🪷🪷 "35" 🪷🪷
🪷🪷 "కర్మ - జన్మ" 🪷🪷🪷🌼🪷🌼🪷🌼🪷🌼
🌼🪷🕉🪷🌼
🌼🪷🌼
🌼
ప్రారబ్ద కర్మ - మహాత్ములు:-
"శ్రీ రమణ మహర్షికి బ్రతికుండగానే మృత్యువు అనుభవం ఏర్పడటంతో ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించారు. ఎవరో భగవాన్ శ్రీరమణ మహర్షిని, 'మీరు మృత్యువుని జయించిన మృత్యుంజయులు కదా' అంటే..., ఏమన్నావు? మళ్ళీ ఒకసారి చెప్పు' అన్నారు. అతను 'మీరు మృత్యువుని జయించిన మృత్యుంజయులు కదా' అంటే 'మృత్యువుని జయించానా? మృత్యువుని అనుభవించాను తప్ప నేను మృత్యువుని జయించ లేదు."
"ఒకరోజెప్పుడో శరీరాన్ని వదిలిపెడతాను. మృత్యువంటే ఏమిటి? అది మన మీదకి ఎలా వస్తుంది? మొదలైనవన్నీ నాకు అనుభవాలయ్యాయి. ఎందుకు అనుభవాలయ్యాయి అంటే ఈ శరీరం ఏమవుతుందో నాకు తెలియాలి కాబట్టి. అది నా ప్రారబ్ధ కర్మ కాబట్టి నాకు ముందుగా తెలిసింది.' అన్నారు."
"మహాత్ముల ప్రారబ్ద కర్మానుభవానికి సామాన్యుల ప్రారబ్ద కర్మానుభవానికి చాలా తేడా ఉంది. కాలిపోయిన తాడులా మహాత్ముల ప్రారబ్ద కర్మ ఉన్నట్లు కనపడ్డా అది వాళ్ళని బాధించదు. కాలని తాడులాంటిది మన ప్రారబ్ద కర్మ. అది మనల్ని బాధిస్తుంది."
"సామాన్యులు ప్రారబ్దాన్ని అనుభవించడం నించి తప్పించుకోడానికి ప్రయత్నిస్తే, మహాత్ములు వాటిని ఆనందంగా ఆహ్వానించి అనుభవిస్తారు అని ఎందరో మహాత్ముల జీవితంలోని సంఘటనలని బట్టి గ్రహించచ్చు."
"కారణం కర్మ ఫలం అయిన కష్టాలని అనుభవించడం ద్వారా మన కర్మ నాశనం అవుతుందన్న జ్ఞానం వారికి ఉండటం. ప్రారబ్ద కర్మని మహాత్ములు ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించినట్లు గౌరవిస్తారు."
"గొలగమూడి వెంకయ్య స్వామి (నెల్లూరు జిల్లా) ఆత్మకథలో వస్తుందిది. కొంతకాలం ఆయనకి కాళ్ళు స్వాధీనంలో లేకుండా పోయాయి. వైద్యానికి ఆయన అంగీకరించలేదు."
“ఏ వైద్యం చేస్తే ఆ కాళ్ళు బాగుపడతాయో నేను అడక్కుండానే స్వామి వారు నాకు చెప్పాలి. అది నా ద్వారా జరిగి వారి కాళ్ళు బాగవ్వాలి. అంతదాకా నేను వారి సన్నిధిలోనే ఉంటాను.” అని కస్తూరి అంకయ్య అనే భక్తుడు సంకల్పం చేసుకుని కూర్చున్నాడు. “లెక్క తప్పిపోతుంది. అట్లా అడక్కూడదయ్యా. పూర్వం నేను ఓ ఆవుని కొట్టాను. దాని ఫలితమే ఇది. దీన్ని అనుభవించి ఆ కర్మ దోషాన్ని పోగొట్టుకోవాలి కనుక మందు తీసుకోను. లేకపోతే మళ్ళీ రావాల్సి వస్తుందయ్యా.” అని తిరస్కరించారు ఆయన."
"1948లో రమణ మహర్షికి ఎడమ చేతి పై భాగాన సర్కోమా అనే కురుపు (విషగ్రంధి) లేచింది. రెండు సార్లు దానికి శస్త్ర చికిత్సని చేసినా అది తగ్గలేదు. ఆయన భక్తులు కూడా ఆయన్ని రోగం నయం చేసుకోమని ప్రాధేయ పడ్డారు. కాని ఆయన జవాబు కూడా అదే. నయం చేసుకుంటే తిరిగి దాన్ని అనుభవించడానికి జన్మించాలి. ఆ రోగ కారణంగానే 1950 ఏప్రిల్ 14న రాత్రి ఎనిమిది నలభై ఏడుకి శ్రీ రమణ మహర్షి నిర్యాణం జరిగింది."
"శ్రీ రామకృష్ణ పరమహంస గొంతుకి కేన్సర్ వచ్చింది. ఆయన్ని కూడా భక్తులు రోగాన్ని కుదుర్చుకోమంటే అందుకాయన చెప్పిన సమాధానం కూడా అదే."
"పూర్వ జన్మల్లో ఎన్నడో వారు అనివార్య ప్రారబ్ద కర్మగా మారిన పాపం చేసి ఉండబట్టే వారికి ఆ ప్రాణాంతక వ్యాధులు వచ్చాయి. పూర్వ జన్మల్లో సామాన్యుల్లా వారు కూడా కొన్ని దుష్కర్మలు చేసినవారే అయి ఉండాలి. ఈ జన్మలో వారు మహాత్ములు అయ్యారు."
"అందుకే నిన్నటి పాపి నేటి మహాత్ముడు, నేటి పాపి రేపటి మహాత్ముడు' అన్నారు. అంతా కర్మని, దాని రాతని బట్టే ఉంటుంది. స్వయంగా ఈశ్వరుడికే ప్రారబ్ద కర్మ ఫలాన్ని అనుభవించడం తప్ప లేదు."
"స్వయం మహేశః శ్వశురో నగేశః సఖా ధనేశ స్తనయో గణేశః
తథాపి భిక్షాటనమేవ శమ్భోర్బలీయసీ కేవలమీశ్వరేచ్ఛా!"
భావం:-
"ఆయన అందరికీ ఈశ్వరుడు. మిత్రుడు కుబేరుడు. హిమవంతుడు ఆయన మామ. కొడుకు గణేశుడు. ఇంకో కొడుకు కుమారస్వామి. పరాశక్తి ఐన పార్వతి సహధర్మచారిణి, నివాసం రజత, సువర్ణరత్నాలతో కూడిన కైలాసం. ఆహా! ఇన్ని ఉన్నా కర్మను తప్పించుకోలేక పరమ శివుడు భిక్షమెత్తుతూ తిరగాల్సిన గతి పట్టింది. కర్మ ఫలం బలం ఎంతో చూసారా!"
🌼🪷🌼🪷🌼
🌼🕉🌼
సేకరణ
No comments:
Post a Comment