పుడు రెండో పెళ్ళి కోసం వెతుకుతున్న పెళ్ళి కొడుకుల్లో ఉన్నాడు!"


"కలిసి బతకటానికి కావలసింది..భర్త మాటని భార్య గౌరవించటం...భార్య ఆలోచనలని భర్త ఆమోదించటం!"


"తమ వృత్తి, వ్యాపకం, కళలు, తమ ప్రత్యేక రంగం పట్ల గౌరవం...ఆసక్తి కలిగి తమని ప్రోత్సహిస్తారని ఏరి కోరి..బోలెడంత శ్రమ పడి..తల్లిదండ్రులని శ్రమ పెట్టి, లక్షలకి లక్షలు ఖర్చు పెట్టి  సంబంధాలు వెతుక్కుని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ పట్టుమని రెండు మూడేళ్ళు కలిసి బతకట్లేదు."


"ఎన్నేళ్ళు కలిసి బతికినా... కాపురం చేసినా..ఒకరికొకరు నూటికి నూరు శాతం ఎప్పుడు అర్ధం కారు. అలా అని ఇక విడిపోవటమేనా పరిష్కారం!"


"అర్ధం కాకపోవటం అనేది భార్యా భర్తల మధ్యనే కానక్కరలేదు...ఆ సమస్య తల్లీ పిల్లల మధ్యనా ఉంటుంది. స్నేహితుల మధ్యనా ఉంటుంది."


"ఏదయినా క్లిష్ట పరిస్థితి వస్తే తప్ప ఆ విషయం లో ఆ వ్యక్తి  మనస్తత్వం ఏమిటో తెలియదు. ప్రతి మనిషిలోను అంతర్లీనంగా మరో మనిషి ఉంటాడుట. సందర్భం వస్తే కానీ బయటపడడు అని పెద్దలు చెబుతారు!"


"అలాంటిది.. నాలుగు నెలల్లో...ఆ మాటకొస్తే రెండేళ్ళల్లో  మాత్రం ఒక మనిషి గురించి ఏం తెలుస్తుందే?" 


"ఇదెలా ఉందంటే


"గుర్రాన్ని చెరువు దగ్గరకి తీసుకెళ్ళ గలం కానీ దాని చేత నీళ్ళు తాగించలేం" అన్నట్టు...పెళ్ళిళ్ళయితే చేస్తారు కానీ కాపురాలు చేయించలేరు కదా! 


"కన్న తల్లిదండ్రులు కుదిర్చినవి కానీ...వారికై వారు ప్రేమించి చేసుకున్నవి కానీ... ఇంత ఎక్సర్సైజ్ చేసిన తరువాత అవి వారి చేత కాపురాలు చేయించలేకపోతున్నాయి" అన్నది మంజరి దిగులుగా మొహం పెట్టి. 


"నడు ఎంత సేపు మాట్లాడుకున్నా పరిష్కారం దొరకని సమస్య ఇది. కాలంలో మార్పులు తప్పవు."


"చదువులతో సంపాదనలు పెరిగి నాగరికులం అనిపించుకుంటున్నారే కానీ కలిసి బతకలేకపోతున్నారు! ఒక వేళ మనబోటి పెద్ద వాళ్ళు ఏమన్నా చెప్పబోతే...మా సమస్యలు మీకేం తెలుస్తాయి అని కొట్టి పడేస్తున్నారు!" 


"నీకు గుర్తుందా... ముత్యాల ముగ్గు సినిమాలో నాయిక సంగీత తన మామగారితో 'సిఫారసులతో కాపురాలు చక్కబడవండి. ఇరువురికి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం, గౌరవం ముఖ్యం అని'...నాకు అది నిజమే అనిపిస్తుంది" అని తన కారు దగ్గరకి దారి తీసింది పద్మావతి. 


ఈ కాలంలో  పెద్ద చదువులు చదువుకున్న యువత...బోలెడు డబ్బు ఖర్చు పెట్టి హంగుగా ఆర్భాటంగా పెళ్ళి చేసుకుని...కలిసి బతకలేక మూడు నాలుగు నెలలకే విడిపోతున్నారు. 


మనిషి కి మనిషి తోడు అని భావించే వివాహం ఒక మానసికమైన ఆలంబన! 


వివాహంతో ఏర్పడే కుటుంబం....సంతోషాన్ని పంచి ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదపరిచే పిల్లలకి జన్మ స్థానమని మరచిపోతున్నారు. అది తమ స్వేచ్ఛని పోగొట్టుకునే ఒక గుదిబండగా భావిస్తున్నారు. 


విడాకుల సమస్య పాశ్చాత్య దేశాల నించి దావానలం లాగా మన దేశానికి విస్తరించి..కొన్ని వేల ఏళ్ళుగా ప్రపంచం చేత కొనియాడబడిన మన వివాహ వ్యవస్థ తన వైభవాన్ని, ప్రాభవాన్ని కోల్పోతున్నది.


ఇప్పుడు 'విడాకులు' కుటుంబ సమస్య స్థాయి నించి సామాజిక సమస్య స్థాయికి చేరింది. 


@@@@


విశృంఖలమైన లైంగిక సంబంధాలని కట్టడి చేసి, ఒక సామాజిక కట్టుబాటు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆది మానవుడు నాగరికతలో భాగంగా తనకి తానుగా ఈ వివాహ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాడు. 


ఇప్పుడు నాగరికత ఎక్కువై, తనే ఆ కట్టుబాట్లని తోసిరాజని..వివాహం వద్దనుకుని... సహజీవనం అని, వివాహేతర సంబంధం అని తిరిగి అనాగరికపు స్థాయికి వెళ్ళిపోతున్నాడు. 


ఈ మార్పులు దేనికి దారి తీస్తాయో! 


ఎం బిందుమాధవి.                              సే కొల్లి మాధవ కుమార్

No comments:

Post a Comment