Saturday, September 3, 2022

బాహ్యసుఖం క్షణికం. దుఃఖంతో కూడి ఉంటుంది. కాబట్టి మనం మనస్సును అంతర్ముఖం చేసి, ఆత్మతో అనుసంధానం చేస్తే కలిగే సుఖం అనంతం.

 మనం సాధారణంగా సుఖాన్ని బయట ప్రపంచంలో వెదుక్కుంటాం. కొద్దిపాటి సుఖం కలిగినా దానినే గొప్పగా అనుకుంటాము. ఆలోచిస్తే మనం అనుభవించే సుఖం బయట లేదు. మన మనసులో ఉంది. ఒకే వస్తువు, ఒకే సంఘటన ఒకే విషయం ఒకరికి సుఖాన్ని ఇస్తే, మరొకరికి దుఃఖం తెచ్చిపెడుతుంది. కాబట్టి సుఖం అనే దానికి కేంద్రం మన అంతరాత్మ. అక్కడ కలిగే సుఖమే శాశ్వతమైన సుఖం. బాహ్యసుఖం క్షణికం. దుఃఖంతో కూడి ఉంటుంది. కాబట్టి మనం మనస్సును అంతర్ముఖం చేసి, ఆత్మతో అనుసంధానం చేస్తే కలిగే సుఖం అనంతం.

అంతర్ ఆరామః.. అంటే ఆత్మయందు రమించడం, క్రీడించడం. మానవులు సాధారణంగా బయట కనపడే వస్తువులతో, స్త్రీపురుషులతో, ధనంతో, ఆస్తులతో ఆడుకుంటూ ఉంటారు. వాటి యందే రమిస్తుంటారు. వాటియందే లీనమై వాటిని పట్టుకొని వేళ్లాడుతుంటారు. ఇది మానవ నైజం. ఇవి ఎక్కడ తమను విడిచి పెట్టి వెళ్లిపోతాయో అని నిరంతరం భయపడుతూ వేదన చెందుతుంటారు. ఇది సుఖదుఃఖాల మయం. అదే ఆత్మలో మనసును ఉంచి క్రీడిస్తే, రమిస్తే, శాశ్వతానందము కలుగుతుంది. కాబట్టి మనం వాస్తవాన్ని గ్రహించాలి.

అంతర్ జ్యోతి అంటే లోపల వెలిగే జ్యోతి. అదే ఆత్మజ్యోతి, సూర్యుడు, దాని వెలుగు పడి ప్రతిబింబంగా ప్రకాశించే చంద్రుడు, జ్యోతులు ఇవి మనకు కనపడే వెలుగు. కాని ప్రతివాడిలో ఆత్మ జ్యోతిలాగా వెలుగు తుంటుంది. సూర్యుడు ప్రపంచంలోని వస్తువులను ప్రకాశింపచేస్తే ఆత్మజ్యోతి బుద్ధిని ప్రకాశింపచేస్తుంది. సూర్యుని వెలుగులో మనం వస్తువులను, మనుషులను చూడాలంటే మనకు కళ్లు కావాలి. ఆ కళ్లకు చూచే శక్తి కావాలి. ఆ శక్తి మనలో ఉన్నచైతన్యం వలన కలుగుతుంది. ఆ చైతన్యమే ఆత్మస్వరూపము. ఆ ఆత్మ స్వరూపము మనలో జ్యోతిలాగా వెలుగుతుంటుంది. మనలోని ఆ వెలిగే జ్యోతిని ఆశ్రయించాలి. దీపం దగ్గరకు పురుగు చేరితే మాడి పోతుంది. ఆత్మజ్యోతి దగ్గరకు మనసు చేరితో మాడి పోదు. పైగా ప్రకాశం సంతరించుకుంటుంది. ఆనందంతో నిండి పోతుంది. కాబట్టి మనం ప్రాపంచిక విషయముల మీద, బంధుమిత్రుల మీదా, ధనము, ఆస్తులు, పదవుల మీద వ్యామోహమును వదలిపెట్టి, ఆత్మలోనే సుఖాన్ని అనుభవిస్తూ, ఆత్మలోనే రమిస్తూ, నిరంతర ఆత్మానందం కోసమే ప్రయత్నం చేయాలి. అదే మానవ కర్తవ్యము. దీనినే బ్రహ్మనిర్వాణము అని అంటారు.

🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

No comments:

Post a Comment