Thursday, September 22, 2022

అర్జునుడి దశనామాలు:

 210922c2134.   220922-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀150.

               శ్రీ మహాభారతం
                  ➖➖➖✍️
                  150 వ భాగము
   శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:

         అర్జునుడి దశనామాలు:
                     ▪️〰️▪️

ఆ మాటలు విన్న ఉత్తరకుమారుడు సంభ్రమాశ్చర్యాలతో సందేహంగా… “బృహన్నలా! అర్జునికి పది పేర్లున్నాయి వాటిని వివరిస్తే నేను నిన్ను అర్జునుడని నమ్ముతాను.” అన్నాడు. 

బృహన్నల చిరునవ్వుతో ఉత్తరుని చూసి… “కుమారా! అర్జునుడు, పల్గుణుడు, పార్ధుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభస్తుడు, విజయుడు, జిష్ణువు, సవ్యచాచి, ధనుంజయుడు అనే దశ నామాలు ఉన్నాయి.” అన్నాడు. 

అప్పటికీ ఉత్తరునికి విశ్వాసం కుదరక… “బృహన్నలా ! ఆ దశనామాలు వివరిస్తే నువ్వే అర్జునుడవని నమ్ముతాను.”అన్నాడు.

అర్జునుడు… “కుమారా! నేను ధరణి అంతటిని జయించి ధనమును సముపార్జింతిని కనుక ధనుంజయుడ నయ్యాను. ఎవ్వరితోనైనా పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడి నయ్యాను.   నేను ఎల్లప్పుడూ నా రధమునకు తెల్లటి అశ్వాలను మాత్రమే పూన్చుతాను కనుక శ్వేత వాహనుడిని అయ్యాను. నాకు ఇంద్రుడు ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రకాసిస్తుంటుంది కనుక కిరీటి నయ్యాను. యుద్ధంలో శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి భీభత్సమైన పరిస్థితిలో కూడా సంయమమును కోల్పోయి జుగుప్సాకరమైన, భీభత్సమైన పనులు చెయ్యను కనుక భీభత్సుడి నయ్యాను. నేను గాండీవాన్ని ఉపయోగించే సమయంలో రెండు చేతులతో నారిని సంధిస్తాను. కాని ఎక్కువగా ఎడమచేతితో అతి సమర్ధంగా నారిని సంధిస్తాను కనుక సవ్యసాచిని అయ్యాను. నేను ఎక్కువ తెల్లగా ఉంటాను కనుక నన్ను అర్జునుడు అంటారు. నేను ఉత్తర పల్గుణీ నక్షత్రంలో జన్మించాను కనుక ఫల్గుణుడిని అయ్యాను. మా అన్నయ్య ధర్మరాజు. నా కంటి ముందర ఆయనను ఎవరైనా ఏదైనా హాని కలిగించినా, దేవతలు అడ్డు తగిలినా వారిని చంపక వదలను. కనుక జిష్ణువు అనే పేరు వచ్చింది. మా అమ్మ అసలు పేరు పృధ. కుంతి భోజుని కుమార్తె కనుక కుంతీదేవి అయింది. పృధపుతృడిని కనుక పార్ధుడిని అయ్యాను. అయినా ఉత్తర కుమారా! నేను ఎల్లప్పుడూ సత్యమునే పలికే ధర్మరాజు తమ్ముడిని. నేను అసత్యం చెప్పను. నేను శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వనదహనంలో అగ్ని దేవునికి సాయపడి నందుకు బ్రహ్మ, రుద్రులు ప్రత్యక్షమై నాకు దివ్యాస్త్రాలతో పాటు నాకు కృష్ణుడు అనే పదకొండవ నామం బహూకరించారు. నేను నివాత కవచులను సంహరించిన సమయంలో ఇంద్రుడు ఈ కిరీటాన్ని బహుకరించాడు. దేవతలందరూ మెచ్చి ఈ శంఖమును ఇచ్చారు కనుక దీనిని దేవదత్తము అంటారు. చిత్రసేనుడు అనే గంధర్వుడు సుయోధనుని బంధీని చేసినపుడు గంధర్వులతో పోరాడి వారిని గెలిచాను కనుక నీవు భపడ వలసిన పని లేదు. మనం కౌరవ సైన్యాలను ఓడించి గోవులను మరల్చగలం.” అన్నాడు.


ఉత్తరకుమారుడు స్వస్థుడగుట:

ఉత్తర కుమారుడు చెట్టుదిగి సంభ్రమాశ్చర్యాలతో అర్జునినికి నమస్కరించాడు. ఉత్తర కుమారుడు… “అర్జునా! నా అదృష్ట దేవతలా నువ్వు నాకు కనిపించావు. చాపల్యంతో నేను ఏదైనా నిన్ను అని ఉంటే నన్ను మన్నించు. నీ అండ దొరికినందుకు నా ఆనందానికిక అవధులు లేవు. నన్ను కనికరించు!” అన్నాడు. 

అర్జునుడు రధం దిగి ఉత్తరుని ప్రియమార కౌగలించుకున్నాడు.

ఉత్తరుడు రధం ఎక్కి… ”అర్జునా ఇప్పుడు నా భయం తొలగి పోయింది. అర్జునినికి సారధిని కావలెనన్న నా కోరిక ఈడేరింది. నీవు నన్ను ఆజ్ఞాపించి సారధ్యం చేయించుకుని కౌరవులను జయించి గోవులను మరల్పుము.”అన్నాడు. 

అర్జునుడు వాత్సల్యంతో… “కుమారా! భయపడకుము నీ మీద గాలి కూడా సోకనివ్వను. నీకు రక్షణ కల్పించడమే నా కర్తవ్యం!” అన్నాడు. 

ఉత్తరుడు… “అర్జునా! నీ నిజరూపం తెలిసిన వెంటనే నా భయం పటాపంచలైంది. ఈ పేడి రూపం ఎలా వచ్చిందో తెలుసు కోవాలని ఉంది.”అన్నాడు. 

అర్జునుడు… “ఉత్తరకుమారా ! మా అన్నగారి ఆజ్ఞను అనుసరించి బ్రహ్మచర్య వ్రతం స్వీకరించిన సమయంలో దేవేంద్రుని ఆహ్వానంపై ఇంద్రలోకం వెళ్ళాను. అక్కడ ఊర్వశి కోరికను నిరాకరించిన నన్ను పేడి రూపం ధరించమని శపించింది. అజ్ఞాతవాస సమయంలో అది నాకు వరంలా పరిణమించింది. అజ్ఞాత వాసం ముగియగానే పేడి రూపం పోయింది. ఇప్పుడు నేను అర్జునుడను.” అన్నాడు. 

ఉత్తరుడు… “అర్జునా ఇప్పుడు నన్ను ఏమి చెయ్యమటావు?” అని అడిగాడు. 

అర్జునుడు… “నీవు గాండీవమును తూణీరములను ఇతర ఆయుధములను తీసుకుని మిగిలిన ఆయుధములను అలాగే ఉంచు!” అన్నాడు. 

ఉత్తర కుమారుడు అలాగే చేసాడు. అర్జునుడు వాటిని ధరించి గాండీవాన్ని ఎక్కు పెట్టి అల్లె త్రాటిని మ్రోగించి అగ్ని దేవుని తలచగానే అమోఘమైన కపిధ్వజం సాక్షాత్కరించింది. ఉత్తర కుమారుని సింహపతాకమున్న ధ్వజం శమీవృక్షం మీద పెట్టి కపిధ్వజాన్ని రధమునకు కట్టాడు. మనమున తలవగానే చేతికి దేవదత్తము వచ్చినది.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment