Sunday, July 17, 2022

భగవద్గీత: ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానయినా, బలవంతంగా ఏదోశక్తి చేపించినట్టు, పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును?

  🌷🚩శ్రీ భగవద్గీత 3వ అధ్యాయము : కర్మ యోగము > శ్లోకం 36🚩🌷 


 అర్జున ఉవాచ । 

 అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః । 

 అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః ।। 36 ।। 


 అర్జునుడు పలికెను : ఓ వృష్ణి వంశీయుడా (శ్రీ కృష్ణా), ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానయినా, బలవంతంగా ఏదోశక్తి చేపించినట్టు, పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును? 


 శ్రీ కృష్ణుడు ఇంతకు ఒక పూర్వ శ్లోకంలో రాగ ద్వేషాల ప్రభావాలకు లోను కావద్దు అని చెప్పి ఉన్నాడు. అర్జునుడు అలాంటి దివ్యమైన జీవనాన్ని గడపాలనుకుంటున్నాడు, కానీ ఆ ఉపదేశం పాటించటం అతనికి కష్టతరంగా అనిపిస్తోంది. కాబట్టి, అతను శ్రీ కృష్ణుడిని, మానవ సంఘర్షణను సూచించే ఒక వాస్తవిక సందేహం అడుగుతున్నాడు. అర్జునుడు అంటున్నాడు, "ఉన్నతమైన ఆదర్శం చేరుకోవటానికి మనకు అడ్డుగా ఉన్న శక్తి ఏమిటి? రాగ ద్వేషాలకు వశమయి పోయేలా చేసేది ఏమిటి?” అని. 


 పాపపు పనులు చేసేటప్పుడు మనందరికీ, ఇది తప్పుఅనో లేదా పశ్చాత్తాపమునో కలిగించే ఒక మనఃసాక్షి ఉంటుంది. భగవంతుడు సర్వ సుగుణములకు నిలయము అన్న నిజం మీద మనఃసాక్షి స్థితమై ఉంటుంది, మరియు ఆయన అంశ అయినట్టి మనకు కూడా సుగుణములకు, మంచితనానికి ఆకర్షితమయ్యే సహజ స్వభావం ఉంటుంది. జీవాత్మకు సహజ స్వభావంగా ఉన్న మంచితనము, మనఃసాక్షికి స్వరాన్ని ఇస్తుంది. కాబట్టి, దొంగతనం చేయటం, మోసం చేయటం, దూషించటం, లాక్కోవటం, హత్య చేయటం, హింసించటం మరియు అవినీతి అనే లాంటివి, తప్పు అని తెలియదు, అని సాకులు చెప్పలేము. మన సహజ-జ్ఞానం ద్వారా ఇవి పాపిష్టి పనులు అని మనకు తెలుసు,  మనం ఎదో ఒక బలీయమైన శక్తి ప్రేరేపించినట్టుగా ఈ పనులు చేస్తుంటాము. ఆ బలీయమైన శక్తి ఏమిటో అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. 


 🚩శ్రీ భగవద్గీత 3వ అధ్యాయము : కర్మ యోగము > శ్లోకం 37🚩 

 

శ్రీ భగవానువాచ । 

 కామ ఏ క్రోధ ఏష రజోగుణసముధ్భవః । 

 మహాశనో మహాపాప్మా విధ్ధ్యేనమిహ వైరిణమ్ ।। 37 ।। 


 శ్రీ భగవానుడు పలికెను: రజో గుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే (కోరికలు, వాంఛలు), తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దాన్నిగా తెలుసుకొనుము. 


 వేదములు 'కామము' అన్న పదాన్ని కేవలం లైగిక వాంఛ ల కోసమే కాక మనము ఈ శరీరమే అన్న దృక్పథంలో ఉన్న అన్ని భౌతిక కోరికలను ఉద్దేశించి వాడతాయి. ఈ విధంగా కామము ఎన్నో రకాలుగా బహిర్గతమవుతుంది - డబ్బుల కోసం యావ, వస్తువుల కోసం ఆశ, కీర్తి/ప్రతిష్ఠ లపై ఆశ, అధికారం కోసం తపన; మొదలగునవి. ప్రతి యొక్క ప్రాణికి స్వ-సహజంగా ఉండే భగవంతుని యందు ప్రేమ యే వక్రదారిలో పరావర్తనమైనప్పుడు కామము గా అవుతుంది. ఎప్పుడైతే జీవాత్మ , ఈ శరీరమనే భౌతిక శక్తి తో అనుసంధానం అవుతుందో, ఆత్మ యొక్క భగవంతుని పై ప్రేమ, రజో గుణ సాంగత్యం కారణంగా 'కామము' గా మారుతుంది. దివ్య ప్రేమ అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి, కాబట్టి భౌతిక ప్రపంచంలో దాని యొక్క వక్రమైన పరివర్తన (అంటే కామము) కూడా ప్రాపంచిక కార్యాలలో అత్యంత శక్తివంతమైనది. 


 ప్రాపంచిక భోగాల కోసం ఉన్న ఈ 'కామమే', పాపానికి మూల కారణం అని శ్రీ కృష్ణుడు నిర్ధారించాడు. ఇది మనలోనే స్థితమై ఉన్న దుష్ట ప్రలోభం. ప్రాపంచిక వస్తువులు తృప్తిని/ఆనందాన్ని ఇస్తాయి అని నమ్మించి, రజో గుణము, ఆత్మను ప్రలోభానికి గురిచేస్తుంది, దీనితో వాటిని పొందటానికి మనిషి ఆశ పడతాడు. ఎప్పుడైతే కోరిక తీరుతుందో అది దురాశ/లోభము కి దారి తీస్తుంది. మానవుడు ఈ మూడింటి ప్రభావంచే పాపాలు చేస్తాడు - కామము, లోభము మరియు క్రోధము. లోభము అంటే తీవ్రతరమైన కోరిక. కోపము అంటే ఆశాభంగమైన కోరిక. కాబట్టి, శ్రీ కృష్ణుడు కామమే (లేదా కోరికనే) అన్ని అరిష్టాలకు మూల కారణం అని ముద్ర వేసాడు. 

No comments:

Post a Comment