Sunday, July 17, 2022

ఆదిశంకరులు రాసిన భజగోవింద స్తోత్రంలోని శ్లోకం

 బాలస్తావత్‌ క్రీడాసక్తః, తరుణస్తావత్‌ తరుణీ సక్తః

వృద్ధస్తావత్‌ చింతాసక్తః, పరమే బ్రహ్మణి కోపి న సక్తః (భజగోవిందం)


ఆదిశంకరులు రాసిన భజగోవింద స్తోత్రంలోని శ్లోకం ఇది. చింత అంటే తలపు. దుఃఖం అనే అర్థంలోనూ ఈ శబ్దాన్ని ప్రయోగిస్తుంటాం. చింతన అంటే పలుమార్లు తలచుకోవడం. ఫలానా దానిగురించి ఎడతెగని ఆలోచనే చింతన. దానిని మనసుకు అలవరచి పరబ్రహ్మం వైపు మరలించడమనేది మనిషి ప్రయత్నపూర్వకంగా చేయవలసిన సాధన. అప్పుడు మాత్రమే చింతన సార్థకమవుతుంది. కాని, లోకంలో మనిషి బాల్య, యౌవన, వృద్ధాప్య దశలు నిరర్థకాలైన చింతనలో ఎలా చిక్కుకుపోతున్నాడో పై శ్లోకంలో పేర్కొన్నాడు శంకరాచార్యులు.


బాలుడైతే ఆటల్లో ఆసక్తి కనబరుస్తాడు. అస్తమానమూ అదే ధ్యాసలో ఉంటాడు. ఆటల్లో పడి ఆకలినీ మర్చిపోతాడు. తల్లిదండ్రుల కళ్లుగప్పి మరీ ఆటలకు వెళ్లిపోతుంటాడు. ఆ బాలుడికి లోకమంతా క్రీడాంగణంలాగే కనిపిస్తుంది. యుక్త వయసు రాగానే యువతులపై ఆసక్తి కనబరుస్తాడు. లోకంలో తనకొక్కడికే యౌవనం వచ్చినట్టు, అంతకుమించిన సుఖం లేదన్నట్టు భ్రమపడుతూ ఉంటాడు. ఈ వయసులో మనిషి తనలా ఉండటమే సహజమని భావిస్తూ యువతుల వెంటపడతాడు. అనుచితంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక వృద్ధాప్యంలో రేయింబవళ్లూ గత చరిత్రను తలచుకొని చింతిస్తూ ఉంటాడు. దుఃఖంలో కూరుకుపోతాడు. ‘మా చిన్నప్పుడు ఇలా ఉండేది. అప్పట్లో బాగుండేది, కాలం ఇలా మారిపోయింది. ఇప్పుడు పిల్లలు పెద్దల మాటలు వినడం లేదు. మేం అప్పట్లో పెద్దలు గీసిన గీత దాటకపోయేవాళ్లం’ అని గొణుగుతూ నిట్టూర్పులు విడుస్తూ ఉంటాడు. ‘ఎటొచ్చీ పరబ్రహ్మంపై మాత్రం ఎప్పుడూ ఆసక్తి చూపించడు’ అంటారు శంకర భగవత్పాదులు.


పిల్లలంటే జీవితానుభవం లేనివారు. ఆటలపై సహజ ఆసక్తిని కలిగి ఉంటారు. ‘పోనీలే! పిల్లలు ఆడుకోకుంటే, పెద్దలు ఆడుకుంటారా?’ అని పెద్దలు కూడా ప్రోత్సహిస్తుంటారు. యువకుల విషయానికి వస్తే కొన్ని మినహాయింపులు ఇవ్వొచ్చు. చదువనీ, స్నేహితులనీ, షికార్లనీ కాలంతో పరుగులు తీస్తూ ఉంటారు. ఒకట్రెండు అనుభవాల తర్వాత జీవిత సత్యం తెలుసుకుంటారులే అనుకోవచ్చు. కానీ, వృద్ధుల సంగతి ఒకింత లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. అన్ని బాధ్యతలూ నెరవేరిన తర్వాత కూడా ఏదో నిస్తేజం వారిని ఆవహిస్తుంది. ఇంకేదో పొందాలనే ఆశ. మరేదో కోల్పోయాననే నిరాశ. ప్రశాంతంగా ఉండకుండా, భగవంతుడి గురించి ఆలోచించకుండా గతం గురించి చింత చేస్తూ (శోకిస్తూ) ఉంటాడు. సుఖదుఃఖాల ఆటుపోట్లే జీవితం. ఎవరి జీవితమూ పూర్తిగా సంతోషభరితంగా ఉండదు. దుఃఖంతోనే నిండిపోదు. కానీ, తనకు గతంలో ఎదురైన చేదు సంఘటనలను తలచుకొని ఆవేదనలో కూరుకుపోతుంటాడు. ఆ దుఃఖం ఎవరికీ రానిదని, రాకూడదని అందరికీ చెప్తుంటాడు. ఎన్నడో ముప్పయ్‌, నలభై ఏండ్ల కిందట జరిగిన విషయాన్ని పదే పదే గుర్తుచేసుకుంటూ కుమిలిపోతుంటాడు. అంటే అతను ‘చింత’నే ‘చింతన’గా మార్చుకుంటున్నాడు. అది మాత్రం స్వయంకృతాపరాధమే.


ఏ బాధనైనా ఏదోవిధంగా మరచిపోవాలి గానీ, ప్రయత్నపూర్వకంగా గుర్తుకుతెచ్చుకోవడం ఆరోగ్యకరమైనది కాదు కదా! ఆ స్వయంకృతాపరాధం వల్ల మనిషి లోలోపల.. క్రమంగా కృశించి న్యూనతాభావం పెచ్చుపెరిగి మృత్యువుకు మరింత సన్నిహితుడవుతాడు. ఎంతో జీవితానుభవం గడించి, సమాజంలో ఆదర్శప్రాయుడిగా నిలబడాల్సిన వాడు వృద్ధుడు. తన అనుభవాన్ని నలుగురికీ తెలియపరిచి, సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి అతనికి ఉన్నది. కానీ, అతని చింతన సార్థకమైనది కాకపోతే ఆ వ్యక్తి నుంచి నేర్చుకోవలసింది ఇంకేముంటుంది? ఈ వయసులో అతనికి పరతత్వ చింతన సిద్ధించడం కష్టసాధ్యం. దాని ఆంతర్యమేమిటంటే ఆ సార్థకమైన చింతన వయసులో ఉన్నప్పుడే ప్రయత్నపూర్వకంగా చేయవలసి ఉంది. 

No comments:

Post a Comment