1. అజ్ఞానం : - అంటే ఏమిటి ?
నన్ను నేను తెలియక విషయాదులయందు ప్రవర్తించుట, శరీరమును సుఖపెడితే వచ్చే ఆనందము సత్యమని, ఇంద్రియాలు, మనసు వీటివల్ల కలిగే సుఖదుఃఖ అనుభవాలే సత్యమని, ఇవి లేకపోతే నేను లేను అనుకొనుటే అజ్ఞానము.
2. జ్ఞానము :- అంటే ఏమిటి ?
నేను దేహమును తెలుసుకొను వాడను కాని నేను దేహమును కాను. నేను ఆత్మ స్వరూపుడను, నేను మనసును తెలుసుకొనువాడను కాని మనసు యొక్క అనుభవములు నావి కావు. నేను మనసును కాను. నేను ఆత్మస్వరూపుడను. నేను ప్రకాశరూపుడను. ప్రజ్ఞా స్వరూపుడను. ఈ ప్రజ్ఞయే పిపిలికాది బ్రహ్మపర్యంతము 'నేను' గా ప్రకాశింప బడుతున్నదని తెలుసుకొనటయే జ్ఞానము.
3. విజ్ఞానము :- అంటే ఏమిటి ?
ఇట్లు తెలిసిన జ్ఞానమును తనకు అన్వయించుకొని, తన స్వరూపమే జ్ఞానమని, తక్కినదంతయు అన్యముగా నిరశించి, జ్ఞానమే తానైన స్థితి విజ్ఞానము.
4. సుజ్ఞానము :- అంటే ఏమిటి ?
పైన చెప్పిన అనుభవములకు కారణము ఎఱుక అనియు. (ఎఱుకన్నా, జ్ఞానమన్నా ఒక్కటే). ఈ ఎఱుకే జీవుడి అజ్ఞానమును, ఈశ్వరుడిగా జ్ఞానస్థితినీ, పరబ్రహ్మగా మౌనస్థితిని పొందుతున్నదనియూ, కాలప్రభావమున మరలా ఎఱుక సంకల్పించి, జీవేశ్వర జగత్తుగా మారవచ్చుననియూ, త్రిగుణముల యొక్క సామ్యావస్థే పరబ్రహ్మమనియు, త్రిగుణముల యొక్క వ్యవహారమే సృష్టి అనియూ, ఇది కాలచక్రముగా అనేక బ్రహ్మాండములను పరిపోషించుచున్నదనియూ ఎరిగి, త్రిగుణములను నిరశించి, ఎరిగే ఎఱుకను వీడి, ఎఱుకను నిరశించి బయలగుటే సుజ్ఞానము...
.
.
.
అర్థం పురుషార్థాల్లో ఉత్తమమైందని
పంచతంత్ర వాక్యం.
ధర్మమార్గంలో కలిగిన అర్థమే పురుషార్థంగా గ్రహింపదగింది.
ఒక్కొక్క నీటిబొట్టు పడుతుంటే క్రమంగా కుండ నిండిపోతుంది. అలాగే ధనం కూడా క్షణం క్షణం కణకణం సాధించుకోవాలి.
ఆత్రంగా నీటితో నింపబోతే కుండవిచ్చిపోవచ్చు. నీరు నేలపాలు కావచ్చు. ధనార్జన విషయంలో ఒక క్రమపద్ధతి అవలంబించాలని విజ్ఞులు చెబుతారు.
డబ్బుంటే చాలు కానిదేదీలేదన్న ఆలోచన నేడు చాలామందిలో ప్రబలంగా ఉంది. సంపాదనకు అధర్మమార్గం తొక్కడమూ సాధారణమైంది. ద్రవ్యం ధర్మార్జితం కావాలన్నారు పెద్దలు. అధర్మ మార్గాల్లో సంపాదించి విశేషంగా దానాలు చేస్తున్న ఎందరినో లోకం కొనియాడుతుంటుంది. వారు ఏ రకంగా ఆర్జించారన్నది పట్టించుకోదు. దానం చేసే ధనం న్యాయమార్గంలో సంపాదించినదై ఉండాలి.
ఒక ఊళ్లో పేద పండితుడు యాచకవృత్తిలో ఉంటూ ఓ ఇంటికి భోజనానికి వెళ్లాడు. ఉత్తమురాలైన ఇల్లాలు భోజనం పెట్టింది, చేతులు కడుక్కోవటానికి వెండి చెంబుతో నీళ్లిచ్చింది. పండితుడు ఇంటికి వచ్చేటప్పుడు గృహిణి ఇచ్చిన వస్తువులతో పాటు వెండిచెంబు కూడా సంచిలో చేరింది. ఆమె గమనించలేదు. ఇంటికి వచ్చాక సంచి తెరిచి చూసి అతడు ఖిన్నుడయ్యాడు. తనవల్ల ఎప్పుడూ ఇలాంటి తప్పు జరగలేదు. ఎంత ఆలోచించినా అలాంటి దుర్బుద్ధి ఎలా కలిగిందో అర్థంకాలేదు. తానెలా వెండిచెంబు సంగ్రహించాడో తెలియలేదు. ఆతిథ్యం ఇచ్చిన ఇంటికి వెళ్ళి, సిగ్గుపడుతూ- తన అపరాధం మన్నించమని వేడుకున్నాడు. వెళ్లిపోతూ 'తల్లీ... నీ భర్త ఏం చేస్తుంటారు' అని అడిగాడు. ఆ గృహిణి దుఃఖిస్తూ. తన భర్త దారి దోపిడులు చేసి సంపాదిస్తున్నాడని ఇదంతా పాపమని చెప్పినా వినడం లేదని, ఆ పాపం పోవడంకోసం తాను దాన ధర్మాలవంటి సత్కార్యాలు చేస్తున్నానని పలికింది. అప్పుడా పండితుడు- అన్యాయార్జితమైన విత్తంతో చేసిన దానధర్మాలుగాని, అన్నప్రసాదనంగాని స్వీకరించరాదని శాస్త్రాలు చెబుతున్నవనే విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు. సంపాదించిన ధనం అన్యాయార్జితమైతే సత్ఫలితాలను ఇవ్వదు సరికదా, తప్పుడు ఆలోచనలు కలిగిస్తుంది.
తాను సంపాదించిన సొమ్ము ఉత్తమమైంది. తండ్రినుంచి సంక్రమించిన సొమ్ము మధ్యమం. సోదరుడినుంచి వచ్చినది అధమం. ఇక, స్త్రీవల్ల పొందినది అధమాధమమని శాస్త్రవచనం. విజ్ఞులు పరుల సొమ్ముకు ఆశపడకూడదు.
సంపాదించేటప్పుడు మేరు పర్వతమంత సంపాదించాలి. దానం చేసేటప్పుడు ఆ ధనాన్ని గడ్డిపరకగా చూడాలని పెద్దలు చెబుతారు. ధనానికి దానం, భోగం, నాశనం అనే మూడు గతులు ఉన్నాయి. తాను అనుభవించక, ఒకరికి పెట్టక పోగుపెట్టే ధనానికి నాశనం తప్పదు. ధర్మం, అగ్ని, రాజు, దొంగ- ఈ నలుగురూ ధనానికి దాయాదులు. వీరిలో జ్యేష్ఠుని అంటే ధర్మాన్ని అవమానిస్తే మిగిలిన ముగ్గురూ కోపిస్తారు. అంటే- ధర్మంలేనివాడి ధనం అగ్నిపాలో, రాజుపాలో, దొంగలపాలో అవుతుందని భావం...
.
No comments:
Post a Comment