Sunday, September 11, 2022

మూడు విషయాలలో మనిషి వెంటనే సంతృప్తి చెందాలి

 సంతోషస్త్రిషు కర్తవ్యః 
స్వదారే భోజనే ధనే
 త్రిష చైవ న కర్తవ్యోః 
అధ్యయనే తపదానయోః

సంతోషస్త్రిషు అంటే మూడు విషయాలలో మనిషి వెంటనే సంతృప్తి చెందాలి

 అవి ఏమిటంటే ఒకటి స్వదార అంటే భార్య, రెండు భోజనే, మూడు ధనే. 

అలాగే మూడు విషయాలలో ఎప్పుడూ సంతృప్తి పడరాదు అవి అధ్యయనం అంటే తనకి లభించిన  జ్ఞానం, తపం, మూడవది తను చేసే దానం.

ఈ సుభాషితరత్నాన్ని ఆచరణలో పెట్టిన నాడు లోకంలో అసలు అరాచకం అనేదే వుండదు. 

పర కాంతని అమ్మ గా చెల్లెలు గా గౌరవించమని చెప్పే గొప్ప సాంప్రదాయం మన జాతి సొంతం. 

ఛత్రపతి శివాజీ కొలువు కి ఒక మొఘలు స్త్రీని చెఱ బట్టి తీసుకుని వస్తే మేలి ముసుగులో వున్న ఆ తల్లి అందానికి పొంగిపోయి మరు జన్మలో నీ కడుపున పుడితే నీ అందం లో కొంతైనా నాకురాదా అన గలిగిన ఘన చరిత మనది. 

రెండవది భోజనం, ఆకలిని తట్టుకోలేనినాడు మొదట చేసేది దొంగతనం. 

చివరగా ధనం అంటే సంపద, కోరక మనకి లభించిన దానితో సంతృప్తి చెందక పోవడం లోకంలో సకల నేరాలకు మూల కారణం.

ఇక పోతే ఏ విషయాలలో సంతృప్తి చెందకూడదు అంటే..

 అధ్యయనం అంటే  జ్ఞాన సముపార్జన విషయం. ఎంత నేర్చినా తరగనిది జ్ఞానం అందుకే అణిగిమణిగి వుండాలంటారు. 

రెండు తపం ఇది మోక్ష సాధన కి మొదటి మెట్టు. ఒక నిర్దిష్ట సమయం పూజ చేసి ఇక చాలు అనుకున్న నాడు మోక్ష సాధన సాధ్యం కాదు కదా. 

చివరగా దానం, దానం చేసేటప్పుడు మనసులో రమించగలిగిన రోజు దానం చాలు అనే వాళ్ళు వుండరు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే సంతృప్తి పడవలసిన విషయాలు సంపదకి సంబంధించినవి అంటే లక్ష్మి కటాక్షం, సంతృప్తి పడకూడని విషయాలు ఙానానికి మోక్షానికి సంబంధించినవి ఇవి సరస్వతీ కటాక్షం.

లోకంలో చిత్రమైన వ్యవహారం ఏమిటంటే లక్ష్మి విషయంలో కలిమి, సరస్వతి విషయంలో లేమి ఎవ్వరూ ఒప్పుకోరు.

 కోట్లు సంపాదించే వాడు కూడా ఏదో అరకొర సంపాదన అంటాడు కానీ నాకు ఇంత మిగులుతుంది వాటిని సేవా కార్యక్రమాలకు వినియోగిద్దాం అనడు

. మరి పట్టు మని పది తరగతులు కూడా చదవని వాడు కూడా ఊరుకోవయ్యా అది నీకు తెలియని విషయం అంటే నాకెందుకు తెలియదు నాకూ తెలుసు అంటాడు.

 ఈ వ్యవహారాన్ని మాని సుభాషితాన్ని ఆచరణలో పెట్టిన వాడే జ్ఞాని.


🔹🔸🔹🔸🔹🔸🔹

No comments:

Post a Comment