Xi.x. 1-5. 190922-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
ఏది ముందు కావాలి?
➖➖➖✍️
'అది ఒక చిన్న కొండ. ఆ కొండ మీద ఓ పూరిగుడిసె! ఓ ముసలిభార్యాభర్తా, వారికొడుకూ కోడలూ ఆ ఇంట్లో ఉండేవారు. అంతాబాగానే ఉంది. పొద్దున లేచి గుడిసెలోంచి బయటకు రాగానే విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది, ఎదురుగుండా సూర్యుడు ఉదయిస్తూ పలకరిస్తాడు. కొండ కింద ఉన్న ఊరిలోకి ఈ ఇంటి పెద్దాయనా, ఆయన కొడుకూ పనికి వెళ్తారు. రోజంతా ఒళ్లు వంచి పనిచేసి, మర్నాటికి సరిపడా సంపాదించుకొని ఇంటికి చేరతారు.
ఓ రోజు తండ్రీకొడుకులు ఎప్పటిలాగే పనికి బయల్దేరారు. ఆ సాయంత్రం వారి ఇంటి ముందుకి ఓ నలుగురు వింత మనుషులు వచ్చారు. చారెడు మీసాలు, బారెడు గడ్డంతో వారంతా చాలా చిత్రంగా ఉన్నారు. కానీ వారి మొహాలు మాత్రం తేజస్సుతో వెలిగిపోతున్నాయి. ‘ఎవరయ్యా మీరు! పాపం దారి తప్పి వచ్చినట్లున్నారు. రండి కాసిని మంచినీళ్లు తాగండి. మాతో కలిసి భోంచేయండి. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి,’ అంటూ ఇంటావిడ సాదరంగా ఆహ్వానించింది.
ఇంటావిడ మాటలకు ఆ నలుగురూ చిరునవ్వు నవ్వి ‘మరేం ఫర్వాలేదు. మేము ఈ అరుగు మీదే కూర్చుంటాము. మీ ఇంట్లోవారంతా వచ్చిన తర్వాతే మేము ఇంట్లోకి వస్తాము,’ అని చెప్పారు.
మరికాసేపటికి తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికి చేరుకోనే చేరుకున్నారు. ఇంటి బయట ఉన్నవారి గురించి ఆ ఇంటావిడ వారితో చెప్పింది. వెంటనే ఆ ఇంటి పెద్దాయన బయటకు వెళ్లి- ‘ఇంట్లో వారమంతా వచ్చేశాము. దయచేసి లోపలకి రండి,’ అంటూ ఆహ్వానించాడు.
‘మేము నలుగురమూ ఒకేసారి లోపలకి రావడం కుదరదు. మాలో ఒకరు కీర్తికి ప్రతినిధి, మరొకరు విజయానికి సూచన, ఇంకొకరు డబ్బుకి చిహ్నం, నేను ప్రేమకు ప్రతిరూపాన్ని. మాలో ఎవరు మీ ఇంట్లోకి మొదటగా రావాలో నిర్ణయించుకోండి,’ అని వారిలో ఒకరు చెప్పారు.
వారి మాటలు విన్న పెద్దాయన ఇంట్లోకి వెళ్లి విషయం చెప్పాడు- ‘ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏముంది? ముందు డబ్బుని లోపలకి రమ్మనండి. ఈ పేదరికంతో చచ్చిపోతున్నాను,’ అన్నాడు కొడుకు.
‘అబ్బే డబ్బుదేముంది! ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కీర్తి శాశ్వతం కదా. ముందు ఆ కీర్తిని లోపలకు రమ్మని పిలవండి,’ అని చెప్పింది కోడలు.
‘ఇన్నాళ్లూ నేను జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఓడిపోతూనే ఉన్నాను. ఇప్పటికైనా నేను విజయాలను అందుకోవాలని అనుకుంటున్నాను. నేను విజయాన్నే లోపలకు పిలుస్తాను,’ అన్నాడు తండ్రి.
‘భలేవారే!మనం అరాయించుకోలేనంత డబ్బు, డప్పు కొట్టుకొనేంత కీర్తి, తలపొగరెక్కేంత విజయం లేకపోయినా ఇన్నాళ్లూ సుఖంగా ఉన్నామా లేదా! అందుకు కారణం మన మధ్య ఉన్న ప్రేమే! ఆ ప్రేమ మన జీవితాలలో లేకపోతే... తతిమావి ఏవుండి మాత్రం ఏం లాభం? నా మాట విని వెళ్లి ఆ ప్రేమను లోపలకు పిలవండి,’ అని గట్టిగా చెప్పింది భార్య.
ఆవిడ మాట అందరికీ సబబుగానే తోచింది. వెంటనే వెళ్లి ‘మీలో ప్రేమకు ప్రతినిధి ఎవరో ముందుగా రండి!’ అని పెద్దాయన పిలవగానే అందులో ఒకరు లేచి లోపలకి అడుగుపెట్టారు. విచిత్రం! ప్రేమ లోపలకు అడుగుపెట్టగానే మిగతావారు కూడా ఆయన వెంటనే లోపలకు వచ్చేశారు.
‘మీరు ప్రేమని కాకుండా మిగతా ఏ ఒక్కరిని ఎంచుకున్నా, మిగతా ముగ్గురూ తిరిగి వెళ్లిపోయేవారు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట విజయం ఉంటుంది. విజయం ఉన్నచోట డబ్బు, కీర్తి ఉంటాయి. మిగతా లక్షణాలు అలా కాదు! ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు!’ అన్నాడు విజయానికి ప్రతినిధిగా ఉన్నవాడు.
అప్పటి నుంచీ వారి జీవితాల్లోనూ, మనసుల్లోనూ ఏ లోటూ లేకుండా పోయింది.✍️
. 🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment