ఆత్మజ్ఞానం
➖➖➖✍️
శివపురాణంలో ఒక కథ ఉన్నది…దారుకావనంలో కొంత మంది మునులు వైదిక కర్మకాండలకు సంబంధించిన యజ్ఞయాగాదులు చేస్తూ జీవిస్తుండేవారు.
వారు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ కర్మకాండను సాగించేవారు. తాము చేసే యజ్ఞయాగాది కర్మలవల్లనే తమ కోర్కెలు సిద్ధిస్తాయని, మోక్షప్రాప్తి కలుగుతుందని భావించేవారు.
వారికి కొన్ని యోగసిద్ధులు కూడా కలగడంతో వారిలో అహంకారం కలిగింది. తాము చేసే కర్మల వల్లనే తమకు సిద్ధులు లభించాయని, ఇందులో భగవంతుని ప్రమేయం ఏమీ లేదని వారు అనుకున్నారు.
సిద్ధులైతే పొందారుగానీ.. సంపూర్ణమైన ఆనందం వారికి లభ్యం కాలేదు. దీంతో.. వారి అహంకారాన్ని తొలగించి, వారికి శాశ్వత ఆనందం కలిగించాలనే సంకల్పం పరమశివుడికి కలిగింది.
వెంటనే ఆ హరుడు ఒక యువ సాధువు రూపం దాల్చి ఆ మునుల వద్దకు చేరుకున్నాడు. పరమేశ్వరుని కృపను నమ్మకున్నా.. యజ్ఞయాగాదుల వంటి సత్కార్యాలను చేసిన ఫలితమే వారికి శివ దర్శనం కలిగేలా చేసింది.
అయితే, ఆ యువసాధువును వారు పట్టించుకోలేదు. తమ తమ పనులలో నిమగ్నులయ్యారు. మునిపత్నులు మాత్రం ఆ యువకుణ్ని చూసి అతడి రూపానికి మోహపరవశులై అతడి వెంటపడి వెళ్లిపోయారు.
అలా ఎంతదూరం వెళ్లారో వారికే తెలియదు. తమ భార్యలు కనపడకపోవడంతో.. మునులు వారి కోసం అన్వేషించడం మొదలుపెట్టారు. చివరికి వారు ఆ యువ సాధువు వెంటపడటం చూసి ఆగ్రహించారు.
తమ యోగసిద్ధుల సాయంతో అనేక ఆయుధాలు సృష్టించి అతడి మీదికి వదిలారు. అయితే, ఎన్ని రకాల ఆయుధాలు తనపై పడుతున్నా ఏ మాత్రం చలించకుండా ఆ యువసాధువు చిరునవ్వుతో ఉండిపోయాడు.
మునులు తమకున్న సిద్ధులన్నింటినీ ప్రయోగించినా ఆ యువకుణ్ని ఏమీ చేయలేకపోయారు.
దీంతో వారు... ఆ వచ్చినవాడు సామాన్యుడు కాదని సాక్షాత్తూ పరమశివుడని గ్రహించారు.
తమ తప్పును క్షమించి తమను అనుగ్రహించాలని కోరుతూ స్వామి పాదాలపై పడి వేడుకున్నారు.
తమ దుఃఖాలన్నీ తొలగి, ఆనందం కలగడానికి మార్గం చెప్పాలని కోరారు.
వారికి దుఃఖం కలగడానికి కారణం ఆత్మజ్ఞానం లేకపోవడమేనని.. ఆత్మజ్ఞానం వల్లనే సమస్త దుఃఖాలూ నివృత్తియైు, శాశ్వత ఆనందం కలుగుతుందని పరమశివుడు వారికి హితబోధ చేసి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు.
శివపురాణంలోని ఈ కథను తమిళ కవి మురుగనార్ ఒక గ్రంథ రూపంలో రచించారు.
అయితే.. పరమశివుడు మునులకు బోధించిన ఆత్మజ్ఞానాన్ని మాత్రం రాయకుండా ఆయన వదిలేశారు. ఎందుకంటే.. ఆత్మజ్ఞానం గురించి చెప్పాలన్నా, రాయాలన్నా కేవలం గ్రంథాలు చదివే కవులు, పండితులకు అర్హత లేదు. దానికి ఆత్మజ్ఞాన సంపన్నులు మాత్రమే అర్హులని మురుగనార్ కవి విశ్వసించారు.
అందుకే ఆయన భగవాన్ రమణ మహర్షిని సందర్శించి తన గ్రంథాన్ని గురించి చెప్పి చివర్లో పరమశివుని జ్ఞానబోధను తాను రాయకుండా విడిచిపెట్టిన సంగతి వివరించారు.
‘తమరే ఈ గ్రంథాన్ని పూర్తిగావించాలి’ అని వేడుకున్నారు.
ఆయన అర్థించిన సమయం ఎంత మంచిదో.. ఆ కవి అదృష్టం, మనందరి అదృష్టం వల్ల భగవాన్ రమణులు అందుకు అంగీకరించి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ తమిళంలో ‘ఉపదేశ సారం’ రాశారు. రమణ మహర్షి రచించిన 30 శ్లోకాల ‘ఉపదేశ సారం’లో ఒక్కొక్క శ్లోకం.. ఒక్కొక్క రత్నం.✍️
. 🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment