Sunday, September 4, 2022

అందుకే ధర్మ మార్గంతో కూడిన భక్తులుగా మెలగండి. ఆ శ్రీహరి మిమ్మలని ఎప్పుడూ కాపాడుతాడు.

 ”హస్తస్య భూషణం దానం
సత్యం కంఠస్య భూషణం
కర్ణస్య భూషణం శాస్త్రం
భూషణైః కిం ప్రయోజనమ్.”
                ➖➖➖✍️


హస్తస్య భూషణం దానం - చేతులకు దానమే భూషణం!

సత్యం  కంఠస్య  భూషణం  - కంఠమునకు  సత్యమే  భూషణం!

శ్రోత్రస్య  భూషణం శాస్త్రం - చెవికి ధర్మవచనములే ఆభరణములని ఇవే సహజమైన, శాశ్వతమైన భూషణాలని ఘోషించాడు ఒక కవి.

మానవ ధర్మానికి సంబంధించిన ఈ సుగుణాలు లేకుంటే మానవజన్మ వ్యర్థమౌతుందని  అన్నాడు.

 దీనికి ఉదాహరణగా ఒక చిన్న కధ…

ఒక అడవిలో మనుష్య శవం ఉంది. దానికి కొద్దిదూరం లో   ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు.

ఆ శవాన్ని తినేందుకు ఒక నక్క వచ్చింది, ముందుగా శవం చేతులను సమీపించింది,   ఆ మహర్షికి అంతరాయం కలిగి కన్నులు తెరిచి చూచాడు. 

వెంటనే దివ్యదృష్టితో చనిపోయిన ఆ వ్యక్తిని గురించి తెలుసుకున్నాడు.

నక్కను ఉద్దేశించి… ”ఈతని చేతులు ఎన్నడూ దానం గానీ,  భగవంతుని గురించి జపం  ఎప్పుడు  చేసి  ఎరుగవు కనుక వాటిని తినకూడదు!” అన్నాడు. 

అప్పుడా నక్క చేతులను వదిలి చెవులను తినబోగా,  “ఈ చెవులు ఎన్నడూ ధర్మశాస్త్రాలు గానీ , ఆత్మజ్ఞానానికి, శ్రీహరి నామం     సంబంధించిన అంశాలనుగానీ వినలేదు. కాబట్టి చెవులు ముట్టదగినవి కావు!” అన్నాడు. 

అపుడా నక్క కళ్ళను తినబోయింది.

”ఈ నేత్రాలెన్నడూ సాధువులను,. భగవంతుని  దర్శించినవి కావు కనుక తినరాదు!” అన్నాడు.

అపుడా నక్క కాళ్ళను తిందామనుకుంది.

అది గ్రహించి , “ఆ కాళ్ళు ఏనాడూ  మానవులను భవసాగరము నుంచి తరింప  జేసే      సజ్జనులను , సాధువులను, భగవంతుని(శ్రీహరిని) దర్శించి ఎరుగవు కావున తినడానికి తగినవి కావు!” అన్నాడు.

మృతుడి ఉదరం అన్యాయార్జితంతో పెరిగింది కాబట్టి అదీ తినకూడనిదేనని ముని చెప్పాడు.

అపుడా నక్క కనీసం తలనైనా తిని తన కడుపునింపుకుందా మనుకుంది. 

”బతికి ఉండగా ఇతగాడి తల గర్వంతో మిడిసిపడుతుండేది. అదీ తినేందుకు తగింది కాద”ని మహర్షి వారించాడు.


ఈ కథ ద్వారా మనం గ్రహించవలసినదేది అంటే అధర్మం వైపు మానవుడు మెలగకూడదు, అతనితో ఎవ్వరూ స్నేహం చెయ్యరు, సహాయం కూడా చేయరు, కడకు చనిపోతే పశుపక్ష్యాదులు కూడా తినవు. అందుకే ధర్మ మార్గంతో కూడిన  భక్తులుగా మెలగండి. ఆ శ్రీహరి మిమ్మలని ఎప్పుడూ కాపాడుతాడు.

సత్యవాదీ, ధర్మాత్ముడూ, సదాచారశీలీ, సౌశీల్యమూర్తిగా మనిషి మెలిగితేనే సంపూర్ణత్వం    పొంది   మంచి హరి భక్తుడిగా మెలిగి చివరికి ఆ శ్రీహరిని చేరుకుంటాడు.✍️
.

No comments:

Post a Comment