Thursday, September 15, 2022

విశ్వేశ్వరయ్య గారి స్వామి భక్తి, నిజాయితీ మన అందరికీ...కేవలము ఇంజినీర్లకే కాదు, నేటి సమాజములో అందరికీ ఆదర్శము. అందుచేతనే వారు ప్రాతఃస్మరణీయులు అయ్యారు.

 ఎందరో మహానుభావులు...
అందరికీ... వందనములు....

National Engineers Day సందర్భం గా...

⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు.

 అటువంటి ఎన్నో  విషయములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో......

2017 ఆగష్టులో జూబ్లీ హిల్ల్స్ పబ్లిక్ స్కూలు విద్యార్థులను ఉద్దేశించి పూజ్య గురువులు చేసిన ప్రసంగములో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నిజాయితీ ని గురించిన విశేషములు, శ్రీ విశ్వేశ్వరయ్య గారి జన్మదినము సందర్భముగా...

...ఆ రోజులలో ప్రభుత్వ ఇంజినీర్లు ఎన్నో గ్రామాలలో తిరిగి, వారి నివేదికలు చేతితో వ్రాసి, తయారు చేసి, ప్రభుత్వానికి ఇవ్వవలసిన పరిస్థితి. 

ఒకానొక సమయములో శ్రీ విశ్వేశ్వరయ్య గారు ఒక గ్రామములో ఒక నివేదిక తయారు చేయటము కొరకు ఆ గ్రామములోని ఒక పెద్ద మనిషి ఇంటిలో బస చేసారు.

 పగలంతా తిరిగి, అక్కడ జరిగే ప్రాజెక్టు పనులు అధ్యయనము చేసి, రాత్రికి   నివేదిక తయారు చెయ్యటానికి ఉద్యుక్తులయ్యారు విశ్వేశ్వరయ్య గారు. 

ఆ రోజు రాత్రి అక్కడ విద్యుత్తు లేదు.

 కానీ ఆ నివేదిక వ్రాయటము వాయిదా వేస్తే తాను ఎమైనా మరచిపోతానేమోనని తన సంచీలోనుంచి ఒక కొవ్వొత్తిని తీసి దాని వెలుగులో తన నివేదిక  పూర్తి చేసారు వారు.

సహజముగానే పుస్తక పఠనాసక్తులయిన విశ్వేశ్వరయ్య గారు ఆ కొవ్వొత్తిని ఆర్పి మరొక కొవ్వొత్తిని వెలిగించి, దాని వెలుగులో తన పుస్తక పఠన చేయసాగారు. 

ఇది చూచిన ఆ ఇంటి పెద్దాయన విశ్వేశ్వరయ్య గారి వద్దకు వెళ్ళి - "అయ్యా...ఈ రెండు కొవ్వొత్తులు ఏమిటి? ఒక కొవ్వొత్తి ఆర్పి, రెండవ కొవ్వొత్తి కాంతి లో ఎందుకు చదువుతున్నారు?" అని కుతూహలముగా అడిగారు.

 "నేను వాడిన మొదటి కొవ్వొత్తి నాకు ప్రభుత్వము వారు విద్యుత్తు లేనప్పుడు నా ఉద్యోగ ధర్మములో ఉపయోగపడుతుందని ఇచ్చారు. కానీ ఇప్పుడు నేను చేస్తున్నది నా ఉద్యోగము కాదుగా...నాకు   ఆసక్తయిన పుస్తక పఠనము. దీనికి వారిచ్చిన కొవ్వొత్తి వాడితే ప్రభుత్వ వనరులు దుర్వినియోగ పరచడం అవుతుంది కదా...

బాధ్యతగల పౌరులుగా మనము అది చేయకూడదు. అందుకే, నా సొంత పనులకు నా సొంత కొవ్వొత్తినే వాడుతా..." అని చెప్పారు విశ్వేశ్వరయ్య గారు.

 విశ్వేశ్వరయ్య గారి నిజాయితీకి ఆ పెద్దాయన అబ్బురపడ్డారు...

విశ్వేశ్వరయ్య గారి స్వామి భక్తి, నిజాయితీ మన అందరికీ...కేవలము ఇంజినీర్లకే కాదు, నేటి సమాజములో అందరికీ ఆదర్శము. అందుచేతనే వారు ప్రాతఃస్మరణీయులు అయ్యారు.


⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

No comments:

Post a Comment