దైవానుగ్రహం ➖➖➖✍️
సంకల్పం స్వచ్ఛమైంది, ధార్మికమైంది అయినప్పుడు తప్పక దైవానుగ్రహం తోడవుతుంది.
మన సనాతన సంస్కృతిలో ఇందుకెన్నో దృష్టాంతాలున్నాయి. ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని ఉత్సాహంతో చేస్తుండాలన్నదే 'భగవద్గీత' ద్వారా పరమాత్మ మనకు అందించిన గొప్ప సందేశం.
లోకంలో అనేక రకాల వాళ్ళుంటారు. చేయబోయే పనులకు కలుగబోయే ఆటంకాలను ముందుగానే ఊహించుకొని వాటిని అసలు ప్రారంభించకుండానే వుండేవారు కొందరు. చేస్తున్న పనుల్లో ఏవైనా ఆటంకాలో, కష్టాలో వస్తే వాటిని మధ్యలోనే వదిలేసేవారు మరికొందరు. కానీ, ధైర్యవంతులైనవారు ఉత్సాహం కోల్పోక, ఎలాంటి అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టమైన పని అయినా లక్ష్యం చేరే వరకు వదలక తెలివిగా సాధిస్తారు.
తలపెట్టిన పని సఫలం కావాలంటే ధైర్యం వుండాలి. అంతమాత్రాన సరిపోదు, దీనికి తగిన 'ఉత్సాహమూ' తోడవ్వాలి. 'దైవానుగ్రహం' లభించాలి. వీరుడు విజేత కావాలంటే కత్తిని పూజిస్తే సరిపోదు. కదనరంగంలో పదునెక్కిన కరవాలం ఝళిపించే ఉత్సాహాన్ని ఉరకలెత్తించాలి. అప్పుడే శత్రుమూకల పని పట్టగలుగుతాడు.
వీర శివాజీ ‘ధార్మికనిష్ఠ’కు మెచ్చి భవానీమాత వీరఖడ్గాన్ని అనుగ్రహించడం చారిత్రక సత్యం కదా!
నవరసాల్లో వీరరసానికి స్థాయీభావం ఉత్సాహం. కొందరి పలుకుల్లో వీరత్వమున్నా చేతల్లో చేవ ఉండదు. అలాంటివారు ఎన్నటికీ గెలుపు దారి పట్టలేరు.
మహాభారతం'లో ఉత్తర గోగ్రహణ వేళ ఉత్తరుని ప్రగల్భాలు ఇలాంటివే. పనిని నెరవేర్చగల ప్రయత్నమే కర్మయోగం.
కానీ, పని చేయగలిగీ చేయలేక చేతులెత్తేసినవారికి ఒక ప్రేరణ, సక్రమ ప్రోత్సాహం కొండంత బలాన్నిస్తాయి.
కుఱుక్షేత్ర మహాసంగ్రామంలో సవ్యసాచి గాండీవిని జగదేకవీరునిగా నిలిపింది శ్రీ కృష్ణ పరమాత్మ అందించిన గీతా ప్రబోధమే! అదే యుద్ధంలో రథసారథి శల్యుడు సూటిపోటి మాటలతో మహావీరుడైన కర్ణుని వేధించడమేకాక ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీసి, తీవ్రమైన ఓటమికి కారకుడయ్యాడు.
ప్రోత్సహిస్తే విజయం, నిరుత్సాహపరిస్తే అపజయం' తప్పవన్న దానికి ఈ రెండూ ఋజువులు.
'శ్రీమద్రామాయణం'లో అన్ని వేళలా అన్నగారి మాట ప్రకారమే నడచుకున్న లక్ష్మణుడు, ఒక సందర్భంలో శ్రీరామునికే మార్గదర్శనం చేయాల్సి వచ్చింది. 'కిష్కింధకాండ'లో సీతా వియోగ దుఃఖాన్ని అనుభవిస్తూ అశక్తుడిగా రోదిస్తున్నాడు రాముడు. అప్పుడు లక్ష్మణుడు, 'అన్నయ్యా! సీతమ్మను వెదకాలి. రావణుణ్ణి వధించాలి. ఈ రెండు పనులు చేయాలంటే దైన్యం వదిలి, ధైర్యాన్ని మనసులోనింపుకోవాలి. మనసులో ఉత్సాహం ఉంటేనే కదా ఏ పనినైనా అత్యంత సమర్థవంతంగా చేసి, విజయం సాధించగలం' అన్నాడు.
ఉత్సాహంలో చాలా బలముంటుంది. అతనికి ఓటమే ఉండదు. ఉత్సాహవంతుడు సాధించలేనిదేదీ లేదు. పూనికతో ప్రయత్నిస్తే సీతమ్మను నువు తిరిగి పొందగలవు' అని లక్ష్మణస్వామి పలికిన మాటలు ఒక్క రామునికే కాదు, ప్రతి మనిషికీ దారిదీపాలు. అధైర్యాన్ని పరిహరించి, ఉత్సాహాన్ని నింపేవారు ఒక్కరున్నా చాలు, ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతారు.
జాంబవంతుని ప్రోత్సాహంతోనే కదా, హనుమ శతయోజన దూరమైనా సముద్రాన్ని అవలీలగా దాటేశాడు. తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతోనే శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ తన ప్రయోగాల్లో ఎన్నిసార్లు విఫలమైనా చివరికి విద్యుత్ బల్బును కనుక్కునేదాకా ఉత్సాహాన్ని వదిలిపెట్టలేదు. పైగా ప్రయోగంలో పొందిన వైఫల్యాలన్నీ తన నూతన ఆవిష్కరణలకు మార్గదర్శకాలయ్యాయనీ ఆయన ప్రకటించాడు.
'ఉడుకు రక్తానికి ఉత్సాహమెక్కువ' అన్న పెద్దల మాట అక్షరసత్యం.
పిల్లలలోని ఉత్సాహాన్ని పరిణత బుద్ధులైన విజ్ఞులు సక్రమపథంలోకి మళ్ళిస్తే వారినుండి అద్భుతాలను రాబట్టగలం!✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment