*🌹 శ్రీ రమణీయం - 🌹*
*👌దొంగైనా దైవమైనా నిద్రలోనే వస్తారు👌*
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
*నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః*
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
🌈 *9. దొంగైనా దైవమైనా నిద్రలోనే వస్తారు.* 🌹
✳️ *‘దొంగ' అయినా దైవం అయినా నిద్ర పోయినప్పుడే వస్తారు. మనషులు నిద్రపోయినప్పుడు ఇంట్లోకి దొంగ జొరపడినట్లే మనసు నిద్రపోయిన (అణిగి పోయిన) తర్వాత హృదయం నుండి దైవం వెలుపలికి వస్తాడు. మనం ప్రార్థన చేస్తే ఆ దైవమే మన మనసుని నిద్రపుచ్చి మరీ దర్శనమిస్తాడు.*
✳️ 'కృష్ణతత్వం’ అంతా అలా భక్తుల మనసు దోచుకోవడమే. కనుకనే ఆయనను 'దొంగ' (మానస చోరుడు) అన్నారు. శ్రీ రమణ భగవాన్ కూడా తన మనసు దోచిన అరుణాచలేశ్వరుడ్ని అలానే కీర్తించారు.
✳️ మనసు నిద్రపోవటం అంటే ఆలోచనలు లేని స్థితి. అది రోజూ మనకి గాఢనిద్రలో జరుగుతూనే ఉంది. అయితే మనకి దాన్ని గుర్తించేంత సామర్థ్యం ఉండటం లేదు. మనలో ఆ దైవం నిరంతరాయంగా చైతన్య రూపంలో ఉంటూనే ఉన్నాడు.
✳️ పగలంతా మనోబుద్దుల చేత ఆ చైతన్య భావన మరుగున పడుతుంది. నిద్రలో గమనింపు లేక అనుభవం కావటం లేదు. అందుకే అనునిత్యం మన అణువు అణువులో నిండి మన ఉనికికి కారణమైన దైవాన్ని మనం గుర్తించలేక పోతున్నాం. మనలోనే దైవం ఉన్నది అనే భావన స్థిరపడితేచాలు. అదే మనని గమ్యానికి చేరుస్తుంది. అన్నింటినీ ఈ పంచేంద్రియాలతో అనుభవించటానికి అలవాటు పడ్డ మనం ఆ చైతన్యాన్ని, దైవాన్ని కూడా అలానే అనుభవించాలని అనుకుంటున్నాం. అయితే అన్నింటినీ అనుభవింప చేసేదే చైతన్యం కనుక దాన్ని పట్టుకోలేకపోతున్నాం. మన వీపును మనం అద్దంలో చూసుకోలేం కదా. మరో అద్దం సహాయం కావల్సిందే. అదే గురువు చేసే పని. ఈ ప్రపంచం అనే అద్దంలో నీ వెనుక ఉన్న దైవాన్ని చూసుకోలేవు. మరో అద్దంలా నీ వెనుక నిలబడి నీలోనే ఉన్న దైవాన్ని గురువు చూపుతాడు. రోజూ మనకు నిద్రలో ఆ చైతన్య స్థితే ఉంటుంది. అక్కడ అనుభవం ఉండదు. ఆ చైతన్యస్థితిని అనుభవించే గమనింపు సమాధి స్థితిలో సాధ్యమౌతుంది.
✳️ ఆత్మానుభవం ప్రతి ఒక్కరికి ప్రతిక్షణం అంతర్లీనంగా జరుగుతూనే ఉంది. ఆ రుచి మనకి తెలియని కారణంగా అది ఫలానా అని మనకి బోధపడటం లేదు. సాధనలో ఒక్కసారి ఆత్మానుభవం రుచిని తెలుసుకుంటే నిరంతరం మనలో ఉండే ఈ అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఉండవచ్చు. నిత్యం మనకు ఆత్మానుభవం జరుగుతున్నా మనం ఎందుకు గుర్తించలేక పోతున్నామంటే దేహాత్మ భావనచేతనే. రెండు చేతులు మనవే అయినా కుడి చేత్తో అలవాటైన పనిని ఎడమ చేతితో చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం. కారణం... ఎడమ చేతికి ఆ పని చేతకాక కాదు. మనం అలవాటు చేయలేదు గనుకనే! ఎడమ చేతితో అలవాటైన వారు ఆ పని సక్రమంగానే చేయగలుగుతారు. ఈ దేహంతో ప్రతి ఒక్కరికి మమేకత (కలిసిఉండటము) అలవాటైంది. అదే చైతన్యాన్ని తెలుసుకోనివ్వకుండా దేహమే నేను (మిథ్యా నేను) అనే భావనను పెంచుతుంది. అదే లేకపోతే మనసుకు మరో ప్రక్కనున్న చైతన్యాన్ని ఈ దేహంలానే గ్రహించవచ్చు.
✳️ ఆ దైవం నీలోనే ఉన్నాడు. చైతన్య రూపుడైన దైవాన్ని దర్శించేందుకు అడ్డుగా ఉన్నది ఈ ప్రపంచం కాదు. ఆ దర్శనానికి అడ్డుగా ఉన్నదల్లా నీదేహం అనే తొలి ప్రపంచం, ఆ దేహత్మభావనలో ఉన్న మనసులే. దీనినే రూపనామాలు అంటాం. రూపం అంటే ఈ స్థూల దేహం కాగా నామం అంటే నేను ఫలానా అన్న దేహాత్మభావన. కాబట్టే జాగృతావస్థలో (మెళకువలో) ఈ జగత్తుపై రాగం (ఇష్టం) తప్పటం లేదు. రూపనామాలు రెండు మాయా స్వరూపాలే. ఎందుకంటే అవి నీకు శాశ్వతంగా గానీ, నిరంతరంగా గానీ ఉండటం లేదు. ఎప్పుడో మరణానంతరం అవి అదృశ్యం కావటమే కాదు, ప్రతి రోజు నిద్రలో కూడా అవి అదృశ్యం అవుతూనే ఉన్నాయి. మెళుకువలో ఈ జగత్తు, రాగంతో ఉన్న “నువ్వు” ఉంటావు. (అంటే తెలుసుకునే మనసుతో కలిసి నువ్వు ఉంటావు.) నిద్రలో అవేవి లేని నువ్వు ఉంటావు. (అంటే మనసులేని నువ్వు ఉంటావు.) తరచి ఆలోచిస్తే 'నువ్వు’ ఈ రెండింటిలోనూ ఉన్నావు. వచ్చిపోయేదీ మనసే కదా! అంటే మాయ మయ్యేది మనసే. అన్ని అవస్థలలోనూ నువ్వుగా ఉండే ఆ చైతన్యం అదృశ్యం కాదు. ఆ వచ్చిపోయే భావనను గమనించే సాక్షిగా నువ్వు ఉన్న రోజు మనసు సృష్టించే ఆ 'మాయానేను' అనేది ఉండదు. అందుకు మనసును గమనించే సాధన అవసరం. మంత్ర జపం, యోగ సాధనల వల్ల జరిగేది ఇదే. మాయ మనసుకే గానీ, అసలు నేను కి అంటదు.
✳️ ఎవరైనా మోసగాడు నకిలీ వస్తువు అమ్మటానికి వస్తే మొదటిసారి మోసపోవటం సహజం. ప్రతిసారి మోసపోం కదా! మనసు విషయంలో మాత్రం ప్రతిసారీ మోసపోతూనే ఉంటాం. ఎందుకంటే మన మనసే మాయను ఆశ్రయించుకొని ఉంది (దేహాత్మభావనగా). వివేకంతో ఆ మనసుని మాయ నుండి విడదీస్తే నిన్ను నువ్వు గమనించు కోగలుగుతావు. ఈ సత్యం మనకు మనంగా తెలుసు కోవాల్సిందే తప్ప కేవలం వింటే వచ్చేది కాదు. సత్సంగాల్లో శ్రవణం చేసిన విషయాలను మననం చేసుకోవడం ద్వారా మనసుకి ఆ వివేకం కలుగుతుంది. ఏ వికారాలు లేని చైతన్య రూపుడైన ఆ భగవంతుణ్ణి) దైవాన్ని మనం అనుభవించాలే కానీ మరొకరు చూపేది కాదు. చివరికి జ్ఞానులు అయినా దాన్ని అనుభవింప చేయటంలో మనకు సహకరిస్తారే గానీ నేరుగా అనుభవం ఇవ్వరు. తెల్లకాగితం గురించి ఏమి చెప్తాం, దానిపై చిన్నదో పెద్దదో గీత ఉంటే వర్ణించగలుగుతాం. ఆత్మజ్ఞాని పరిస్థితి కూడా అంతే. ఆ అనుభవం మనం కూడా పొందాలంటే అహం మూలాన్వేషణ చేయాలి. ఈ దేహం ఏ శక్తితో కదులుతుందో తెలుసుకోవటము, మనసుకు ఆధారం ఏమిటో కనుక్కోవటమే అహం మూలాన్వేషణ. ఫ్యాన్ తిరిగేందుకు కరెంట్, కారు నడిచేందుకు ఇంధనం ఎలా మూల కారణంగా ఉన్నాయో మన మనోదేహాల వృత్తులకు (పనులకు) ఒక కారణం ఉండాలి కదా! అది అన్వేషిస్తే మనకి సత్యం అర్థం అవుతుంది. ఈ గీతలకు ఆధారంగా ఉన్న తెల్లకాగితంలాంటి దైవం (చైతన్యం) మనకి గోచరం అవుతుంది.
