Thursday, July 7, 2022

🪷🪷 "కర్మ - జన్మ" 🪷🪷🪷 "కర్మ ఫలం" "సహాయక కర్మలు"

🪷🪷 "31" 🪷🪷
🪷🪷 "కర్మ - జన్మ" 🪷🪷🪷

"కర్మ ఫలం"
"సహాయక కర్మలు"

"ఓ ప్రారబ్ద కర్మ తీరడానికి కొన్ని ఇతర కర్మలు అందుకు సహాయం చేస్తాయి అని దర్జీవాడి కథని బట్టి మనకి అర్ధం అవుతోంది. ప్రారబ్ద కర్మ తీరడంలో దాని శాసనకర్త అనేక విధాలుగా మనిషిని అటువైపు నడిపిస్తాడు. చూడటానికి మామూలుగా కనిపించే సంఘటనలు ఒకోసారి ప్రారబ్ధ కర్మ తీరడానికి మనిషిని ముందుకు లాక్కెళుతాయి. దీనికి తార్కాణంగా మనందరి జీవితాల్లో ఎన్నో అనుభవాలుంటాయి."

"ఉదాహరణకి ఫలానావాళ్ళు ఏ రైల్వే స్టేషన్ లోనో లేదా హోటల్ లోనో చెప్పిన పెళ్ళి సంబంధమే కుదరచ్చు. మన రైలు లేటయి, ఇంకో రైల్లోంచి దిగిన వాళ్ళు మనకి తారసపడి ఆ సంబంధం గురించి చెప్పచ్చు. ఇవన్నీ కర్మ యొక్క గతి, గమనాలు లేదా ఆట అని మనం అనుకోం. మన ప్రారబ్దకర్మలే మన జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. మిగిలిన కర్మలన్నీ కూడా మనల్ని మన ప్రారబ్ధ కర్మ వైపే నడిపించి, మనల్ని ఎలా లొంగదీసుకుంటాయో వివరించే ఇంకో కధ ఇది."

"ఒకతనికి గుర్రప్పందాలంటే తగని ఎలర్జీ. తన మిత్రుడు పిలిచినా రేస్‌కోర్స్‌కి రానన్నాడు. అతన్ని స్కూటర్ మీద రేస్ కోర్స్ దగ్గర దింపి తను ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. కాని రేస్‌కోర్స్ దగ్గరకి చేరుకుంటూండగా అతని సెల్‌ఫోన్ మోగింది. తను ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తున్నానని భార్య నించి ఆ ఫోన్. ఇంటికి వెళ్ళి ఒంటరిగా వుండటం ఎందుకని కాలక్షేపానికి రేస్ కోర్స్ కి మిత్రుడితో వెళ్ళాడు. గుర్రాల మీద ఎలా పందేలు కాస్తారో వివరించాడా మిత్రుడు. గంటలో అతని కళ్ళ ముందే మిత్రుడు అయిదు వేల రూపాయలు గెల్చుకోవడంతో ఇతనికి తన అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవాలనే ఆశ పుట్టింది. దాంతో అతనూ ఓ వంద పందెంలో డబ్బు పెట్టాడు. వెయ్యి గెలుచుకున్నాడు. ఆ వెయ్యినీ మళ్ళీ పందెంలో పెట్టాడు. అయిదువేలు వచ్చాయి. వారం తర్వాత అతను మళ్ళీ వచ్చి ఆ అయిదు వేలతో పందెం కాసాడు. కొంత వచ్చి కొంత పోయి పదివేలయ్యాయవి. అతనికి ఆ ఆట మీద గల ఎలర్జీ పోయి ఉత్సాహం కలిగింది. ఆ పది వేలూ మళ్ళీ పందెం కాసాడు. మళ్ళీ కొంత వచ్చి కొంత పోయి ఇరవై వేలైందా మొత్తం."

"గుర్రప్పందేల మీద అతనికి ఆ సరికి ఆసక్తి బలపడింది. వాటి మీద తనకి మంచి కమాండ్ వుందన్న నమ్మకం కూడా కలిగింది. ఆ తర్వాత ఒకేసారి ఏభై వేలు కాసాడు. లక్షన్నర వచ్చింది. తర్వాత ఐదు లక్షలు తెచ్చి పందెం కాసాడు. మొత్తం పోయింది. అతనికి ప్రారబ్ద కర్మవశాత్తు ఎంత పోవాలో అంత పొయ్యే దాకా, తనకి గుర్రప్పందేల మీద మంచి పట్టు వుందన్న నమ్మకం కలిగించే అనేక సంఘటనలు జరిగాయి. ఆ నమ్మకంతో అతను ఇంట్లోంచి తెచ్చి పెట్టింది మొత్తం ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకు పోయాక ఆ నమ్మకం సడలి ఇదివరకటి ఎలర్జీ తిరిగి వచ్చింది. ఇలా ప్రారబ్ధకర్మ ప్రకారం మనలో తగిన ఆలోచనలు కలిగేలా చేసేది, వాటి ఫలాలని పంపిణీ చేసేది మనలోని దైవమే. దీనినే "బుద్ధిః కర్మానుసారిణి" అన్నారు. ఇది ప్రారబ్ధ కర్మ పని చేసే తీరు."

"స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా!
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోపి తత్!!"
-- గీత 18-60

భావం:-

"ఓ కౌంతేయా! మోహంతో నువ్వు చేయడానికి ఇష్టపడని కర్మని కూడా, పూర్వం నువ్వు చేసిన కర్మల బలంతో బంధింపబడి, ఆ ప్రభావంతో తప్పక చేస్తావు."*
🌼🪷🌼🪷🌼
🌼🕉🌼

సేకరణ

No comments:

Post a Comment