Friday, July 15, 2022

ఎవరి మంచి చెడులకు వారే కారణం

 🕉️ఉద్ధరేదాత్మ నాత్మానం


ఎవరి మంచి చెడులకు వారే కారణం

ఉద్ధరేదాత్మ నాత్మానం
ఆత్మానమవసాదయేత్‌
ఆత్మైవ హ్యాత్మోనో బంధుః
ఆత్మైవ రిపురాత్మనః
(ఆరో అధ్యాయంలో ఐదవ శ్లోకం)

మన మనసుకున్న శక్తితో మనలను మనమే ఉద్ధరించుకోవాలి. అంతే తప్ప నాశనం చేసుకో కూడదు. మన మనసే మనకు చుట్టం. అదే మనకు శత్రువు కూడా అవుతుందని అంటుంది భగవద్గీత.

అర్థమయ్యేలా చెప్పు కోవాలంటే...తల్లి దండ్రులైనా, గురువులైనా, శ్రేయోభిలాషులైనా.. మన మంచి కోరి, మంచి మాటలు చెబుతారు. మిత్రులుగా పక్కనుంటూ మన చెడు కోరుకునేవారు చెడ్డ దారులు పట్టిస్తారు.

మంచి మాటలు వినాలా చెడుమార్గంలో సాగాలా? అనే నిర్ణయం తీసుకోవాల్సింది మనం మాత్రమే.

మన ఇంద్రియాలు తరచుగా మనల్ని తప్పు దోవల్లోకి లాక్కుపోతాయి. వాటికి లొంగి పోయామా.. పతనం తప్పదు!

వాటిని మన అదుపులో పెట్టుకుంటేనే మనం జయిస్తాం. ఇది జీవిత రహస్యం.

విజయం సాధించడానికైనా, ఓడిపోవడానికైనా మూల కారణం మనమే. చాలా మంది తమ ఓటములకు, తాము జీవితంలో ఎదగక పోవడానికి ఇతరులే కారణమని చెబుతుంటారు.

మరికొందరేమో..పరిస్థితుల ప్రభావం అంటుంటారు.

తరచిచూస్తే.. చాలా మంది విజేతల కుటుంబ పరిస్థితులు మన కంటే ప్రతికూలంగా ఉంటాయి. కానీ వారు ప్రతీ దాన్నీ తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ప్రతి ఓటమిని, ప్రతికూల పరిస్థితులను కూడా సోపానాలుగా మార్చుకుంటారు. దీనికి కారణం.. వారికి ఉండే వివేక జ్ఞానం!

ఈ ప్రపంచాన్ని ఒక్కసారి గమనించినట్లయితే ఎన్నో అద్భుతాలు గోచరిస్తాయి.

అచేతనాలుగా పరిగణించబడే రాళ్లు, రప్పలు మొదలుకొని ప్రాణమున్న జీవుల్లో గొప్పవాడనిపించుకున్న మానవుడి దాకా అంతా ప్రపంచమే. రాళ్లు, రప్పలకు అసలు ప్రాణమే ఉండదు. పశుపక్ష్యాదులకు ప్రాణం, జ్ఞానం ఉన్నా.. ఆ జ్ఞానం వాసనా జ్ఞానమే కానీ, వివేకం ఉండదు. వివేకంతో కూడిన జ్ఞానం ఉండేది ఒక్క మనుషులకే. అంత గొప్ప సామర్థ్యం ఉన్న మనిషి ఎప్పుడూ నిరాశ చెందకూడదు. చిన్నచిన్న వైఫల్యాలకు కుంగిపోకూడదు.

ఆ వైఫల్యాలకు ఇతరులను, పరిస్థితులను కారణంగా చూపకూడదు. ఈ ప్రపంచంలో మానవులుగా పుట్టినందుకు.. వివేకంతో కూడిన జ్ఞానాన్ని కలిగి ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం.

పంచభూతాలు మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఎన్నో రకాల ప్రాణులు మన జీవనాన్ని సుఖమయం చేస్తున్నాయి.

ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్న మనిషి స్వశక్తిని నమ్ముకుని మనసా, వాచా, కర్మణా కృషి చేస్తే సాధించ లేనిది ఏదీ లేదు. ఆధ్యాత్మిక ఉన్నతికైనా.. జీవితంలో పురోగతికైనా అదే ముఖ్యం!
. 🙏🕉️

No comments:

Post a Comment