✳️ ప్రపంచం అనగానే మనని మనం మినహాయించి ఎలా ఆలోచిస్తామో, నేను అనగానే అసలు చైతన్య రూపాన్ని మరిచి ఈ మనో దేహాల గురించి ఆలోచిస్తాం. మన అసలు రూపం ఇది కాదని తెలుస్తూనే ఉన్నా, అసలైన రూపం తెలియదు కదా! అందుకే ఈ మాయ తప్పటం లేదు. “నన్ను ఇలా ఎందుకుపుట్టించావు”, “అసలు పుట్టకపోయినా బాగుండేది”, “మళ్ళీ నీ కడుపున పుడతాను" అనే మాటల్లోనే ఈ పుట్టుకకు ముందు ఈ దేహం నేనుకాదు అని చెప్పకనే చెప్తుంటారు. ఎందుకంటే నేను ఉంటాను కానీ మరో రూపంలో పుడ్తాను అని చెప్పటంలో నేను రూపంలేని చైతన్యం అని చెప్పకనే చెప్తున్నారు. నాకు మరణంలేదు అని వ్యక్తం అవుతుంది. అప్పటి నీ రూపం ఏమిటి అనేది తెలుసుకోవటమే అహం మూలాన్వేషణ. దీనిని అనేక పద్ధతుల్లో సాధించవచ్చు. భక్తి, యోగ, జ్ఞాన, వైరాగ్య మార్గాలన్ని ఆ మూలానికే చేరుస్తాయి. *మనం తెలుసుకోవలసిందల్లా ఈ జగత్తును, నిన్ను నడిపే దైవం నీ హృదయంలోనే ఉన్నాయన్న విషయాన్నే. అందువల్లనే మనం ఎక్కడ ఉండి మొక్కుకున్నా ఆయన విని తీర్చగలుగు తున్నాడు. ఆహృదయంలో ఉన్న దైవాన్ని తెలుసుకునే జీవన విధానమే 'భారతీయత' అని, సనాతన ధర్మమని, జీవన విధానమని అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి, అదే బోధిస్తున్నాయి. నువ్వు ఎలా అనుకుంటే అలా దర్శనమిచ్చే సులభసాధ్యుడైన దైవం కనుకనే మన సంస్కృతి అన్ని రూపాల్లో దైవాన్ని కొలిచింది. నిర్గుణ స్వరూపుడైనా ఈ సృష్టికోసం సద్గుణ రూపంతో వచ్చాడు కనుకనే మనకి నిర్గుణ, సద్గుణ ఉపాసనలు రెండూ ముఖ్యమే.*
✳️ *భక్తితో కూడిన సగుణోపాసన మన జీవన విధానాన్ని పవిత్రం చేసి మనం కోరిన రూపంలో దైవసాక్షాత్కారం చేయిస్తుంది. నిర్గుణోపాసన హృదయాన్ని పవిత్రం చేసి సత్యరూపాన్ని అనుభవంలోకి తెస్తుంది. మనకి ఇష్టమైన ఏ రూపంలోనైనా దైవాన్ని ప్రార్థించి, పూజించి, ధ్యానించటం ద్వారా ఈ మనసుని 'నిద్ర పుచ్చితే' మూలంలోనే ఉన్న ఆదైవం తనదైన చైతన్య రూపంతో మనకి అనుభవంలోకి
వస్తాడు.*
*ఓం నమోభగవతే శ్రీరమణా
అన్ని సత్యాలు, అన్ని సమస్యల పరిష్కారాలు, జన్మ జన్మల రహస్యాలు,ఆత్మజ్ఞానం, త్రికాల జ్ణానం ఇలా ఎన్నో ఎన్నెన్నో సృష్టి రహస్యాలు సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది.
No comments:
Post a Comment